దిశ, ఫీచర్స్ : సడెన్‌గా కళ్లు మసరకబారడం, పగటివేళలో కూడా సగం చీకటి, సగం వెలుతురు కనిపించడం, వస్తువుల రంగులు ఉన్నదానికంటే భిన్నంగా తోచడం వంటి అనుభూతి కలుగుతోందా? అయితే అది గ్లాకోమా వ్యాధిగా అనుమకావచ్చు అంటున్నారు కంటివైద్య నిపుణులు. వాస్తవానికి ఇది ఆప్టిక్ నరం దెబ్బతినడంవల్ల తలెత్తే పరిస్థితి. కంటి నరాలలో ఒత్తిడి కారణంగా ఇలా జరుగుతుంది. 40 ఏండ్లు పైబడిన వారిలో 2.65% కంటే ఎక్కువ మందిని ఈ సమస్య వేధిస్తోంది.
ఎందుకు వస్తుంది?
మారుతున్న జీవన శైలి, తీసుకుంటున్న ఆహారాల్లో దీర్ఘకాలంపాటు పోషకాలు లోపించడం, పొగతాగడం, స్ర్కీన్ టైమ్ పెరగడం వంటి కారణాలు గ్లాకోమా బారినపడేందుకు దోహదం చేస్తాయి. ఈ వ్యాధిని వెంటనే గుర్తించి జాగ్రత్త పడకపోతే కంటిచూపును శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇక లక్షణాల విషయానికి ఒక వ్యక్తికి రంగులు, వస్తువులు అందరిలా క్లారిటీగా కాకుండా మబ్బు మబ్బుగా కనిపిస్తుంటాయి. ప్రకాశవంతమైన లైట్లను చూస్తున్నప్పుడు కూడా అవి ఇంద్రధనుస్సులోని ఏడు రంగులను తలపిస్తుంటాయి. దీంతోపాటు కొందరిలో సమస్య తీవ్రమైనప్పుడు కళ్లు లాగడం, తలనొప్పి, వికారం, వాంతులు వంటివి సంభవిస్తాయి.
ఏ వయసులో వస్తుంది?
ఒకప్పుడు 60 ఏండ్లు దాటిన వారిలోనే గ్లాకోమా కనిపించేది. కానీ ప్రజెంట్ 30 ఏండ్లు దాటిన వారికి కూడా వస్తున్నట్లు నిపుణులు చెప్తున్నారు. కాకపోతే మొదట్లో లక్షణాలు బయటకు కనిపించవు. వ్యాధి ముదిరే కొద్దీ బయటపడతాయి. దీనిని ముందస్తుగా గుర్తించడంవల్ల నివారణ లేదా చికిత్స సాధ్యం అవుతుంది. గ్లాకోమాలో పలు రకాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఓపెన్ యాంగిల్ గ్లాకోమా వచ్చినప్పుడు సింప్టమ్స్ కనిపించవు. కంటి పరీక్ష చేయించుకోవడంవల్లనే తెలుస్తుంది. మరో విషయం ఏంటంటే డయాబెటిస్, హైబీపీ ఉన్నవారికి గ్లాకోమా త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలంపాటు కార్టికోస్టెరాయిడ్స్ ఉపయోగంవల్ల కూడా సమస్య తలెత్తుతుంది.
పరిష్కారమేంటి?
గ్లాకోమా రాకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు అవసరం. కళ్లపై మితిమీరిన ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. రేడియేషన్‌కు గురయ్యే పరిస్థితుల్లో కళ్లకు రక్షణ అవసరం కాబట్టి సేఫ్టీ గ్లాసెస్ ధరించాలి. హై ఫోకసింగ్ లైటింగ్, పగటి వేళ సూర్యకిరణాలు సూటిగా కళ్లలోకి నేరుగా పడకుండా చూసుకోవాలి. దీంతోపాటు కళ్లు మసకబారడం, లాగడం వంటి ఇబ్బందులు వారానికి మించి ఉంటే కంటి పరీక్షలు చేయించుకోవాలి. అప్పుడప్పుడు టెస్టులు చేయించుకోవడం ద్వారా గ్లాకోమాను ముందస్తుగా గుర్తించవచ్చని కంటి వైద్య నిపుణులు చెప్తున్నారు. సమస్య ఉన్నట్లు గుర్తించగానే వైద్య నిపుణుల సలహా పాటించాలి. అవసరమైన ట్రీట్మెంట్ తీసుకోవాలి.