Ugadi : శ్రీ విశ్వావసు ఉగాది... విశ్వానికి, మానవుడికి వారధి!
ప్రపంచ వ్యాప్తంగా ఉండే తెలుగు వారందరూ ఎంతో గొప్ప ఉత్సవంగా, ఉత్తేజంగా, ఉల్లాసంగా జరుపుకునే పండుగ ఉగాది పండుగ! కాల చక్రంలో చైత్రమాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి రోజు మొదలయ్యే పండుగ – ఉగాది! నిజానికి పండుగలన్నీ ప్రారంభమయ్యేది ఉగాది తోనే.
ప్రపంచ వ్యాప్తంగా ఉండే తెలుగు వారందరూ ఎంతో గొప్ప ఉత్సవంగా, ఉత్తేజంగా, ఉల్లాసంగా జరుపుకునే పండుగ ఉగాది పండుగ! కాల చక్రంలో చైత్రమాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి రోజు మొదలయ్యే పండుగ – ఉగాది! నిజానికి పండుగలన్నీ ప్రారంభమయ్యేది ఉగాది తోనే. అందుకే ఉగాదిని కొత్త సంవత్సరంగా, ఒక కొత్త శకానికి ఆదిగా, కొత్త సంవత్సరానికి తొలి పునాదిగా భావిస్తాం. భారతీయ కాలమానం, జ్యోతిష్య శాస్త్రం, ఖగోళ శాస్త్ర ప్రకారం చేసిన పరిశోధనల్లో ఒక సంవత్సర కాలపు రుతువుల సంచారాన్ని, శీతోష్ణస్థితి పరిస్థితులని, నైసర్గిక పరిణామాలను ఆధారంగా చేసుకొని ఈ ఉగాదిని సంవత్సరానికి తొలి రోజు గా మన ప్రాచీనులు గుర్తించి కాలాన్ని లెక్కించారు.
60 ఏళ్ల కేలండర్‌లో 39వ సంవత్సరం
మన తెలుగు పంచాంగం లో కూడా ఉగాదికి ప్రత్యేక విశిష్టత ఉంది. మన తెలుగువారి విశ్వాసాలలో కాలచక్రం ప్రతి 60 ఏళ్లకు ఒకసారి తిరిగి వస్తుందని గమనించి దాని ప్రకారం ప్రతి సంవత్సరానికి ఒక ప్రత్యేకమైన పేరుని మన పూర్వీకులు సూచించారు. అలా ప్రభవ, విభవ, ప్రమోదూత ఇలాంటి పేర్ల నుంచి మొదలుకొని అక్షయ వరకు మొత్తం 60 సంవత్సరాలుగా తెలుగు క్యాలెండర్ నిర్ధారించడం జరిగింది. వీటిలో 39వ సంవత్సరం ఈరోజు నుంచి ప్రారంభం అవుతున్న “శ్రీ విశ్వావసు నామ సంవత్సరం”!
ఉగాది అనగానే మనకు గుర్తొచ్చేది వేప పూత, మామిడి కాత, కోయిల కూత, పంచాంగంలోని మన భవిత! భారతీయ పండుగలన్నీ ప్రకృతి గమనాలు, రుతువులను అనుసరించి నిర్ధారించబడిన పండుగలు కావడం విశేషం. అందుకే రుతువులు మారి కాలం వసంత కాలంలోకి మారుతున్న సూచికగా ఈ ఉగాది పండుగని మనం జరుపుకుంటూ వస్తున్నాం. ఎండలు, మామిడి పళ్ళు, కొత్త చిగుళ్ళతో వేప చెట్లు, కోయిల పాటలు, మల్లె పూల పరిమళాలు ఇవి ఈ కాలపు సూచికలు, ఉగాదికి ప్రతీకలు. ఇలా ప్రకృతి కి, మానవ జీవితానికి మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలను అత్యున్నతంగా చూపించే కుటుంబ ఉత్సవం, తెలుగువారందరి సామూహిక ఉత్సవం ఉగాది పండుగ.
విశ్వంతో అను సంధానం:-
ఈ సంవత్సరం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. ఎప్పుడైనా తనకు మాత్రమే కాదు, తన చుట్టూ ఉండే వారికి, తనపై ఆధారపడ్డ వారికి, తన కుటుంబ సభ్యులకు అందరికీ సుఖ సంతోషాలను కలిగించడమే మానవ జన్మ లక్ష్యం. అందుకే మనలోని ప్రశాంతతను, మనలాంటి మనుషులలోని కరుణ, దయ, జాలి, సానుభూతి, సాటి మానవుల పట్ల మనకుండే ప్రేమ, గౌరవం లాంటి మంచి గుణాలను పెంచుకోవాలి. అవే మనల్ని మానవులుగా నిలబెడతాయి. ఆ లక్షణాలు సాధనకు శ్రీకారమే ఉగాది!
