మగాళ్లూ.. మీరు కూడా మనస్ఫూర్తిగా ఏడ్వండి.. మీ కన్నీళ్లు మీ ఇష్టం
'మగాళ్లు ఏడ్వ కూడదు. అది వారి బలహీనతను బయట పెట్టుకున్నట్టవుతుంది.
దిశ, ఫీచర్స్ : 'మగాళ్లు ఏడ్వ కూడదు. అది వారి బలహీనతను బయట పెట్టుకున్నట్టవుతుంది. భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవడం మగవాళ్ల ధైర్యానికి నిదర్శనం' అనే తప్పుడు ప్రచారం, భావజాలం మన సమాజంలో నెలకొని ఉంది. పైగా ఏడ్వడంవల్ల ఎటువంటి ప్రయోజనమూ ఉండదని అంటుంటారు. కానీ భావోద్వేగాన్ని అణచి పెట్టుకోవడం ఒక్కటే మగాళ్ల స్థిరమైన మనస్తత్వానికి, ధైర్యానికి ప్రతిరూపం కాదనే వాస్తవం గ్రహించాలి. అయితే సమాజంలో కొందరు అనుకుంటున్నట్టు మగాళ్ల ఏడ్పు బలహీనతకు సూచికగా భావించాల్సిన అవసరం లేదు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఏడుపు అనేది కేవలం ఒక భావోద్వేగం మాత్రమే కాదు.. మీలోని మరో కోణాన్ని కూడా కలిగి ఉంటుంది. ఏడుపు హాని కలిగిస్తుందని కొందరు చెప్తుంటారు. కానీ ఇది నిజం కాదు. అది మిమ్మల్ని తేలిక పరుస్తుంది తప్ప అది బలహీనత అస్సలు కాదు. మగాడు కూడా సమాజంలోని అనేక బలహీనతలను, భావోద్వేగాలను కలిగి ఉంటాడు. ప్రతి ఒక్కరూ తమ యుక్త వయస్సులో ఆయా సందర్భాల్లో సహజంగా కన్నీళ్లను బయట పడనివ్వరు. భావోద్వేగాలను అణచి వేసుకుంటూ లోలోపల ఫీల్ అవుతుంటారు. కానీ అది ఇబ్బందికరంగా మారతుందని మీకు తెలుసా... ఏడ్వడం అనేది ఎప్పటికీ బలహీనత కానేరదు. అది ఒక ఆరోగ్యకరమైన ప్రక్రియ అని నిపుణులు చెప్తున్నారు నిపుణులు.
మగాడి ఏడ్పు అవమానకరమా?
ఒక రెడ్డిట్ వినియోగదారుడు పోస్టు చేసిన ఆసక్తి కరమైన కథనం ఈ విధమైన విషయాలతో ఉంది. ఆసక్తికరమైన ఒక కథనం సారాంశం ఏమిటంటే.. ''మనిషిని నమ్మకం అనేది ఏ విధంగా తేలిక పరుస్తుందో ఆయా సందర్భాల్లో ఏడుపు కూడా అలాగే సహకరిస్తుంది. ఇది నేను చూసిన సంఘటనను చెప్తున్నాను. ఒక యువకుడు లైబ్రరీ రూంలో ఒంటరిగా ఉన్నాడు. అతను తన ఫ్యామిలీకి దూరంగా ఉండటంవల్ల బాధలో ఉన్నాడు. అంతలోనే అతని గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసింది. అతడు ఫోన్ లిఫ్ట్ చేసి ఏడ్వడం మొదలు పెట్టాడు. కుటుంబానికి దూరంగా ఉంటున్నాననే బాధతో లోలోపల కుమిలి పోతున్న అతను గర్ల్ ఫ్రెండ్ వాయిస్ వినగానే భావోద్వేగానికి గురై ఏడుపు ఆపుకోలేకపోయాడు. అప్పుడామె అతను ఎక్కడున్నాడనేది తెలుసుకుని వెంటనే అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చి, అతన్ని కౌగిలించుకుంది. ఆ తర్వాత టీ తాగడానికి వెళ్దామని ఇద్దరూ వెళ్లారు. అప్పుడా గర్ల్ ఫ్రెండ్ అతన్ని అసలు విషయం ఏమిటో అడిగి తెలుసుకుంది. అతను రియలైజ్ అయ్యేలా మాట్లాడింది. వారిద్దరి మధ్య పదేళ్ల నుంచి రిలేషన్ షిప్ ఉంది. కానీ ఆ యువకుడు ఎప్పుడూ మనస్ఫూర్తిగా మనసులోని బాధను చెప్పుకొని ఏడవలేకపోయాడు. అందుకే ఏడుపు ఆపుకోలేకపోయానని అతడు గర్ల్ ఫ్రెండ్‌కు చెప్తాడు. ఎందుకంటే సమాజంలో మెజార్టీగా మగాళ్ల ఏడ్పును సానుకూలంగా చూడరు. పైగా అది బలహీనతగా భావిస్తుంటారు. కాబట్టి చాలామంది మనసులో ఎంత బాధ ఉన్నా బయటకు చెప్పుకోలేక ఇబ్బంది పడుతుంటారు. కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కాదని, సందర్భోచిత ప్రవర్తన, భావోద్వేగాలు ఎవ్వరికైనా ఉంటాయని, వాటిని తమ సన్నిహితులతోనో, స్నేహితులతోనో బయట పెట్టుకుంటే మనసు తేలికపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఎమోషన్స్‌ను బలవంతంగా అణిచిపెట్టుకో కూడదని సూచిస్తున్నారు.
