గోల్డెన్ బాయ్.. ఒంటిపై 5 కిలోల బంగారు ఆభరణాలు!

దిశ, ఫీచర్స్ : మహిళలకు బంగారం అంటే మక్కువని తెలిసిందే. కానీ కొందరు పురుషులు కూడా రకరకాల కనకాభరణాలు ధరించి పుత్తడి గనిని తలపిస్తారు. ఈ విషయంలో వియత్నాం వాసులు మరింత ముందుంటారు..Latest Telugu News

Update: 2022-06-08 08:42 GMT

దిశ, ఫీచర్స్ : మహిళలకు బంగారం అంటే మక్కువని తెలిసిందే. కానీ కొందరు పురుషులు కూడా రకరకాల కనకాభరణాలు ధరించి పుత్తడి గనిని తలపిస్తారు. ఈ విషయంలో వియత్నాం వాసులు మరింత ముందుంటారు. ప్రపంచలోనే మొట్టమొదటి గోల్డెన్ ప్లేటెడ్ హోటల్‌ బిల్డింగ్‌కు నిలయమైన వియత్నాంలో ఓ వ్యాపారవేత్త ఏకంగా 13 కిలోల బంగారాన్ని ఒంటిపై ధరించి పాపులర్ కాగా ఇపుడు మరో వ్యక్తి తన కారుకు బంగారు పూత పూసి వార్తల్లో నిలిచాడు. ఇదే వరసలో నిలిచిన వియత్నమీస్ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ యజమాని దో నాక్ తువాన్.. నిత్యం తన ఒంటిపై 5 కిలోగ్రాముల పసిడి ఆభరణాలు ధరిస్తున్నాడు.

34 ఏళ్ల తువాన్ అలియాస్ సెవెన్ బాల్‌.. పసిడి మీదున్న ఇష్టంతో పదేళ్ల కిందట ఉంగరాలు, గొలుసులు ధరించేవాడు. అయితే అతడు వీధిలో నడుస్తున్నప్పుడు లేదా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగినప్పుడు ప్రజలు తనను ప్రత్యేకంగా చూడటంతో అతనిలో మరిన్ని ఎక్కువ నగలు ధరించాలన్న కోరిక పెరిగింది. దీంతో తన ఆదాయంలో ఎక్కువ శాతం బంగారు ఆభరణాలు కొనుగోలుకే ఖర్చు చేసేవాడు. ఇక 'హో చి మిన్‌' సిటీలో సొంతంగా స్నాక్ స్టాల్‌ తెరిచినప్పుడు జనాల దృష్టిని ఆకర్షించేందుకు పెద్దమొత్తంలో ఒంటిపై నగలు పెట్టుకున్నాడు. ప్రస్తుతం సెవెన్ బాల్ 10 బంగారు ఉంగరాలు, 30 బంగారు కంకణాలు, డజనుకు పైగా మందపాటి నెక్లెస్‌లతో పాటు పెద్ద చెవిపోగులు, చీలమండ కంకణాలు, కాలికి కూడా ఉంగరాలు పెట్టుకున్నాడు. మొత్తంగా అతడు ప్రతిరోజూ దాదాపు 100 తులాల(5 కిలోల) బంగారాన్ని క్యారీ చేస్తున్నాడు. ఏదేమైనా నిజంగానే ఈ నగలు అతడికి సోషల్ మీడియాలోనూ పాపులారిటీని తెచ్చిపెట్టాయి. అయితే దీనివల్ల దొంగలు తనపై రెండుసార్లు అటాక్ చేశారని, అందుకే సిటీ నుంచి బయటకు వెళ్లేటప్పుడు రక్షణ కోసం అంగరక్షకులను నియమించుకుంటానని అతడు సెవెన్ బాల్ వెల్లడించాడు.

ఇక తాను చాలా కాలంగా బంగారం ధరిస్తున్నప్పటికీ కొందరు అసూయతో అవి డూప్లికేట్ నగలని నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నట్లు తెలిపాడు. అంతేకాదు ఎవరికైనా సందేహం ఉంటే తనను బంగారు దుకాణానికి తీసుకెళ్లి వెరిఫై చేసుకోవచ్చని సూచించాడు. ఒకవేళ తన జ్యువెలరీలో ఏవైనా డూప్లికేట్ అని నిరూపించగలిగితే ఇక జన్మలో బంగారం ధరించనని, తన ఒంటిపైనున్న బంగారాన్ని కూడా ఇచ్చేస్తానని పేర్కొన్నాడు. ఇక చాలెంజ్‌లో నెగ్గనివాళ్లు 5 మిలియన్ డాంగ్($215) ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించాడు.


Similar News