సానుకూల, ప్రతికూల దృక్పథాలే జీవితాన్ని నిర్ణయిస్తాయా?

మీరు చిన్నప్పుడు ఎన్నో సంఘటనలు చూసి ఉంటారు. మరెన్నో ప్రదేశాలు తిరిగి ఉంటారు..

Update: 2022-12-25 08:55 GMT
సానుకూల, ప్రతికూల దృక్పథాలే జీవితాన్ని నిర్ణయిస్తాయా?
  • whatsapp icon

దిశ, ఫీచర్స్: మీరు చిన్నప్పుడు ఎన్నో సంఘటనలు చూసి ఉంటారు. మరెన్నో ప్రదేశాలు తిరిగి ఉంటారు. పేరెంట్స్ ద్వారా, సమాజం నుంచి ఎంతో నేర్చుకొని ఉంటారు. ఎన్నో అనుభూతులకు లోనయ్యి ఉంటారు. ఎన్నో అనుభవాలు కలిగి ఉంటారు. అవన్నీ జీవన పయనంలో ఒక భాగంగా ఉంటాయి. అయితే కొన్ని సంఘనలో, సందర్భాల్లో మనల్ని బాగా ప్రభావితం చేసేవిగా ఉంటాయి. ఆనందాన్నో, విషాదాన్నో నింపి ఉంటాయి. ఇలా పుట్టినప్పటి నుంచి పెద్దయ్యే దాకా మీకు ఎదురైన అనేక అంశాలు మీలో ఒక దృక్పథాన్ని కలిగిస్తాయి. అది ఆనందకరమైనది అయితే పాజిటివ్ దృక్పథంగా, బాధాకరమైనది అయితే నెగెటివ్ దృక్పథంగా చెప్పవచ్చు. సానుకూల, ప్రతికూల దృక్పథాలు లేదా వైఖరులు మీ ప్రవర్తనను నియంత్రిస్తాయి. సమాజంలో గుర్తింపు పొందడం వెనుక, కోల్పోవడం వెనుక, గెలుపోటములను ఇవి ప్రభావితం చేస్తుంటాయి. అందుకే సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవాలని, అది మీకు మేలు చేస్తుందని మానసిక నిపుణులు చెప్తున్నారు.

మీ అంచనా కరక్టేనా?

'జీవితంలో ఎప్పుడూ మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవడమో, జీవితంపట్ల ప్రతికూల దృక్పథాన్ని ఏర్పర్చుకోవడమో చేయకండి. ఎందుకంటే మిమ్మల్ని మీరు ఎలా అంచనా వేసుకుంటే మీ ఆలోచనలు కూడా ఆ స్థాయికి దిగజారే అవకాశం ఉంది. మిమ్మల్ని మీరు బలహీనులుగా కొంతకాలం ఊహించుకుంటే నిజంగానే బలహీనత ఆవహిస్తుంది. మిమ్మల్ని మీరు సమర్థవంతులుగా ఊహించుకుంటూ ముందుకు దూసుకెళ్తే మీరు నిజంగానే బలవంతులుగా తయారవుతారు' అంటారు స్వామి వివేకానందుడు. మీ దృక్పథమే మీరు జీవితంపట్ల ఒక వైఖరిని కలిగి ఉండటానికి దోహదపడుతుంది అంటారు జాన్ ఎన్ మిచెల్. దృక్పథాలు, వైఖరులు కూడా అంతే.. మీరు మీ మనసులో తరచూ ఊహించుకునే, లేదా మెదడులో ఏర్పర్చుకునే సానుకూల, ప్రతికూల బలమైన ఆలోచనల సమాహారమే. అవే మీ జీవితాన్ని నడిపిస్తుంటాయి. జీవితంలో సంతోషంగా ఉండాలంటే సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవాలని, స్పష్టమైన వైఖరి కలిగి ఉండాలని సైకాలజిస్టులు, సామాజిక నిపుణులు సూచిస్తున్నారు.