కన్నీళ్లతో మనసు తేలిక పడుతుంది
ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే.. మగాళ్లు ఏడ్వరు. ఏడ్వ కూడదు అనే జడ్జిమెంట్ మనకు మనం ఇచ్చుకోవడమో, మన గురించి ఇంకెవరైనా ఇవ్వడమో కరెక్టు అని అనుకోవాల్సిన అవసరం లేదు. మహిళలకే కాదు, మగవారికీ బాధలు, భావోద్వేగాలు ఉంటాయి. కాకపోతే సమాజంలో ఉన్న అపోహలవల్ల చాలా వరకు వారు బయట పెట్టుకోలేకపోతారు. కానీ అలా చేయడం మంచిది కాదు. మగాళ్లు ఆయా సందర్భంలో ఏడ్వడం అనేది బలహీనత కానే కాదు. మగాళ్లు కూడా ఏడ్వడానికి, ఇతరుల సానుభూతి పొందడానికీ అర్హులే. అంతే తప్ప ఏడుపు ఒక బలహీనత కాదు. అదొక భావోద్వేగ సందర్భం మాత్రమే. పైగా ఏడ్వడంవల్ల అణచిపెట్టుకున్న ఆలోచనల నుంచి విముక్తి పొందుతారు. కన్నీటివల్ల మనసును, శరీరాన్ని తేలికపర్చే హార్మోన్స్ రిలీజ్ అయి మేలు చేస్తాయి. కాబట్టి ఏడ్చే సందర్భంలో ఏడవడం తప్పు కాదు. ఎవరో ఏదో అనుకుంటారని భావోద్వేగాలను అణచి పెట్టుకోవద్దు అంటున్నారు మానసిక నిపుణులు.
ఏడుపు ఒక సహజ లక్షణం
ఏదైనా సందర్భంలో మగపిల్లలు ఏడిస్తే.. ఆడపిల్లలా ఏడుస్తావెందుకు? మగాడంటే ధైర్యంగా ఉండాలి అని చెప్పేవాళ్లు చాలామందే ఉంటారు. ఫ్రెండ్స్ , క్లాస్ మెట్స్, లేదా బంధువులు, చుట్టుపక్కల వ్యక్తులు కూడా ఇదే ఆలోచనతో ఉంటారు. కానీ ఇది సరైంది కాదని గుర్తుంచుకోండి. ఏడుపు, సంతోషం, బాధ, ఆయా సందర్భాలను బట్టి కలిగే భావోద్వేగాలు అందరిలోనూ సంహజంగా ఉంటాయి. దీర్ఘ కాలికంగా భావోద్వేగాలను అణచి ఉంచుకోడం అనారోగ్యాలకు దారి తీస్తుంది. అందుకే మనస్ఫూర్తిగా ఏడవాలి. ఏడుపు కూడా ఒక సృజనాత్మకమైన కమ్యూనికేషన్ ప్రక్రియ. కోపం, బాధ, భావోద్వేగం, కూడా అన్నీ సహజమైన లక్షణాలు. ఏడుపు కూడా ఆయా సందర్భాల్లో మగాళ్లు కూడా రిలాక్స్ అయ్యేందుకు తోడ్పడుతుంది. సందర్భం వచ్చినప్పుడు మనసులోని భావాలు, భావోద్వేగాలు వెల్లడించే అర్హత, హక్కు మగాళ్లకు కూడా ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ భావోద్వేగాలను బలవంతంగా అణచి పెట్టుకోవద్దని సూచిస్తున్నారు నిపుణులు.
ఇవి కూడా చదవండి : 'భార్య కోపంగా ఉంది.. వన్ వీక్ లీవ్ ఇవ్వండి సర్'.. కొత్తగా పెళ్లైన కానిస్టేబుల్ లీవ్ లెటర్ వైరల్..