Amazon Web Series.. సివరపల్లి కారోబార్.!

కారోబార్ నరేష్‌గా నాలుగు గంటలు నవ్వించిన ఈ యువకుడి పేరు పల్లె సన్నీ

Update: 2025-01-30 02:56 GMT
Amazon Web Series.. సివరపల్లి కారోబార్.!
  • whatsapp icon

సర్పంచ్ ఎలక్షన్స్ ఎప్పుడో.?

సర్పంచ్ చేసే తీర్మాణాలు..

సెక్రటరీ ఆమోదం..

వార్డు మెంబర్ల తలూపుడు..

అందరి మధ్యలో కారోబార్ హల్ చల్..

మస్తు కథ నడుస్తది పంచాయతీ ఆఫీస్లల్ల.

ఏం బాధపడకున్రీ.. ఎలక్షన్సొచ్చేదాక సివరపల్లిదాక పొయ్యొద్దాం పాన్రీ.

కారోబార్ నరేష్ ఏదో జెప్తడంటా.!

అమెజాన్ ప్రైమ్‌లో సివరపల్లి వెబ్ సిరీస్ ట్రెండింగ్‌లో ఉంది. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం సివరపల్లి గ్రామ పంచాయతీ నేపథ్యంలో సాగే కథ ఇది. బీటెక్ చేసి అమెరికా వెళ్లాలనే గోల్ పెట్టుకున్న శ్యామ్.. నాన్న బలవంతంతో సివరపల్లి సెక్రెటరీగా చేరతాడు. ఇటు సెక్రటరీకి.. అటు సర్పంచ్‌కు.. ప్రజలకు మధ్య కారోబార్ వారధిగా ఉంటాడు. లేనిపోని గొడవలన్నీ పంచాయతీ ఆఫీస్ మెట్లెక్కేలా చేస్తూ నాన్ స్టాప్‌గా నవ్విస్తాడు. నటనలో శభాష్ అనిపించుకున్నాడు.

కామెడీతో పండిన కథ..

కారోబార్ నరేష్‌గా నాలుగు గంటలు నవ్వించిన ఈ యువకుడి పేరు పల్లె సన్నీ. సెక్రటరీ శ్యామ్‌గా రాగ్ మయూర్.. సర్పంచ్ ‌భర్తగా మురళీధర్ గౌడ్, సర్పంచ్‌గా రూప లక్ష్మి, ఉప సర్పంచ్‌గా ఉదయ్ గుర్రాల నటించారు. వీళ్లు ఏ పని చేయాలన్నా కారోబార్ నరేష్ పక్కన ఉండాల్సిందే. పంచాయతీ ఆఫీస్ తాళాలు పగలగొట్టే సీన్ నుంచి జనవరి 26 బ్యానర్లు కట్టేదాక కారోబార్ లేకపోతే ఏ పనీ జరగదు. సందు దొరికితే చాలు భార్యకు ఫోన్ చేసి.. ఏంచేస్తున్నవ్ తిన్నవా అని ముచ్చట పెడతాడు. పక్కూరి వాళ్లతో గొడవ పెట్టుకొని సెక్రటరీకి లేనిపోని తలనొప్పి తీసుకొస్తాడు. బర్త్ సర్టిఫికేట్ కోసం వస్తే పిల్లాడికి పేరు బాగలేదని భార్యభర్తల కొట్లాటకు కారణమవుతాడు. ఇలా అన్నింట్లో తలదూర్చి కామెడీతో సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లాడు సన్నీ.

చిరాకు తెప్పించి..

పంచాయతీ సెక్రటరీపేరు శ్యామ్. ఊళ్లోకి వచ్చిన తొలిరోజు నుంచే సామ్ సార్.. సామ్ సార్ అని సెక్రటరీకి చిరాకు తెప్పిస్తాడు కారోబార్ నరేష్. అరే బాబూ.. నా పేరు శ్యామ్.. సామ్ సార్ కాదూ అని ఎంతమొత్తుకున్నా సామ్ సార్ అనే అంటాడు. పాపం.. సెక్రటరీ అమెరికాకు వెళ్లాలని ఎగ్జామ్స్‌కు ప్రిపేరవుతుంటాడు. నరేష్ ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చెయ్యకు అని ఎన్నిసార్లు చెప్పినా.. హా సరే సామ్ సార్ అని చెప్తాడు. ఐదు నిమిషాలు కూడా కాకముందే ఔ సామ్ సార్ అమెరికా పొయినంక నాతో మాట్లాడ్తరా అని డిస్టర్బ్ చేసి చిరాకు తెప్పిస్తుంటాడు. ఇలా రావుగోపాల్ రావు-అల్లు రామలింగయ్య కాంబినేషన్‌ను.. కోట శ్రీనివాసరావు- బ్రహ్మానందం కాంబినేషన్‌ తన కామెడీ టైమింగ్‌తో గుర్తుచేస్తాడు సన్నీ.

