విటమిన్ 'డి' తో ఆరోగ్య ప్రయోజనాలివే..
మనం ఆరోగ్యంగా ఉండాలంటే అనేక పోషకాలు అవసరం. తీసుకునే ఆహారం ద్వారా విటమిన్లు, మినరల్స్, ఫైబర్ తదితర రూపంలో ఇవి లభిస్తాయి.
దిశ, ఫీచర్స్: మనం ఆరోగ్యంగా ఉండాలంటే అనేక పోషకాలు అవసరం. తీసుకునే ఆహారం ద్వారా విటమిన్లు, మినరల్స్, ఫైబర్ తదితర రూపంలో ఇవి లభిస్తాయి. శరీరంలో డి విటమిన్ లోపంవల్ల సమస్యలు ఎదుర్కొంటున్న వారి సంఖ్య ఈ మధ్య పెరుగుతోందని వైద్య నిపుణులు చెప్తున్నారు. లోపించకుండా ఏం చేయాలి? అది ఎలా లభిస్తుంది? ఆరోగ్యానికి ఏ విధంగా తోడ్పడుతుంది? అనే విషయాలు తెలుసుకుందాం.
ఎలాంటి బెనిఫిట్స్
విటమిన్ డి లోపిస్తే పిల్లల్లో రికెట్స్, పెద్ద వారిలో బోలు ఎముకల వ్యాధి వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి అది ఉండేలా చూసుకోవడం, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. శరీరంలో కాల్షియం, ఫాస్పేట్ మొత్తాన్ని నియంత్రించడంలో ఇది తోడ్పడుతుంది. ఎముకలు, దంతాలు, కండరాలు బలంగా ఉండటానికి సహాయపడుతుంది. క్యాన్సర్ పెరుగుదలను అరికడుతుంది. ఇన్ఫెక్షన్లను నియంత్రించడంలో, మంటను తగ్గించడంలో, గుండె జబ్బులను నివారించడంలో తోడ్పడుతుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.
ఎలా లభిస్తుంది?
విటమిన్ డి సూర్యరశ్మి ద్వారా లభిస్తుంది. ఉదయాన్నే లేత ఎండలో నిలబడటమో, కూర్చోవడమో చేస్తే శరీరానికి డి విటమిన్ లభిస్తుంది. అయితే ఎమర్జెన్సీ పరిస్థితుల్లోనో, జీవన శైలి కారణంగా డి విటమిన్ లోపంతో బాధపడుతున్నప్పుడో డాక్టర్లు తప్పనిసరి పరిస్థితిలో విటమిన్ డి సప్లిమెంట్స్‌ను తీసుకోవాలని సూచిస్తుంటారు. అయితే డాక్టర్ సలహా లేకుండా మాత్రం ఈ సప్లిమెంట్లను వాడకూడదు. ఎందుకంటే విటమిన్ డి అధికమైతే రక్తంలో కాల్షియం విషపూరితంగా మారి వాంతులు, వికారం, బలహీనత, కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలున్నాయి.