Hypnic jerk : గాఢ నిద్రలో భయంతో ఉలికిపాటు..! ఎందుకు సంభవిస్తుందో తెలుసా?
Hypnic jerk : గాఢ నిద్రలో భయంతో ఉలికిపాటు..! ఎందుకు సంభవిస్తుందో తెలుసా?
దిశ, ఫీచర్స్ : గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక్కసారిగా ఉలిక్కి పడి నిద్రలేస్తున్నారా..? కింద పడుతున్నట్లో, గాల్లో తేలుతున్నట్లో అనుభూతికి లోనవుతూ భయపడుతున్నారా? అయితే మీరు హిప్నిక్ జర్క్ (hypnic jerk)అనే స్లీప్ డిజార్డర్‌తో బాధపడుతుండవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇటీవల అనేక మంది దీనిబారిన పడుతున్నారు. ఉన్నట్లుండి ఏదో మత్తు ఆవహించినట్లు అనిపించి వెంటనే నిద్రలోకి జారుకోవడం, గాఢనిద్రలో ఏదో కుదుపు సంభవించినట్లు, ఎత్తైన ప్రదేశం నుంచి కిందకు పడుతున్నట్లు అనుభూతికి లోనవడం.. ఈ రుగ్మత లక్షణాలుగా పేర్కొంటున్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఈ సమస్యను ఎదుర్కొంటారని నిపుణులు చెబుతున్నారు. బాధితులు నిద్రలో ఏర్పడే భయానక పరిస్థితివల్ల ఇక తాము కింద పడిపోతున్నామనే భయాందోళనతో ఒక్కసారిగా ఉలికిపడి నిద్ర లేస్తారు. అలా ఎందుకు జరుగుతుంది? కారణాలేమిటో ఇప్పుడు చూద్దాం.
కారణాలు
అకస్మాత్తుగా ఉలిక్కి పడటమనే రుగ్మత (hypnic jerk) గాఢ నిద్రలో ఉన్నప్పుడు మాత్రమే సంభవిస్తుంది. అయితే రోజువారీ జీవితంలో అధిక ఒత్తిడిని ఎదుర్కొనే వారిలో, నిద్రలేమి, టెన్షన్, డిప్రెషన్ వంటి సమస్యలు ఉన్నవారిలో ఇది సంభవించే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీంతోపాటు శరీరంలో జరిగే కొన్ని రసాయనిక చర్యల స్థాయి ఒక్కసారిగా పెరిగినప్పుడు కూడా బాడీలో వణుకు లేదా జర్క్ ఏర్పడుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. అట్లనే శరీరంలో ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాల లోపం ఉన్నవారిలో, రోజూ నిద్రకు ముందు కెఫీన్ రిలేటెడ్ ఆహారాలు, పానీయాలు తీసుకునేవారిలో, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినేవారిలోనూ ఇలా జరిగే అవకాశం ఉందంటున్నారు.
బయటపడేదెలా?
హిప్నిక్ జర్క్ ఒక సాధారణ స్లీప్ డిజార్డర్. దీని గురించి తెలియక కొందరు పక్షవాతం వస్తుందేమోనని భయపడుతుంటారు. మరికొందరు ఏదో గాలి సోకిందని, దెయ్యం పట్టిందనే భ్రమలకు లోనై, మూఢ నమ్మకాలను ఆశ్రయిస్తుంటారు. ఇటువంటి నిరాధార నమ్మకాలను పెంచుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. హిప్నిక్ జర్క్ ప్రాబ్లం తగ్గాలంటే మీ జీవన శైలిని మార్చుకోవాలి. ముఖ్యంగా అధిక ఒత్తిడిని, అతి ఆలోచనలను నివారించాలి. అలాగే క్వాలిటీ స్లీప్, సమయం ప్రకారం తిండి, వ్యాయామాలు వంటివి కలిగి ఉండటం చేయాలి. నైట్ షిఫ్టులు చేసేవారైతే, మేల్కొన్న సమయాన్ని భర్తీ చేయడానికి పగటిపూట తగినంత నిద్రపోవాలి. దీనివల్ల హిప్నిక్ జర్క్ సమస్య దానంతట అదే తగ్గిపోతుంది. ఒకవేళ తగ్గకపోతే వైద్య నిపుణులను సంప్రదించాలి. అంతే కానీ నిద్రలో ఉలిక్కిపాటు అనేది పెద్ద ప్రమాదమో, ప్రాణాంతకమో అయితే కాదంటున్నారు నిపుణులు.