Food poisoning : ఫుడ్ పాయిజనింగ్ ఎందుకు అవుతుంది..? నివారణ కోసం ఏం చేయాలి?
Food poisoning : ఫుడ్ పాయిజనింగ్ ఎందుకు అవుతుంది..? నివారణ కోసం ఏం చేయాలి?
దిశ,ఫీచర్స్ : ఈ మధ్య తరచుగా వినిపిస్తున్న మాట ఫుడ్ పాయిజనింగ్. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాలు, హాస్టళ్లు, వివిధ పాఠశాల్లో వరుసగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఫుడ్ పాయిజనింగ్ అంటే ఏమిటి? అది ఎందుకు అవుతుంది? ఎలా నివారించాలి? అనే విషయాలపై పలువురు చర్చించుకుంటున్నారు. నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం.
ఆహారం తినగానే కళ్లు తిరగడం, కడుపు నొప్పి రావడం, వాంతులు, విరేచనాలు కలగడం వంటి ఇబ్బందులను మీరు అనుభవిస్తే గనుక వెంటనే అలర్ట్ అవ్వాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే అది మీరు తిన్న ఆహారం విషంగా మారడంవల్ల తలెత్తే సమస్యలు కూడా కావచ్చు. కొందరికి వెంటనే జ్వరం, చర్మంపై దద్దుర్లు వంటివి కూడా వస్తాయి. ఈ పరిస్థితినే ఫుడ్ బోర్న్ ఇల్‌నెస్ లేదా ఫుడ్ పాయిజనింగ్ అంటారు.
ఎందుకు అవుతుంది?
మనం తీసుకునే ఆహారం, పానీయాలు శరీరానికి పడనివి అయినప్పుడు, అవి కలుషితమైనవి అయిప్పుడు, అందులో విషపూరిత రసాయనాలు కలిగి ఉన్నప్పుడు ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో అయితే ఎక్కువగా ఎంటమీబా అనే బ్యాక్టీరియా అందుకు కారణం అవుతోంది. దీంతోపాటు క్యాంపిలో బాక్టర్, సాల్మొనెల్లా, ఈ కోలి వంటి బ్యాక్టీరియాలు, నోరో వైరస్ వంటివి కూడా ఆహారాన్ని విషతుల్యం చేయడం కారణంగా ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది.
లక్షణాలు
తిన్న ఆహారం విషంగా మారితే కడుపులో నొప్పి, వికారం, వాంతులు, విరేచనలు వంటివి వెంటనే లేదా కాసేపటి తర్వాత గానీ తలెత్తుతాయి. కొందరికి వెంటనే బాడీ టెంపరేచర్ పెరిగిపోయి జ్వరం రావడం, చర్మంపై దద్దుర్లు ఏర్పడటం జరగవచ్చు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, డయాబెటిక్ పేషెంట్లు, క్యాన్సర్ రోగులు దీనిబారిన పడుతుంటారు. అలాగే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో, జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉన్నవారిలో కూడా ఫుడ్ పాయిజనింగ్ చాలా త్వరగా అవుతుంది. ఎందుకంటే ఆహారాన్ని విష తుల్యం చేసే బ్యాక్టీరియాలు, వైరస్‌లు, హానికారక రసాయనాలు వంటివి ఎక్కువగా గట్ ఫంక్షన్లకు అంతరాయం కలిగిస్తాయి.
ఈ ఆహారలు కూడా
చాలా వరకు పచ్చివి లేదా సరిగ్గా ఉడకని అన్ని రకాల ఆహారాలు విషంగా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కోడిగుడ్లు, మాంసం, పారాయిల్ చేయని ముడి మొలకలు, కుళ్లిన పండ్లు, కూరగాయలు, పచ్చి పిండి, పచ్చి చేపలు, పచ్చి పాలు, సీ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, పాలు, చీజ్, పాశ్చరైజ్ చేయని మిల్క్ ప్రొడక్ట్స్ వంటివి ఫుడ్ పాయిజనింగ్‌కు కారణం అవుతుంటాయి. ఇవే కాకుండా ఏవైనా రసాయనాలు, కలుషిత నీటిలో వండటం వల్ల కూడా, అలాగే కలుషిత నీరు తాగడంవల్ల కూడా ఫుడ్ పాయిజనింగ్ అవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఫుడ్ పాయిజనింగ్ ప్రభావాలు
ఫుడ్ పాయిజనింగ్‌కు గురైతే దాని తీవ్రతను బట్టి ప్రభావం ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా మారవచ్చు. కొందరిలో ఫుడ్ పాయిజనింగ్‌కు గురయ్యాక దీర్ఘకాలిక సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉటుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్, రక్తహీనత, కిడ్నీ ఫెయిల్యూర్స్ వంటి ఏర్పడి ప్రాణాంతకం కావచ్చు. కాబట్టి వెంటనే అలర్ట్ అవ్వాలి.
ఎలా నివారించాలి?
ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. ఇక నివారణ విషయానికి వస్తే వంట గది, వంట సామగ్రి శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఆహారాన్ని తయారు చేయడానికి, తినడానికి ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. పచ్చి ఆహారాలు తినకూడదు. మాంసం, ఇతర కూరగాయలు వంటివి వండినప్పుడు సరిగ్గా ఉడికితేనే తినాలి. అలాగే జెర్మ్ బ్రీడింగ్ నివారణ కోసం ఆహారాలను తగిన ఉష్ణోగ్రతల వద్ద స్టోర్ చేయాలి. ఫుడ్ పాయిజనింగ్‌కు గురైన తర్వాత కోలుకునే వరకు ఎలాంటి ఎనర్జీ డ్రింక్స్, కూల్ డ్రింక్స్, మసాలాలు, ఫ్రైడ్ ఫుడ్స్ వంటివి తీసుకోకూడదు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.