ఒకే ఒక్క ప్రోటీన్ 75 % శాతం క్యాన్సర్ల వ్యాప్తికి కారణం.. ఆపగలిగే మార్గమిదే !
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పలువురిని వేధిస్తున్న వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. దాని తీవ్రతను బట్టి, శరీరంలో వ్యాపించిన భాగాన్ని బట్టి ప్రాణహాని కలిగిస్తుంది.
దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పలువురిని వేధిస్తున్న వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. దాని తీవ్రతను బట్టి, శరీరంలో వ్యాపించిన భాగాన్ని బట్టి ప్రాణహాని కలిగిస్తుంది. అయితే శరీరంలోని కణాల్లో సహజంగానే ఉండే MYC (Master Regulator of Cell Cycle Entry and Proliferative Metabolism) అనే ఒకే ఒక్క ప్రోటీన్ లేదా కణం ఇందులో కీలకపాత్ర పోషిస్తోందని, 75 శాతం క్యాన్సర్ల వ్యాప్తికి కారణం అవుతుందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకులు గుర్తించారు.
కంట్రోల్ తప్పుతున్న కణం
నిజానికి MYC ప్రోటీన్ శరీరంలోని ఒక హెల్తీ యాక్టివేటెడ్ సెల్. ఆరోగ్యంగా ఉండటంలో దోహదం చేస్తుంది. కానీ క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందుతున్నప్పుడు మాత్రం అది దాని పనితీరు నుంచి విరమించుకుంటుంది. ఈ పరిస్థితి క్యాన్సర్ మరింత వ్యాప్తి చెందడానికి సహాయపడుతుంది. అయితే ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఇలా జరగకుండా ఆపడానికి ఒక మార్గాన్ని కనుగొన్నారు.
పెప్టైడ్ సమ్మేళనం
‘‘ఎంవైసీ(MYC) పనితీరు మందగించడంతో క్యాన్సర్ డెవలప్ అవుతుంది కానీ, దానిని నియంత్రించడం కూడా పెద్ద సమస్యగానే ఉంటోంది. ఎందుకంటే ఇది ఒక ఆకారం లేని ప్రోటీన్. నిరోధించడానికి టార్గెట్ చేసుకోగల స్ట్రక్చర్‌ని కలిగి ఉండదు. అందుకే దానిని సమర్థవంతంగా గుర్తించడం, మెడికేషన్స్ ద్వారా సాధారణంగా ప్రవర్తించేలా చేయడం కష్టం’’ అంటున్నారు రీసెర్చర్స్. ప్రస్తుతం దానిని గుర్తించి, సమర్థ వంతంగా పనిచేసేలా చేయడానికి పెప్టైడ్ అనే ఒక కొత్త సమ్మేళనాన్ని అభివృద్ధి చేశారు. ఇది ఎంవైసీ ప్రోటీన్‌తో ఇంటరాక్ట్ అయి దానిని తిరిగి నియంత్రణలోకి తీసుకురావడంలో సహాయపడుతుంది. దీనివల్ల క్యాన్సర్ల వ్యాప్తిని అడ్డుకోవచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. త్వరలో దీనిని ఎలా అప్లయ్ చేయాలనేదానిపై క్లారిటీ రానుందని చెప్తున్నారు.