అన్నీ బాగుంటే అందమైన కుటుంబం.
సంపాదించే తల్లిదండ్రులుంటే సంతోషానిదే రాజ్యం.
నాన్న హీరో.
అమ్మే ఆరాధ్య దేవత.
తోబుట్టువులే తోడుండే ఫ్రెండ్స్.
కానీ.. వయసు పెరుగుతున్న కొద్దీ, ఈ ప్రేమలు తగ్గుతూ వస్తున్నాయి.
నాన్నొక విలనౌతాడు.
అమ్మ అరిచే దయ్యమౌతుంది.
తోబుట్టువులు పోటీదారులౌతారు.
కుటుంబం కోసం సర్వం త్యాగంచేసిన తల్లిదండ్రులు ఒంటరివారవుతారు.
అందమైన కుటుంబంలో అంధకారం రాజ్యమేలుతుంది.
కన్నవారే భారమై, కనుమరుగవుతున్న అనుబంధాలపై స్పెషల్ స్టోరీ.
- దాయి శ్రీశైలం
My Parents Were My Heroes... అని టాటూ వేయించుకుంటారు కొందరు. ఇంకా కొందరేమో My Mom Is The Strongest Person I Know.. అని కొటేషన్లు రాస్తారు. My Dad Taught Me How To be a Good Person.. అని గొప్పలు చెప్పుకుంటారు. I'm so Lucky to have Parents Who Love Me Unconditionally.. అని సూక్తులు చెప్తారు. జన్మనిచ్చి, ప్రతీక్షణం ధారపోసిన తల్లిదండ్రుల గురించి ఇలా చెప్పుకోవడం మంచిదే. కానీ అది మాటల వరకు, కొటేషన్ల వరకే పరిమితమైతుందనేది ఇక్కడ పాయింట్. ఉన్నోడు లేనోడు అనే తేడా లేదు. మలిసంధ్యలో తల్లిదండ్రుల విషయానికి వచ్చేసరికి అందరూ ఒకేలా ఆలోచిస్తున్నారు. దీన్నొక ట్రెండ్ అనుకుంటున్నారో ఏమో మరీ.?
ఆస్తి కావాలి.. అమ్మ వద్దా.?
సత్తెమ్మ వయసు 85 ఏండ్లు. జగిత్యాల పట్టణంలోని కటికవాడ ఆమెది. సత్తెమ్మకు పిల్లల్లేరు. ఎన్నడో 20 ఏండ్లనాడు పెనిమిటీ కాలం చేశాడు. ఆస్తి బాగనే ఉంది. ఏం చేసుకుంటా ఈ ఆస్తిని, పోయిన్నాడు కట్టుకొని పోతనా అనే అనుకుందేమో. తన యావదాస్తిని మరిది కొడుకులకు రాసిద్దామనుకుంది సత్తెమ్మ. హామీ ఇచ్చినట్లుగానే కోట్ల రూపాయల విలువజేసే ఆస్తిని మరిది కొడుకుల పేరుమీద రాసిచ్చింది. కాలం చేసిన్నాడు తలకొరివి పెడితే అదే చాలనుకున్నది. ఇదే సత్తెమ్మ చేసిన నేరమైంది. ఆస్తి చేతిలో పడ్డాక పెద్దమ్మ పెద్ద భారమైపోయింది. మరిది కొడుకులిద్దరూ వేర్వేరు ఇండ్లు కట్టుకొని సత్తెమ్మను ఓ పాతింట్లో ఉంచారు. చేజేతులా ఆగంచేసుకుంటికదరా దేవుడా అనుకొని కాలం వెల్లదీసుకుంటుండగా పాపం సత్తెమ్మ అనారోగ్యం పాలయ్యింది. డిసెంబర్ 26నాడు ప్రాణాలూ కోల్పోయింది. ఆమె కోరుకున్న సమయం రానే వచ్చింది. కానీ, ఆమె శవాన్ని ఇంట్లో పెట్టుకునేందుకు కొడుకులు ఒప్పుకోలేదు. చిన్న కొడుకైతే అసలు వాసన్నే పారనీయలేదు. పొద్ద కొడుకేమో బిడ్డె పెండ్లి ఉన్నదీ.. ఇప్పుడు తలకొరివి పెడితే బిడ్డె కాళ్లు కడగడానికి చాన్సుండదూ అని దూరం జరిగాడు. ఇంకేముందీ.. ఏ దిక్కూలేని అనాథలా పడివున్న సత్తెమ్మను ఊర్లో నలుగురు తలా ఓ చెయ్యేసి కర్మకాండలు చేశారు.
