దిశ, ఫీచర్స్ : జీవితంలో విజయం సాధించాలంటే ధైర్యం అవసరం. అపజయాలే విజయానికి తొలి మెట్టు అంటారు. అలా అపజయాల నుంచే పాఠాలను నేర్చుకొని సక్సెస్ కావాలి. ఉన్నతమైన ఆలోచన ధోరణి ఉన్నవారే జీవితంలో ఉన్నతంగా ఉంటారు.
బల్బును కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్ ‘నా ప్రయత్నంలో ఎదురైన పదివేల వైఫల్యాలే లైట్ బల్బ్ విజయానికి దారితీశాయి’ అని చెప్పాడు. అంటే ఆయన తన వైఫల్యం నుంచి కొత్తది నేర్చుకుంటూ సక్సెస్ అందుకున్నారు. అందువలన ఏదైనా సాధించాలని అనుకున్నవారు, వైఫల్యాలకు లొంగకుండా, నేను ఈ పని చేయలేనేమో అని మీ ప్రయత్నం ఆపకుండా ప్రతీ ఫెయిల్యూర్‌లో కొత్తది నేర్చుకొని విజయం వైపు పయనించాలి.
కొత్తగా ఆలోచించాలి, కొత్త విషయాల పట్ల ఆసక్తిగా ఉండాలి. ప్రయత్నాన్ని ఆపకుండా ధైర్యంగా ముదుకు వెళ్లాలి. అలాగే వైఫల్యం అనేది ప్రయత్నాన్ని పునః ప్రారంభించడానికి ఒక అవకాశమని హెన్రీ ఫోర్డ్ చెప్పారు. ఎడిసన్ కూడా ఇదే విషయాన్ని బలంగా నమ్మాడు. ఇలాంటి ఆలోచనా ధోరణి ఉంటేనే మీరు విజయాలకు చేరువ అవుతారు. నేర్చుకున్న ప్రతి పాఠం, ప్రతి వైఫల్యం.. మీరు సరైన దిశలో ప్రయత్నం చేసేలా చేస్తుంది.అందువలన మీరు జీవితంలో విజయం సాధించాలంటే తప్పకుండా వైఫల్యాలను దాటుకోవాలంట.