మిగతా జంతుజాలానికి, మనకు మధ్య ఉండే ఒకే ఒక్క తేడా సాటి జీవుల పట్ల దయతో వుండటం, శాంతంగా ఉండటం, సానుభూతిగా ఉండడమే!. అందుకే సృష్టిలోని సమస్త చరాచర జీవరాశికి ఆనందాన్ని కలిగించే పని చేయడం ద్వారా సార్థకతను సాధించే అరుదైన అదృష్టం మానవ జన్మకు దక్కింది. ఏ స్థాయిలో ఉన్నా, ఏ అధికారంలో ఉన్న, ఏ నేలమీద ఉన్నా, ఏ లోకంలో ఉన్నా మనిషిగా ఎదగడం, మానవుడిగా ఆలోచించడం, మానవ కల్యాణం కోసం, మానవ ప్రగతి కోసం దోహదపడటం లోనే మనదైన ప్రత్యేకత, మనదైన మానవ జన్మకు అర్థం, పరమార్థం లభిస్తుంది.
“విశ్వావసు” అనే పదానికి అర్థం విశ్వానికి సంబంధించింది అని! విశ్వానికి సంబంధించినవి ఏమున్నాయి? పంచభూతాలు, సకల చరాచర సృష్టి, నవగ్రహాలు, పాలపుంత, గెలాక్సీలు...! ఇవన్నీ విశ్వానికి సంబంధించినవి. సాధారణంగా భౌతిక శాస్త్రాలు, ఇతర విజ్ఞాన శాస్త్రాల మేరకు ఒక మనిషి జీవన గమనాన్ని, మానసిక స్థాయిని, శారీరక స్థితిగతులను నిర్ధారించేవి ఆయనకు సంబంధించిన శారీరక ధర్మాలు, భౌతిక శారీరక వ్యవస్థలు గానే గమనిస్తాం! కానీ ఒక మనిషి శరీరానికి బయట బహిర్గతం గా ఉండే వాతావరణ పరిస్థితులు, శీతోష్ణస్థితి, భౌగోళిక నైసర్గిక పరిస్థితులు కూడా ప్రభావితం చేస్తాయి.
మానవాళి మనోభావాలు ప్రభావితం
అయితే భారతీయ తాత్వికత ఈ వివరణను దాటేసి మనిషిని, ఆయన ఆలోచనని, ఆయన హావభావాలని, భావోద్వేగాల్ని విశ్వశక్తులు కూడా ప్రభావితం చేస్తాయని నిరూపించింది. దీన్నే “లైఫ్ అండ్ స్పేస్ సిద్ధాంతం” అంటారు. “లైఫ్” అనేది మనిషి జీవితానికి భౌతిక ధర్మాలకు సంబంధించింది అయితే అతని చుట్టూ ఆవరించి ఉండే పర్యావరణ పరమైన ప్రాకృతికమైన అంశాలన్నీ నిబిడీకృతమైనది “స్పేస్”.
అయితే మనిషిని “అనువంశికత” అంటే వంశపారంపర్య లక్షణాలు, అలాగే “పరిసరాలు”, (భౌతిక, సామాజిక పరిసరాలు) ప్రభావితం చేస్తాయనేది వివిధ మనోవైజ్ఞానిక పరిశోధనలలో కూడా నిర్ధారణ అయింది. ఇప్పటివరకు మనకు అందుబాటులో వున్న విజ్ఞాన శాస్త్రాలన్నీ ఆవిష్కరించింది ఇదే! కానీ భారతీయ పంచాంగం, భారతీయ ఆధ్యాత్మికత, భారతీయ శాస్త్రీయ విజ్ఞానం అంతకుమించి ఆలోచించి భూమికి అవతల గ్రహాలు కూడా, విశ్వంలోని వివిధ అంశాలు కూడా మానవాళి మనోభావాలని, మనోవికాసాన్ని ప్రభావితం చేస్తాయని చెప్పడం గమనార్హం.
ఈ నేపథ్యంలోనే “విశ్వావసు” అనే భావన విశ్వంలోని ఎన్నో అంశాలు, నక్షత్రాలు, గ్రహగతులు, ఇతర అంశాలన్నీ కూడా కలిసి మానవుడి మనోగతాన్ని, ప్రవర్తనని, పరిశీలనని, ప్రభావితం చేస్తాయి అనే అంశానికి ఉదాహరణగా నిలుస్తున్నాయి. అందుకే ఈ తెలుగు సంవత్సరాదిని “విశ్వావసు” నామంతో పిలవడం వల్ల మనం అంతా కేవలం మనకు, మనం నివసిస్తున్న భూమికి సంబంధించిన అంశాలు మాత్రమే కాకుండా, సకల విశ్వానికి సంబంధించిన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటూ ప్రయత్నాలు చేయాలి అనే అంశాన్ని ఈ సంవత్సరం మనకు గుర్తు చేస్తుంది.
