women warriors : ప్రపంచ చరిత్రలో మహిళా యోధులు.. వీరు ఏం చేశారంటే..

‘యుద్ధం అనివార్యమైన చోట గడ్డిపరకలు కూడా తిరగబడతాయి’ అంటారు పెద్దలు. చరిత్రలో ఎక్కడ చూసినా ఇలాంటి ఉదాహరణలు, సాక్ష్యాలు కావాల్సినన్ని దొరుకుతాయని చరిత్రకారులే చెప్తుంటారు.

Update: 2024-01-02 13:47 GMT

దిశ, ఫీచర్స్ : ‘యుద్ధం అనివార్యమైన చోట గడ్డిపరకలు కూడా తిరగబడతాయి’ అంటారు పెద్దలు. చరిత్రలో ఎక్కడ చూసినా ఇలాంటి ఉదాహరణలు, సాక్ష్యాలు కావాల్సినన్ని దొరుకుతాయని చరిత్రకారులే చెప్తుంటారు. అంతేకాదు నేడు మనం జీవిస్తున్న ప్రపంచాన్ని రూపొందించిన యుద్ధాలు, యుద్ధాలలో పోరాడిన గొప్ప యోధులు, కమాండర్ల కథలతో చరిత్ర పుస్తకాలు నిండి ఉన్నాయి. అలెగ్జాండర్ ది గ్రేట్, హన్నిబాల్, చెంఘిస్ ఖాన్ వంటి యోధులు, వారు చేసిన పనుల గురించి చరిత్ర చదివిన వారికి తప్పక తెలిసి ఉంటుంది. అయితే ఈ కథనాలన్నీ చరిత్రలో ఒక భాగం మాత్రమే. కానీ యుద్ధభూమిలో చరిత్రను పునర్నిర్మించడానికి పోరాడిన వారిలో కేవలం పురుషులైన యోధులు, పరాక్రమవంతులు మాత్రమే కాదు. వీరయోధులైన మహిళలు కూడా ఉన్నారు. కానీ పుస్తకాల్లో చాలా వరకు వారి ప్రస్తావన లేకపోవడంవల్ల చాలామందికి తెలియకపోవచ్చు. అయితే చరిత్రలో అటువంటి గొప్ప మహిళా యోధుల గురించి తెలుసుకుందాం.

టోమిరిస్

క్వీన్ టోమిరిస్ క్రీస్తు పూర్వం 500ల ప్రారంభంలో మసాగేటేను పరిపాలించింది. ఆమె భూభాగం కాస్పియన్ సముద్రానికి తూర్పున, అంటే ప్రస్తుత కజకిస్తాన్‌లో ఉండేది. ఆమె సైరస్ ది గ్రేట్‌తో జరిగిన యుద్ధంలో శత్రువుల తల నరికి చంపిన మహిళగా ప్రసిద్ధి చెందింది. యుద్ధం ముగిసిన తర్వాత శత్రవైన సైరస్ డెడ్‌బాడీని కనుగొని తన వద్దకు తీసుకురావాలనితన తన దళాలను ఆదేశించింది. మృతదేహాన్ని గుర్తించిన తర్వాత టోమిరిస్ అతని శవాన్ని అవమానించడానికి మరోసారి ఆ డెడ్ బాడీని రక్తంతో కూడిన కంటైనర్‌లో ముంచింది.

ఫు హావో

ఫు హావో క్రీస్తు పూర్వం(BCE) 1200 సంవత్సరంలో చైనాలోని షాంగ్ రాజవంశంలో ఒక లెజెండ్ ఆర్మీ కమాండర్. ఆమె సైన్యంలో పాల్గొనడానికి ముందు, చక్రవర్తి యొక్క 60 మంది భార్యలలో ఒకరు. ఫు హావో షాంగ్ సైన్యంలో జనరల్‌గా మారిన వెంటనే ఆమె ఆ యుగంలోని గొప్ప మిలిటరీ మైండ్స్‌లో ఒకరని స్పష్టమైంది. ఆమె 13,000 మంది సైనికులకు నాయకత్వం వహించింది. ఇప్పుడు చైనా చరిత్రలోని గొప్ప కమాండర్లలో ఒకరిగా పరిగణించబడుతోంది.