బుక్కెడు బువ్వకు వంతులా.?
కన్న కొడుకులుంటే పాపం సత్తెమ్మ ఆ పరిస్థితి వచ్చేది కాదేమో అనుకుంటున్నారా.? అవును.. కడుపున పుట్టిన బిడ్డ.. కొంగున కట్టిన రూక ఆదుకుంటాయని పెద్దలంటారు కదా. కానీ పెద్దలమాటలిప్పుడు పెద్దగా పట్టించుకునేవాళ్లు లేరు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద రాజమ్మ గురించి చెప్తే అర్థమవుతుంది. రాజమ్మకు ముగ్గురు కొడుకులు. చేతనైనన్ని రోజులు రెక్కలు ముక్కలు చేసుకొని నా పిల్లలో నా పిల్లలూ అని పడిపడి పనిచేసింది. కానీ, చివరి మజిలీ ఇంత చిందరవందరగా ఉంటుందని అనుకోలేదు. రాజమ్మ భర్త పదేండ్ల క్రితం చనిపోయాడు. ఇప్పుడామె వయసు 80 ఏండ్లు. భర్త చనిపోయినప్పటి నుంచి పెద్ద కొడుకు ఇంట్లోనే ఉండేది. అయితే పెద్ద కొడుకు కూడా అనారోగ్యంతో చనిపోవడం వల్ల కోడలిపై కుటుంబ భారం పడింది. ఈ పరిస్థితుల్లో తాను పోషించలేనని ఇంకో కొడుకు ఇంటికి పంపించింది పెద్ద కోడలు. అయితే తన భార్య కూడా చనిపోయి చాలా ఇబ్బందుల్లో ఉన్నాననీ, మూడో కొడుకు ఇంటికిపొమ్మని అతడూ పంపించేశాడట. మూడో కొడుకేమో అసలు ఊర్లో ఉండడటా. విషయం చెప్పుదామని ప్రయత్నిసక్తే ఫోనే లేపడట. ఎక్కడికి వెళ్లాలో, ఎలా బతకాలో తెలియక దిక్కుతోచని స్థితిలో గ్రామ పంచాయతీ దగ్గరికెళ్లి కూర్చుంది రాజమ్మ. ఇప్పుడు చెప్పండీ సొంత కొడుకులు ఏంచేస్తున్నారో.?
గుడిసె పీకేసిన కొడుకు.!
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నాగన్న, అప్పాయమ్మ ఒక గుడిసె వేసుకొని ఉంటున్నారు. కాయకష్టం చేసి సంపాదించిన ఆస్తినంతా పిల్లలకు రాసిచ్చి.. ఓ రెండు సెంట్ల జాగాను వాళ్ల కోసం ఉంచుకొని దాంట్లో గుడిసె వేసుకున్నారు. కొడుకుల మీద ఆధారపడకుండా వాళ్లే ఏదో ఒక పనిచేసుకొని బతుకుతున్నారు. అలాంటి పరిస్థితిలో ఆసరా అయ్యి ఆదుకోవాల్సింది పోయి, ఉన్న రెండు సెంట్ల జాగాపై కన్నేశాడు చిన్న కొడుకు. మాయమాటలు చెప్పి తల్లిదండ్రులను నమ్మించాడు. కొడుకే కదా అని ఉన్న రెండు సెంట్ల జాగాను కొడుకు పేరుమీద రిజిస్ట్రేషన్ చేసిచ్చారు. కానీ, తాము ఉన్నన్ని రోజులు ఈ గుడిసెలోనే ఉంటామనే షరతు పెట్టారు. దానికి కొడుకు కూడా ఓకే చెప్పాడు. మూడో కంటికి తెలియకుండా ఆ స్థలాన్ని వేరేవాళ్లకు అమ్మేశాడు. ఇంకేముంటుందీ. కథ మొత్తం ఉల్టా అయింది. కొనుక్కున్నవాళ్లొచ్చి గుడిసె నుంచి గెంటేసి దాంట్లో ఉన్న సామానంతా బయట పడేశారు. కంటికి రెప్పలా కాపాడుకుంటాడని నమ్మిన పాపానికీ కన్న కొడుకే ఇలా బజార్లో పడేశాడు. ఒంట్లో శక్తి ఉన్నంతకాలం దారపోసి కొడుకులను ప్రయోజకులను చేస్తే ఇగో ఇలా నిలువనీడ లేకుండా చేస్తున్నారు కొందరు.