రైతు కుటుంబం

పల్లె సన్నీది మెదక్ జిల్లా రేగోడ్ మండలం పోచారం. వాళ్లది రైతు కుటుంబం. చిన్నప్పటి నుంచే కళలపట్ల ఆసక్తి ఎక్కువ. నాన్నతో కలిసి థియేటర్లో మూవీస్ చూడటానికి వెళ్లే రోజుల్లోనే సినిమాలపై ఆసక్తి ఏర్పడింది. స్కూల్లో ఏవైనా ఈవెంట్స్ జరిగితే అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చేవాడు. అలా టీచర్లు దత్తారెడ్డి.. సంగీత సన్నీ టాలెంట్‌ను గుర్తించి సినిమాల్లోకి వెళితే పెద్ద నటుడివి అవుతావ్ అని మెచ్చుకునేవారట. స్కూలింగ్ అయిపోయాక ఫైన్‌ఆర్ట్స్‌లో గ్రాడ్యుయేషన్ చేశాడు. ఆ తర్వాత ఫొటోగ్రఫీపై ఆసక్తి కనబర్చి నేచర్ ఫొటోగ్రాఫర్‌గా రాణించాడు. తెలంగాణ కల్చర్.. టూరిజం.. నేచర్ అందాలను తన కెమెరాలో బంధించి తన సృజతనాత్మకతను చాటుకున్నాడు సన్నీ. హైదరాబాద్‌లో ఎగ్జిబిషన్స్ పెట్టి అందరి దృష్టినీ ఆకర్షించాడు.

అల్లు అర్జున్ వల్లే..

సన్నీకి అల్లు అర్జున్ అంటే విపరీతమైన అభిమానం. అతడిది ఏ సినిమా రిలీజైనా ఫస్ట్ రోజే చూసేవాడట. ఆ సినిమాలో హీరో గెటప్ ఎలా ఉంటుందో అలా తయారయ్యేవాడు. ఏందిరా.. రోజు రోజుకూ అలా తయారవుతున్నావ్.. నీకు నువ్వు పెద్ద అల్లు అర్జున్ అనుకుంటున్నావా అని వాళ్ల అమ్మ క్లాస్ తీసుకునేది. అయినా అతడి అభిమానం తగ్గలేదని అంటున్నాడు సన్నీ. ఫ్రెండ్స్ ఆటపట్టిస్తూ సన్నీ బన్నీ అనేవారు. అల్లు అర్జున్ మీదున్న అభిమానమే తనను సినిమాల్లోకి తీసుకొచ్చిందని చెప్తున్నాడు సన్నీ. అలా 2015లో సినీ ఇండస్ట్రీలోకి ఎంటరయ్యాడు. దొరసాని, విరాటపర్వం, మెయిల్, పంచతంత్ర కథలు, స్కైలాబ్ వంటి హిట్ సినిమాల్లో పల్లెటూరి పిల్లోడి నటనతో అందర్నీ మెప్పించాడు.

విలక్షణమే లక్ష్యం

సివరపల్లి సన్నీకి ఫస్ట్ వెబ్ సిరీస్. కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశాడు. పలు సినిమాలకు సినిమాటోగ్రఫీ ఇచ్చాడు. ఇలా డిఫరెంట్ ఫ్రేమ్స్‌లో టాలెంట్ నిరూపించుకుంటున్నాడు. తన నేచురల్ నటనతో తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ భాషల్లోనూ అవకాశాలు వస్తున్నాయని చెప్తున్నాడు సన్నీ. హ్యాంగ్ మ్యాన్.. సెల్పిష్.. ఖేల్ ఖతం దర్వాజ బంద్ వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇంకా నాలుగు కొత్త ప్రాజెక్టులతో బిజీగా మారాడు. ఒకవైపు ఫొటోగ్రఫీ చేస్తూనే మరోవైపు సినిమాలపై దృష్టి పెట్టాడు. ప్రకాశ్ రాజ్.. ఫహద్ ఫాజిల్ వంటి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకోవడమే తన లక్ష్యం అని చెప్తున్నాడు. తెలంగాణ కథలు.. డైరక్టర్లు.. యాక్టర్లు సత్తా చాటుతున్న తరుణంలో వారి సరసన ఈ సివరపల్లి కారోబార్ నరేష్ నిలవడం అభినందనీయం. 

Tags:    

Similar News