సకల జనులు సుఖంగా ఉండాలి
ఇదే విషయాన్ని భారతీయ వేదాంతులు, తాత్వికులు, “సర్వేజనా సుఖినో భవంతు” అనే మాటలుగా చెబుతూ, దాంతోపాటు “లోకాస్సమస్తా సుఖినోభవంతు” అని అన్నారు. అంటే ఈ భూమిపైనున్న సకల జనులు సుఖంగా ఉండాలి అనేది ఒక ఆకాంక్ష అయితే, వీరు అందరూ సుఖంగా ఉండటానికి దోహదం చేసే సర్వలోకాలు కూడా సుఖంగా, సంతోషంగా, శాంతియుతంగా ఉండాలనే ఆకాంక్ష ఈ శ్లోకంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇలా విశిష్టమైన సంవత్సరంగా “విశ్వావసు నామ సంవత్సరం” మానవాళికి, తెలుగు ప్రజలందరికీ శుభాలనీ, సంతోషాలని చేకూర్చే దిశగా తొలి అడుగు అని చెప్పవచ్చు.
గత సంవత్సరం “శ్రీ క్రోధి” నామ సంవత్సరం ఆగ్రహానికి, ఆవేశానికి, కోపానికి, క్రోధానికి మనిషిలోని విధ్వంసక శక్తులకీ ప్రతిబింబంగా ఉంటే ఈ సంవత్సరం మనిషికి మాత్రమే గాక సమస్త లోకాలకి, సమస్త విశ్వానికి సంబంధించిన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకునే విధంగా విస్తృత భావనతో, విశ్వ ప్రాతిపదికపై రూపొందడం, మనిషి విశ్వమానవుడుగా ఎదగడానికి దోహదపడే ఒక ఆలంబనగా మనం భావించవచ్చు. అందుకే “శ్రీ విశ్వావసు” నామ సంవత్సరం మానవుడికి - విశ్వానికి మధ్య వారధిని నిర్మించే స్ఫూర్తిని బలోపేతం చేసే సంవత్సరం అని ఊహించవచ్చు.
ఉగాది పచ్చడి – సకల అనుభవాల మత్తడి:
ఉగాది అనగానే మనకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. పచ్చడి ఇస్తున్న సందేశం జీవితంలోని వివిధ రకాల అనుభవాలను ఆహ్వానించాలనేదే! షడ్రుచుల సమ్మేళనంగా ఆరు రుచుల తో కూడిన ఉగాది పచ్చడి తీపి, ఉప్పు, వగరు, పులుపు, చేదు, కారం, ఇలా ఆరు రుచులతో మనకు చెబుతున్న సందేశం. జీవితంలో కూడా మనకు అన్ని రకాల అనుభవాలు ఉంటాయని అదే జీవితంలోని పరమార్ధం అని, గెలుపు-ఓటములు, విషాదము-ఆనందము మన జీవితంలో అంతర్భాగమేనని! వీటన్నిటిని సమపాళ్లలో స్వీకరిస్తూ నిరంతరం ప్రగతి వైపు గా. పురోగతి వైపు గా, ఎదగడమే మన కర్తవ్యం.
ఉగాది.. తెలుగు జీవన సందేశం
మనుషులుగా మనం ఆరు రకాలుగా ఎదగాలని అనుకుంటాం. శారీరకంగా, భౌద్ధికంగా, భావోద్వేగాల పరంగా, నైతికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా, ఆరు రకాలుగా ఎదిగినప్పుడే ఒక మనిషి సంపూర్ణ మానవుడు అవుతాడు అని ఉగాది పచ్చడి లోని ఆరు రుచులు మనకి అంతర్లీనంగా తెలియజేస్తున్నాయి. ఆరు రుచులు, ఆరు రుతువులకు ప్రతినిధులుగా నవ జీవన విలువలను, జీవనేచ్ఛను పొంగించగల ఉత్సవం – ఉగాది. అందుకని ఈ ఉగాది పచ్చడిని ఏదో రుచికరమైన వంట గా కాకుండా ఒక జీవన సందేశాన్ని, తెలుగు జాతి తాత్వికతను తెలిపే అంశంగా మన పూర్వీకులు గమనించారు. అదే వారసత్వాన్ని కొనసాగించే దిశగా మనందరం ప్రకృతికి ఉగాది వేడుకలతో నీరాజనాలు అందిద్దాం. సకల జనులకు, సర్వలోకాలకు శుభం కలగాలని ఆశిద్దాం. శాంతికి పునాదులు వేద్దాం! అందరికీ శ్రీ విశ్వావసు నామ ఉగాది శుభాకాంక్షలు!
- డా.మామిడి హరికృష్ణ
డైరెక్టర్,
భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణా ప్రభుత్వం
80080 05231