తల్లిదండ్రుల పేరుపై మీరు ప్రాపర్టీలు కొంటే.. మీ తోబుట్టువులకు షేర్ ఇవ్వాల్సిందేనా?

సాధారణంగా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి పిల్లలకు వారసత్వంగా వస్తుంది. అయితే, తమ ఆస్తి ఎవరికి చెందాలని నిర్ణయించే అధికారం మాత్రం వీలునామా రాసే వారికే ఉంటుంది.

Update: 2024-05-30 09:39 GMT

దిశ, ఫీచర్స్: సాధారణంగా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి పిల్లలకు వారసత్వంగా వస్తుంది. అయితే, తమ ఆస్తి ఎవరికి చెందాలని నిర్ణయించే అధికారం మాత్రం వీలునామా రాసే వారికే ఉంటుంది. ఒకవేళ ఆస్తి తన పిల్లలకు కాకుండా వేరే వారికి ఇవ్వాలని భావిస్తే కూడా వీలునామా రాయవచ్చు. దీని ప్రకారం.. తల్లిదండ్రుల మరణానంతరం ఆస్తి పిల్లలకు కాకుండా వేరే వారికి దక్కుతుంది. అయితే, తల్లిదండ్రులు వీలునామా రాయకపోతే వారి తర్వాత ఆ ఆస్తిపై ఎవరికి హక్కు ఉంటుంది? తల్లిదండ్రుల పేరు మీద మీరు ఆస్తులు కొంటే, మీ తోబుట్టువులకు కూడా వాటా దక్కుతుందా? అనే సందేహాలు చాలా మందికి ఉన్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం ఇక్కడ తెలుసుకుందాం.

*పేరెంట్స్ ఆస్తి కొంటే తోడబుట్టిన వాళ్ళకు భాగం:

1956, హిందూ వారసత్వ చట్టం ప్రకారం తల్లిదండ్రుల పేరు మీదున్న ఏ ఆస్తిలోనైనా వారి పిల్లలకు సమాన వాటా దక్కుతుంది. ఉదాహరణకు.. మీరు హైదరాబాద్‌లో ఉండి మీ తల్లి పేరు మీద ఫ్లాట్ కొన్నారనుకోండి. ఇందుకు సంబంధించి రెగ్యులర్ హోం లోన్ తీసుకుని, ఈఎంఐలు పూర్తిగా డబ్బులు మీరే చెల్లించారు. మీ తల్లి ఒక్క రూపాయి కూడా అఫిషియల్‌గా కట్టలేదు. అయితే మీ సోదరి అమెరికాలో నివసిస్తోంది అనుకోండి. ఒకవేళ తల్లి మరణిస్తే మీరు కొనుగోలు చేసిన ఫ్లాట్‌పై మీ సోదరికి కూడా హక్కు ఉంటుంది.

* వీలునామా రాయకపోతే?

హిందూ వారసత్వ చట్టం ప్రకారం తల్లిదండ్రుల ఆస్తులు వారి పిల్లలకు చెందుతాయి. అయితే, తల్లిదండ్రులు వీలునామాలో పిల్లలకు కాకుండా ఇతరులకు ఆస్తిలో హక్కు కల్పించనప్పుడు మాత్రమే, ఆస్తిలో హక్కులు పిల్లలకు దక్కుతాయి. వీలునామా రాయకుండా పేరెంట్స్ మరణిస్తే వారి సంతానంగా ఆస్తిపై రైట్స్ పొందడానికి ఓ సర్టిఫికెట్‌ని పొందాలి. సివిల్ కోర్ట్ నుంచి ఈ వారసత్వ సర్టిఫికెట్‌ని తెచ్చుకోవాలి. అప్పుడు ఆస్తి హక్కులు పేరెంట్స్ నుంచి పిల్లలకు బదిలీ అవుతాయి. ఒకవేళ తండ్రి మాత్రమే మరణిస్తే.. అతని పేరు మీదున్న ఆస్తిలో వాటా ఆయన తల్లికి, భార్యకు, పిల్లలకు, కోడలికి (ఒకవేళ భర్త మరణిస్తే) దక్కుతుందని హిందూ వారసత్వ చట్టం చెబుతోంది. ఒకవేళ తల్లి కూడా మరణిస్తే ఆమె ఆస్తి పిల్లలందరికీ సమాన భాగాల్లో పంచాల్సి ఉంటుంది. ఫలితంగా, తల్లి పేరు మీద ఉన్న ఆస్తుల్లో పిల్లలకు సమానమైన వాటా దక్కుతుంది. ఈ లెక్క ప్రకారం.. మీరు సొంతంగా సంపాదించిన ఫ్లాట్‌పై ఆస్తి హక్కులు మీ సోదరికి కూడా చెందుతాయి.

* ఏం చేయాలి?

మానవీయంగా చూస్తే ఈ ఆస్తి మీకే చెందాలి. కానీ, హిందూ వారసత్వ చట్టం ఇందుకు ఒప్పుకోదు. మీరు మీ తల్లి పేరు మీద ఆస్తిని సంపాదించారు కనుక అందులో వాటా మీ చెల్లెలికి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ సమస్య నుంచి బయట పడటానికి మీకు రెండు మార్గాలున్నాయి. ఒకటి ఈ ఫ్లాట్‌కి చెందిన పూర్తి ఆస్తి హక్కులు మీకే చెందుతాయని మీ తల్లితో వీలునామా రాయించుకోవాలి. ప్రత్యామ్నాయంగా రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ కింద తన ఫ్లాట్ షేర్‌ని మీకు మీ తల్లి ఇవ్వాలి. ఇలా చేస్తే ఫ్లాట్ మీ సొంతం అవుతుంది. రెండోది.. మీ సోదరి నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(NOC) పొందాలి. తల్లి నుంచి వారసత్వంగా తనకు అందే వాటా పూర్తిగా మీకు ఇవ్వడంలో ఎలాంటి అభ్యంతరం లేదని మీ సోదరి డిక్లరేషన్ ఇవ్వాలి. దీంతో తల్లి వీలునామా రాయకుండా మరణించిన ఈ ఫ్లాట్ ఆస్తిపై సర్వ హక్కులు మీకే చెందుతాయి. అందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం ఉత్తమం.. (ఇంటర్నెట్ సమాచారం మేరకు మాత్రమే ఇవ్వబడినది)


Similar News