నీటిలో మొసలికి పట్టుబడి, చావు బతుకుల మధ్య పోరాడిన మహిళ.. చివరికి ఏం జరిగిందంటే..
నీటిలోని మొసలికి నోటికి చిక్కిన ఏ వ్యక్తి లేదా జంతువు దాదాపు ప్రాణాలతో బయట పడే అవకాశం ఉండదు. కానీ ఒక మహిళ మాత్రం దానికి చిక్కి 90 నిమిషాలపాటు చావు బతుకుల మధ్య పోరాడి చివరికి ప్రాణాలతో బయటపడింది.
దిశ, ఫీచర్స్ : నీటిలోని మొసలికి నోటికి చిక్కిన ఏ వ్యక్తి లేదా జంతువు దాదాపు ప్రాణాలతో బయట పడే అవకాశం ఉండదు. కానీ ఒక మహిళ మాత్రం దానికి చిక్కి 90 నిమిషాలపాటు చావు బతుకుల మధ్య పోరాడి చివరికి ప్రాణాలతో బయటపడింది. జూలై 27న ఇండోనేషియాలో ఈ సంఘటన జరిగింది. వెస్ట్ కాలిమంటన్ ప్రావిన్స్‌కు చెందిన ఫాల్మిరా డి జీసస్ అనే 38 ఏళ్ల మహిళ సమీపంలోని పామ్ ఆయిల్ ప్లాంటేషన్‌లో వర్క్ చేస్తోంది. దాహం వేయడంతో అక్కడికి కొద్దిదూరంలో గల కెటాపాంగ్ రీజెన్సీలోని ఒక చిన్న జలాశయంలో నీళ్లు తెచ్చుకోవడానికి వెళ్లింది.
ఫాల్మిరా డి జలాశయంలో బిందెతో నీళ్లు తీసుకుంటోంది. అంతలోనే నీటిపై కప్పబడిన పచ్చటి ఆకులు, తీగల మధ్యలో నుంచి అకస్మాత్తుగా ఒక మొసలి వచ్చి ఆమెపై దాడి చేసింది. ఆమె కాలును నోట కరుచుకుని నీటిలోకి లాగసాగింది. ఈ సందర్భంగా ఆమె భయంతో గట్టిగా అరుస్తూనే తప్పించుకునే ప్రయత్నం చేసింది. మొసలి నీటిలోకి లాగే ప్రయత్నం చేస్తుండగా, ఆమె మాత్రం బయట పడేందుకు ప్రయత్నం చేస్తూనే ఉంది. దాదాపు 90 నిమిషాలపాటు చావు బతుకుల మధ్య పోరాడుతూనే ఉంది. ఇక తనకు మరణం తప్పదని అనుకున్న ఆమె మరింత గట్టిగా ఏడ్వడం మొదలు పెట్టింది. ఈ ఆర్తనాదాలు అక్కడికి కొద్దిదూరంలో ఉన్న పామ్ ఆయిల్ ప్లాంటేషన్‌లో పనిచేస్తున్న ఆమె కో వర్కర్ల చెవిన పడ్డాయి. వెంటనే పరుగెత్తుకొచ్చిన ఆమె సహోద్యోగులు కర్రలతో మొసలిని కొడుతూ చివరికి ఆమెను రక్షించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రాణాలతో బయటపడిన ఫాల్మిరా డి జీసస్‌కు ప్రాణహాని అయితే తప్పింది. కానీ మొసలి గట్టిగా పట్టుకున్నందున తన కాలు, తొడభాగం, ఒక చెయ్యి నొప్పిగా ఉన్నట్లు ఆమె పేర్కొన్నది. మొసలి దాడి చేసినా తోటి వర్కర్ల చొరవతో బయటపడటాన్ని తన అదృష్టంగా భావిస్తున్నానని ఆమె వెల్లడించింది.