సంతానలేమిపై అపోహలు.. కేవలం స్త్రీలు మాత్రమే కారణమా?
దంపతులు ఒక సంవత్సరంపాటు ప్రయత్నించిన తర్వాత కూడా సహజమైన పద్ధతిలో స్త్రీ గర్భం దాల్చలేకపోతే ఇన్‌ఫెర్టిలిటీ ప్రాబ్లమ్‌గా పరిగణిస్తారు.
దిశ, ఫీచర్స్ : దంపతులు ఒక సంవత్సరంపాటు ప్రయత్నించిన తర్వాత కూడా సహజమైన పద్ధతిలో స్త్రీ గర్భం దాల్చలేకపోతే ఇన్‌ఫెర్టిలిటీ ప్రాబ్లమ్‌గా పరిగణిస్తారు. అయితే ఇది కేవలం స్త్రీకి సంబంధించిన సమస్య మాత్రమే కాదు. స్త్రీ, పురుషులిద్దరిలో ఎవరికి వంధ్యత్వం ఉన్నా, ఇద్దరిలో ఒకరికి ఉన్నా సంతానలేమి సమస్యకు కారణం కావచ్చు. కాగా ఇటీవల పురుషుల్లోనే వంధత్వ సమస్యలు అధికంగా ఉంటున్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి. గత మూడు నుంచి నాలుగు దశాబ్దాలుగా పురుషులు ఇన్‌ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న పరిస్థితులు గణనీయంగా పెరుగుతున్నాయి. వారు మరొకరి ఎండోక్రైన్ బ్యాలెన్స్‌కు భంగం కలిగించే ఎన్విరాన్‌మెంటల్ కెమికల్స్‌కు ఎక్కువగా గురి కావడం కూడా ఇందుకు ఒక కారణం అంటున్నారు నిపుణులు.
ఇన్ ఫెర్టిలిటీ లేదా వంధత్వం విషయంలో ఇప్పటికీ మన సమాజంలో చాలా అపోహలు ఉన్నాయి. పురుషులు ఏ వయస్సులో నైనా సంతానానికి అవసరమైన పటుత్వం కలిగి ఉంటారని కొందరు నమ్ముతుంటారు. కానీ ఇది వాస్తవం కాదు. ఎవరిలోనైనా వయస్సును బట్టి వారి శారీరక మార్పులు జరుగుతాయి. ఏజ్ పెరుగుతున్న కొద్దీ పురుషుల్లో స్పెర్మ్ క్వాలిటీ తగ్గుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంతేకాకుండా టెస్టోస్టెరాన్ లెవల్స్, వృషణాలలో ప్రొడ్యూస్ చేయబడిన సెక్స్ హార్మోన్స్ క్షీణతకు దారితీస్తాయి. దీనివల్ల లేటు వయస్సులో పెళ్లి చేసుకుంటే సంతానలేమికి పురుషులే కారణం కావచ్చు. అంతేకానీ పురుషులు ఏ వయస్సులోనైనా సామర్థ్యం కలిగి ఉంటారనేది కరెక్ట్ కాదు. మరి కొందరు ఫిజికల్ పిట్‌నెస్ కలిగిన పురుషులవల్ల సంతానం త్వరగా కలుగుతుందని భావిస్తుంటారు. ఇది కూడా అపోహ మాత్రమే. శారీరక దృఢత్వానికి మగతనానికి సంబంధం లేదంటున్నారు సంతాన సాఫల్య నిపుణులు. శారీరక దృఢత్వం ఉండి కూడా సంతానలేమి, వంధత్వంతో బాధపడుతున్న స్త్రీ, పురుషులు ఉంటారు. దేనికైనా శారీరక, మానసిక, వైద్యపరమైన కారణాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు.