అక్కడ సిగ్గుపడకుండా ఆ పని చేస్తే లక్షల్లో జీతం.. శిక్షణ ఇచ్చేవారికి కోట్లలో వేతనం
కాలంతో పాటుగా అప్‌డేట్ అవ్వకపోతే చాలా వెనుకబడిపోయారని అంటుంటారు.
దిశ, ఫీచర్స్ : కాలంతో పాటుగా అప్‌డేట్ అవ్వకపోతే చాలా వెనుకబడిపోయారని అంటుంటారు. అలాగే కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు నైపుణ్యాలను అప్‌డేట్ చేయడానికి ఎప్పటికప్పుడు శిక్షణ ఇస్తుంటారు. అయితే మార్కెట్‌లో నిలదొక్కుకోవడానికి పొరుగు దేశమైన చైనాకు చెందిన ఒక కంపెనీ తన ఉద్యోగులకు అలాంటి పనిలో శిక్షణ ఇచ్చింది. ఆ శిక్షణ గురించి విన్నవారందరూ ఔరా అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ సంస్థ తన ఉద్యోగులకు సిగ్గు పడకుండా పని చేయడం ఎలానో శిక్షణనిస్తోంది. ఉద్యోగి ఎంత సిగ్గుపడకుండా పనిచేస్తే అతనికి అంత ఎక్కువ జీతం ఉంటుందని కూడా చెప్పారు. ఇంతకీ ఆ ట్రెయినింగ్ క్లాస్ లో ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం.
తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లోని హాంగ్‌జౌలో ఉన్న కాస్మెటిక్ కంపెనీ ఉంది. ఈ సంస్థ తన ఉద్యోగులకు సిగ్గులేకుండా పనిచేసేందుకు శిక్షణనిస్తూ కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. నిజానికి ఇలా చేయడం వల్ల అమ్మకాలు పెరుగుతాయని కంపెనీ భావిస్తోంది.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం కరోనా కాలం నుండి కంపెనీ చాలా నష్టాల్లో, కష్టాల్లో ఉందట. అయితే కంపెనీ మార్కెట్ల లో తన స్వంత మనుగడ సాగించడానికి తన ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని భావించింది. ఇందుకోసం జుహై ఎంటర్‌ప్రైజ్ మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్‌ను నియమించింది. ఆ తర్వాత బ్రెయిన్‌వాషింగ్ టెక్నిక్ ద్వారా, ఉద్యోగులు సిగ్గులేని వారిగా మారడానికి శిక్షణ ఇచ్చారు. దీంతో తమ కంపెనీ ప్రాడక్టులు సేల్ చేసేందుకు ఉద్యోగులు డ్యాన్స్, చప్పట్లు కొడుతూ కస్టమర్లను ఆకట్టుకుని అమ్మకాలను పెంచడం నేర్పించారు. ఉద్యోగి ప్రాడక్ట్ ను ఎంత సేల్ చేస్తే అంత జీతం కూడా పెరుగుతుంది.
ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించినందుకు కంపెనీ శిక్షకుడికి కోటి రూపాయలకు పైగా చెల్లించిందట. అయితే శిక్షణ తర్వాత కూడా కంపెనీ అమ్మకాలపై ప్రభావం లేకపోవడంతో డబ్బు తిరిగి ఇవ్వాలని ట్రెయినర్ ని కంపెనీ వారు డిమాండ్ చేశారట. ఇదే డబ్బును తమ సిబ్బందికి పంచి ఉంటే ఆటోమేటిక్‌గా బిజినెస్ పెరిగి కంపెనీకి మేలు జరిగేదని అనుకుంటున్నారు.