ఆర్టెమిసియా I

ఆర్టెమిసియా I, హాలికర్నాసస్ క్వీన్, పర్షియా కింగ్ Xerxes Iకి గ్రీకు మిలిటరీ కమాండర్ అండ్ అడ్వైజర్ కూడా. ఆమె చాకచక్యం, శౌర్యం, వ్యూహరచనలో నైపుణ్యం వల్ల రాజు ద్వారా, అలాగే ఆమె సహచరులందరి ద్వారా ఎంతో గౌరవించబడింది. పర్షియా.. గ్రీస్‌పై దాడి చేసిన సమయంలో ఆర్టెమిసియా పర్షియన్లతో హోరాహోరీగా పోరాడింది. సలామిస్ యుద్ధంలో ఆమె ఐదు నౌకలలోని సైన్యానికి నాయకత్వం వహించింది. ఒక విధంగా ఇది గ్రీకు దళాలు పర్షియన్ నౌకాదళాన్ని తిప్పికొట్టిన గొప్ప నావికా యుద్ధం. అయితే ఆర్టెమిసియా మాత్రమే దాడికి పాల్పడవద్దని జెర్క్స్‌కు సలహా ఇచ్చిన ఏకైక కమాండర్. అయితే అతను ఆమె సలహాను పట్టించుకోనందుకు తర్వాత తీవ్రంగా విచారం వ్యక్తం చేశాడు.

ఒలింపియాస్

అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు. కానీ అతని తల్లి ఒలింపియాస్ లేకుండా అతను మనకు తెలిసిన హిస్టారికల్ సింబల్‌గా ఎప్పటికీ మారడనే చెప్పాలి. అలెగ్జాండర్ మాసిడోనియా కింగ్ అవడానికి ముందు, ఒలింపియాస్ మాజీ రాజు, అతని రెండవ భార్య, అలాగే వారి పిల్లలందరి హత్యలను ప్రారంభించాడని, అలెగ్జాండర్ మాత్రమే సింహాసనాన్ని అధిష్టించాడని చరిత్రకారులు భావించారు. అయితే అలెగ్జాండర్ మరణం తరువాత వారసుల యుద్ధాల సమయంలో ఒలింపియాస్ భయంకరమైన సైన్యాన్ని ఎదిరించింది. సింహాసనాన్ని రక్షించింది. అనేక సందర్భాల్లో ఆమెకు వ్యతిరేకంగా పోరాడేందుకు వచ్చిన సైన్యాలు కూడా ఆమె పటిమను చూసి చూసిన క్షణంలో లొంగిపోయేవని, పోరాడటానికి కూడా ప్రయత్నించకుండా ఫిరాయించేవని చెప్తారు.

క్వీన్ ట్యూటా

క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో క్వీన్ ట్యూటా Teuta Ardiaean రాజ్యాన్ని పాలించింది. ఆమె ఒక విశాలమైన సామ్రాజ్యం గురించి కలలు గన్న క్రూరమైన నాయకురాలని ప్రసిద్ధి. ఈ కలను సాకారం చేసుకునేందుకే ఆమె రాణిగా కొద్దికాలం గడిపింది. పైరసీ విస్తరణ కోసం క్వీన్ ట్యూటాకు ఇష్టమైన సాధనాల్లో ఒకటి ఏంటంటే.. రోమన్ మర్చంట్ షిప్స్‌ను కనికరం లేకుండా దోపిడీ చేయడం. అయితే ఈ చర్య చాలా త్వరగా సముద్రానికి అవతలి వైపు పెరుగుతున్న సామ్రాజ్యానికి కోపం తెప్పించింది. రోమ్ తమ ఓడలను దోచుకోవడం ఆపాలని ట్యూటాను ఆదేశించినప్పుడు, ఆమె వెంటనే నిరాకరించి, ఫస్ట్ ఇల్లియన్ వార్‌ను స్టార్ట్ చేసింది.

