పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నారా? అయితే ఫెర్టిలిటీ రేటు పెంచే ఈ ఆహారాలు తినండి..!
స్త్రీ అమ్మ అనిపించుకోవడం ప్రతి ఒక్కరి కల. అయితే ప్రస్తుత కాలంలో చాలామంది ఈ అదృష్టానికి దూరమవుతున్నారు.
దిశ, ఫీచర్స్: స్త్రీ అమ్మ అనిపించుకోవడం ప్రతి ఒక్కరి కల. అయితే ప్రస్తుత కాలంలో చాలామంది ఈ అదృష్టానికి దూరమవుతున్నారు. ఆహారపు అలవాట్లు, జన్యులోపం, దీర్ఘకాలిక వ్యాధులు ఇందుకు కారణం కావచ్చు. అయితే ఆరోగ్యకరమైన జీవనశైలితో మహిళలు గర్భం దాల్చే అవకాశాలను మెరుగుపరచుకోవచ్చు. ఇందుకు రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం, సరైన నిద్రతో పాటు మంచి ఫుడ్ తినాలి.
పిల్లల కోసం ప్లాన్ చేసేవారు కచ్చితంగా పోషకాహారం తినాలి. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటే పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. డైట్‌లో కొన్ని ఆహారాలు చేర్చుకుంటే ప్రెగ్నెన్సీ ఛాన్సులు పెరుగుతాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా తల్లి కావాలనుకునే వారు 5 రకాల ఫుడ్స్ డైట్‌లో చేర్చుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
* తృణధాన్యాలు
బ్రౌన్ రైస్, ఓట్స్, క్వినోవా, తృణధాన్యాలలో ఫైబర్, ఐరన్, B విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి తింటే స్త్రీల ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. వీటిల్లో ఉండే ఫైబర్ రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుతుంది, డైజేషన్‌ను మెరుగుపరుస్తుంది. ఇక, B విటమిన్స్ శరీర హార్మోన్లను నియంత్రణలో ఉంచుతాయి. అంతేగాక, శక్తిని విడుదల చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
* నట్స్, సీడ్స్
వివిధ రకాల నట్స్, సీడ్స్ తింటే ఫెర్టిలిటీ అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యంగా బాదం, వాల్‌నట్స్, చియా సీడ్స్, అవిసె గింజలు డైలీ తినాలి. వీటిల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ప్రోటీన్, ముఖ్యమైన విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో ప్రత్యుత్పత్తి భాగాలకు రక్త సరఫరా సాఫీగా సాగుతుంది. అండం విడుదల మెరుగవుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు హార్మోన్లను నియంత్రిస్తాయి. గర్భాశయ శ్లేష్మాన్ని ఇంప్రూవ్ చేస్తాయి. ఫెర్టిలిటీకి కీలకమైన జింక్ ఈ నట్స్, సీడ్స్‌లో ఉంటాయి.
* ఆకుకూరలు
మహిళలు రెగ్యులర్ డైట్‌లో ఆకుకూరలను చేర్చుకోవాలి. వీటిలో ఫోలేట్, ఐరన్, కాల్షియం వంటి న్యూట్రియెంట్స్ ఉంటాయి. ఫోలేట్ ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆకుకూరల్లో ఉండే ఐరన్ శరీరానికి తగిన శక్తిని అందిస్తుంది.
* లీన్ ప్రోటీన్
చికెన్, పప్పు ధాన్యాలు, చేపలు, టోఫు, పనీర్ వంటి పదార్థాల్లో లీన్ ప్రోటీన్ ఉంటుంది. ఇలాంటి ఆహారాలు తింటే ఆరోగ్యంగా ఉంటారు. ప్రత్యుత్పత్తి వ్యవస్థ కూడా హెల్దీగా ఉంటుంది. ప్రోటీన్‌లు హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. దెబ్బతిన్న కణాలను సరిచేస్తాయి. రోజు వారీ డైట్‌లో లీన్ ప్రోటీన్ ఫుడ్స్ యాడ్ చేస్తే, బాడీకి కావాల్సిన సపోర్ట్ అందుతుంది. ఫలితంగా ఓవరాల్ హెల్త్ బాగుంటుంది. ప్రెగ్నెన్సీ అవకాశాలు పెరుగుతాయి.
* బెర్రీస్
స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్ప్‌బెర్రీ వంటి బెర్రీ జాతి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్స్, ఫైబర్ కూడా సమృద్ధిగా లభిస్తాయి. ఈ పండ్లు తింటే శరీర కణాలు ఆరోగ్యంగా మారతాయి. అండాల నాణ్యతను ఇవి మెరుగు పరుస్తాయి. బెర్రీల్లో విటమిన్ C కూడా ఉంటుంది. ఇది హార్మోన్లను నియంత్రిస్తుంది, లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కాబట్టి, తల్లి కావాలని అనుకునే వారు ఈ ఫుడ్స్ తప్పక తినాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
నోట్: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్దారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.