చద్దన్నం వద్దంటే చావుదెబ్బలా.?
రాజవ్వది జగిత్యాల. ఆమెకు నలుగురు కొడుకులు. పాపం.. పింఛన్ డబ్బులు ఇవ్వడం లేదని ఇంట్లో నుంచి గెంటేసిన కొడుకులను కన్నది రాజవ్వ. తనకు ఒంట్లో సత్తువ ఉన్నంతకాలం, చేతనైనంత కాలం ఎవ్వరినీ రూపాయి అడగలేదు. చేతగాకుండా అయిన తర్వాత పింఛన్ మీద ఆధారపడి బతుకుతున్నది. సర్కారిచ్చే అంత చిన్న అమౌంటును చూసి కొడుకులు ఓర్వలేదంటా. అన్నం మేమే పెడుతున్నాం కదా.. ఏం చేసుకుంటవ్ ఆ పైసలు అని కొట్టి ఇంట్లో నుంచి గెంటేస్తే.. ఎన్నటికైనా ఇక్కడే రావాలి కదా అనుకుందో ఏమో రాజవ్వ వారం పది రోజులు శ్మశానవాటికలోనే పడుకుందటా. కన్నవాళ్లు సంపాదించిన ఆస్తులు కావాలిగానీ, కన్నవాళ్లు అవసరం లేని జమానా అయిపోయింది. గద్వాల జిల్లా జల్లాపురంలో కృష్ణయ్య ఉంటాడు. ఆయనకు భార్యలేదు. ఇద్దరు కొడుకుల పెండ్లిళ్లు చేశాడు. ఇంటిని రెండు వాటాలుగా పంచి నెలకు ఒకరింట్లో ఉంటున్నాడు. అయితే చద్దన్నం తినలేను, ఓ ముద్ద వేడి అన్నం పెట్టండీ అని అడిగిన పాపానికీ కాళ్లు చేతులు విరిగేలా కొట్టారట ఇద్దరు కొడుకులు. పాపం.. నడవ చేతగాకున్నా అర్ధరాత్రి ఆరు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఓ నాన్న రిటర్న్ గిఫ్ట్.!