బౌడికా

బౌడికా ఫాదర్, బ్రిటన్స్ ఐసెని తెగ రాజు మరణించినప్పుడు, రోమన్ సామ్రాజ్య వాదులు వెంటనే చొరబడి ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బౌడికా ఐసెని యొక్క నిజమైన రాణి, తన దళాలను సమీకరించింది. ప్రతీకారంతో విజయాన్ని ప్రారంభించింది. లోండినియం (ప్రస్తుత లండన్) దక్షిణం వైపు కదులుతూ బౌడికా, ఆమె తోటి సెల్టిక్ బ్రిటన్‌లు మూడు రోమన్ నగరాలను నేలకూల్చారు. వారు చివరకు ఓటమిపాలయ్యారు. కానీ బౌడికా రోమన్ల ద్వారా బంధించబడటానికి బదులుగా తన ప్రాణాలను తీసుకోవడానికి సిద్ధ పడింది కానీ, రాజీ పడలేదు.

మై భాగో

18వ శతాబ్దం ప్రారంభంలో ఉత్తర భారతదేశంలోని పంజాబ్ ప్రాంతంలోని సిక్కులు మొఘల్ ఆక్రమణదారులతో నిర్విరామంగా పోరాడారు. అప్పట్లో మై భాగో తన మాతృభూమిని రక్షించుకోవాలనే ఆసక్తితో కదనరంగంలోకి దూకిన యువతి. కానీ తన జెండర్ కారణంగా సైన్యంలో చేరలేకపోయింది. 40 మంది సిక్కులు విడిచిపెట్టిన బృందం తన గ్రామంలోకి ప్రవేశించినప్పుడు ఆమెకు యుద్ధం చేసే అవకాశం దొరికింది. మై భాగో పురుషుని వేషంలో పారిపోయిన తన అనుచరులవద్దకు చేరుకుని స్పూర్తిదాయకమైన మాటలతో తిరిగి యుద్ధంలోకి నడిపించేది. ఇలా 40 మంది పురుషులను యుద్ధంలో చేరాలని వారిని ఒప్పించింది. కానీ ముక్‌స్టార్ యుద్ధంలో సిక్కు దళాలకు ఆమె సహాయం చేసినప్పుడు ఆమె 40 మంది అనుచరులు యుద్ధంలో మరణించారు. కానీ మై భాగో ప్రాణాలతో బయటపడింది. సిక్కు సైన్యం నాయకుడు గురు గోవింద్ యొక్క నమ్మకాన్ని, ప్రశంసలను పొందింది.

లేడీ ట్రైయు

ట్రై ది ట్రిన్ (triệu Thị Trinh) మరింత సరళంగా Lady Triệu అని పిలుస్తారు. ఆమె మూడవ శతాబ్దం ప్రారంభంలో నివసించిన వియత్నామీస్ యోధురాలు. ఆమె ప్రముఖంగా వు చైనీస్ దళాలపై దాడికి వ్యతిరేకంగా భారీ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది. కొన్ని నెలల పాటు వారిని నిలువరించింది. 22 సంవత్సరాల వయస్సులో తన మాతృ భూమిని రక్షించుకుంటూ మరణించింది.

జెనోబియా

పామిరీన్ సామ్రాజ్యానికి చెందిన క్వీన్ ఈమె. మోడర్న్ సిరియాలో ఉన్న జెనోబియా మూడవ శతాబ్దం మధ్యలో రోమన్ల నుంచి ఈజిప్టును తిరిగి స్వాధీనం చేసుకునేందుకు బాధ్యత వహించింది. సాధారణంగా ‘వారియర్ క్వీన్’ అని పిలుస్తారు. ఆమె చాలా నిష్ణాతులైన పోరాట యోధురాలు. వ్యూహకర్త కూడా. సంవత్సరాల తరబడి పోరాడిన తర్వాత, రోమన్లు చివరికి జెనోబియా రాజ్యాన్ని జయించారు. ఆమెను గొలుసులతో బంధించి రోమ్‌కు తీసుకెళ్లారు. అయితే ఈ విషయంలో చరిత్రకారుల్లో ఇంకా ఏకాభిప్రాయం లేదు. పదవీచ్యుతురాలైన ఈమె జైలులో చనిపోయిందని కూడా చెప్తారు. మరికొందరు ఆమె రోమన్ విల్లాలో చాలా రోజులు గడిపిన తర్వాత చనిపోయిందని అంటారు.


Similar News