ఒక వ్యక్తి తరచూ కోపం, ఆవేదన, నిరాశ వంటివి ఎక్కవగా కలిగి ఉండటమో లేదా సమాజం నుంచి అటువంటి స్వభావాన్ని అలవర్చుకోవడమో చేస్తే అతని ప్రవర్తన కూడా అటువైపే మొగ్గుతుంది. అందుకే అటువంటి ఆలోచనలు, స్వభావాలు మీలో ఉంటే దూరం చేసుకోవాలని, జీవిత పయనంలో విచక్షణా జ్ఞానంతో ఆలోచించి ఏది మేలో, ఏది చెడో నిర్ణయించుకొని ముందుకు సాగాలని పెద్దలు, నిపుణులు సూచిస్తుంటారు. అది అక్షరాలా నిజం అంటారు న్యూయార్క్ సిటీకి చెందిన డేవిడ్. అందుకే మీరెటు మొగ్గు చూపుతున్నారో ఒకసారి పరిశీలించుకోండి. మీలో సానుకూల దృక్పథం లేకుంటే అలవర్చుకోవాలి. ప్రతికూల దృక్పథం కలవారు అయితే దానిని తొలగించుకోవాలి. అప్పుడే అపజయాలను అధిగమిస్తూ సక్సెస్ దిశగా అడుగులు వేయగలుగుతారు

మీ వైఖరి స్పష్టమైనదేనా?

మీలో ప్రస్తుతం ఏ విధమైన వైఖరి ఉంది? మీ వ్యక్తిగత, సామాజిక దృక్పథాలు ఎలా ఉన్నాయి? సానుకూలమా? ప్రతికూలమా? అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అప్పుడు మీరు ఏ దృక్పథంతో ఉన్నారో, ఏ దృక్పథాన్ని అలవర్చుకోవాలో, ఏ లక్ష్యంవైపు నడవాలో కూడా క్లారిటీ వస్తుంది అంటున్నారు ప్రముఖ సైకియాట్రిస్టు రతన్ మెహతా.

మీరే రోడల్ మోడల్

మనలో చాలామంది ఫలానా వ్యక్తి లేదా ఫలానా సంఘటన రోల్ మోడల్‌గా నిలుస్తున్నాయని చెప్పడం వింటుంటాం. కానీ మనమే ఎందుకు రోడల్ మోడల్‌గా నిలవొద్దు? అందరూ మన గురించి ఎందుకు మాట్లాడు కోవద్దు? అని ఎప్పుడైనా అనుకోవడమో, ఆలోచించడమో చేశారా? చాలామంది 'లేదు, కాదు' అనే అంటుంటారు. ఎందుకంటే ఉరుకుల, పరుగుల జీవితమో, సమాజంలోని ప్రభావాలో, పరిస్థితులో అటువంటి ఆలోచనను అడ్డుకొని ఉండవచ్చు. కానీ తెలిశాక మాగ్రతం సరైన నిర్ణయం తీసుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉంటుంది అంటున్నారు నిపుణులు. అంటే మీ ఆలోచనలు, మీ అడుగులు, మీకు ఆసక్తి ఉన్న రంగంలో రోల్ మోడల్‌గా నిలిచే వైపునకు కదలాలన్నమాట. అందుకోసం సానుకూల దృక్పథం, స్పష్టమైన వైఖరిని అలవర్చుకోవాలి. ఆశావాదులుగా, ఆత్మ విశ్వాసం గలవారిగా మారాలి. అవసరమైతే పుస్తకాలు చదవాలి. పరిస్థితులను అర్థం చేసుకోవాలి. చదువులో, ఉద్యోగంలో, వ్యాపారంలో ఇలా ఏ రంగంలో రాణించాలన్నా సరైన నిర్ణయం తీసుకునే హక్కు మీదే. ఏ మార్గంలో నడిచినా, ఏ రంగం ఎంచుకున్నా సానుకూల దృక్పథంతో, ఆత్మ విశ్వాసంతో అడుగేస్తే అదే మిమ్మల్ని సక్సెస్ వైపు నడిపిస్తుంది. 

READ MORE

1.5 టన్నుల టమోటాలతో శాంతాక్లాజ్ సైకత శిల్పం 

Tags:    

Similar News