రాజకొమురయ్యది హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముస్తఫాపూర్. ఒక కొడుకు, ఇద్దరు కూతుర్లు ఆయనకు. అందరికీ పెండ్లిళ్లు చేశాడు. ఆరేండ్ల క్రితం రాజ కొమురయ్య భార్య మల్లమ్మ చనిపోతే ఒంటరిగానే ఉంటున్నాడు. 4 ఎకరాల 12 గుంటల భూమి ఉంది ఆయన పేరుమీద. కొడుకు బతిమిలాడితే మొత్తానికి మొత్తం రిజిస్ట్రేషన్ చేసిచ్చాడు. ఇగ అసలు కథ మొదలయ్యింది. తండ్రి ఆస్తినయితే తీసుకున్నాడు కానీ, ఒక్కపూట తిండి పెట్టడం లేదట. మారతాడేమో అని చాలా ఓపిక పట్టాడు. కొడుకేమో నీతో నాకేం పనీ అనే రేంజిలో ఉండేవాడ. పాపం.. చాలా బాధపడ్డాడట రాజకొమురయ్య. చిర్రెత్తిపోయి బిడ్డా నీకు తగిన మందుపెడితేనే సక్కగైతవ్ అని కలెక్టర్ దగ్గరికిపోయాడు. నా కొడుకు పట్టించుకోవడం లేదు నా భూమిని తిరిగి నా పేరుమీద చేయండని అర్జీ పెట్టుకుంటే సీనియర్ సిటిజన్ యాక్టు ప్రకారం 3.20 ఎకరాల భూమిని తిరిగి రాజకొమురయ్య పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. దెబ్బకు కొడుకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. ఎలా ఉంది రాజకొమురయ్య రిటర్న్ గిఫ్ట్.? తల్లిదండ్రులను భారంగా భావించేవాళ్లకు ఇదొక లెసన్. అయినా 75 ఏండ్ల వయసులో వాచ్మెన్లుగా, గుమస్తాలుగా పనిచేసే పరిస్థితి ఉన్నాక ఆ పిల్లల వల్ల తల్లిదండ్రులకు ఏం ఫాయిదా.?
కుక్కలపై అంత ప్రేమా.?
మనం చాలా చూస్తుంటాం. కుక్కలను ఎంత అల్లారుముద్దుగా పెంచుకొని వాటిని ఎలా పోషిస్తుంటారో. మనిషి కన్నా ఎక్కువే వాటిమీద ప్రేమ కనబరుస్తుంటారు కొందరు. అంటే కుక్కలను, ఇతర జంతువులపై ప్రేమను చూపించొద్దని కాదు. కానీ వాటిమీద చూపించే ప్రేమలో సగమైనా తల్లిదండ్రులపై చూపిస్తే బాగుంటుంది కదా.? There is only one happiness in this life, to love and be loved.
మనదాక వస్తే.?
వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసి చీదరించుకునేవాళ్లు చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. ఎవరికీ ఏదీ శాశ్వతం కాదు. అందరూ ముసలివాళ్లు అవుతారు. అందరూ ఏదో ఒక దశలో పిల్లలపై ఆధారపడాల్సిన అవసరం వస్తుంది. కెరీర్ పరుగులో విలువైన సమయాన్ని కుటుంబానికి కేటాయించరు. అప్పుడు మీ కుటుంబానికి తోడుగా ఉండేది పేరెంట్సే. One person caring about another represents life's greatest value.
డబ్బా.? బంధమా.?
ఒక్క తల్లిదండ్రుల విషయంలోనే కాదు. చాలామటుకు అన్ని బంధాలను దూరం చేస్తుంది డబ్బు. నేను, నా కుటుంబం అనే స్వార్థంతో కన్నవాళ్లను, నా అన్నవాళ్లను దూరం చేసుకొని మధ్యలో ఏర్పడిన కొత్త బంధాలకు ప్రాధాన్యత ఇస్తుంటారు. కొత్త బంధాలు వద్దని కాదు. కానీ వారికిచ్చే ప్రాధాన్యతలో పావు వంతయినా తల్లిదండ్రులకు ఇస్తే చాలు. Money can feed the body. Love will feed the soul.
ఏం నేర్పుదాం.?
కోట్ల రూపాయల ఆస్తి ఉంటుంది. విలాసవంతమైన భవనాలు ఉంటాయి. రోజూ పదుల సంఖ్యలో చుట్టాలు వచ్చిపోతుంటారు. కానీ, తల్లిదండ్రులేమో వృద్ధాశ్రమాల్లో, అనాథాశ్రమాల్లో ఉంటారు. అలా కాకుండా తల్లిదండ్రులను పిల్లలతో ఉండనిస్తే పిల్లలకు జీవిత పరమార్థం తెలుస్తుంది. A Good Father is a Source of Inspiration & Self-restraint. A Good Mother is the Root of Kindness & Humbleness.