రిలేషన్‌షిప్‌లో రొమాన్స్.. ఏమాత్రం తగ్గకూడదంటే ఇలా చేయండి !

బిజీలైఫ్ షెడ్యూల్ కారణంగా ప్రజెంట్ చాలామంది పార్టనర్స్ మధ్య రొమాంటిక్ యాక్టివిటీస్ తగ్గుతున్నాయని ఇటీవలి అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

Update: 2024-01-13 09:37 GMT

దిశ, ఫీచర్స్ : బిజీలైఫ్ షెడ్యూల్ కారణంగా ప్రజెంట్ చాలామంది పార్టనర్స్ మధ్య రొమాంటిక్ యాక్టివిటీస్ తగ్గుతున్నాయని ఇటీవలి అధ్యయనాలు పేర్కొంటున్నాయి. దీనివల్ల సంబంధాలు దెబ్బతినే అవకాశాలు లేకపోలేదని నిపుణులు చెప్తున్నారు. ఒకసారి రిలేషన్ షిప్‌లోకి అడుగుపెట్టాక సరస్పర సహకారం, అర్థం చేసుకోవడం, అభిప్రాయాలు, బాధలు, సంతోషాలు పంచుకోవడం కామన్‌. అయితే ప్రస్తుతం ఇటువంటి ఫీలింగ్స్ షేర్ చేసుకునే సమయం తగ్గడం అపార్థాలకు దారితీస్తోంది. కొందరిలో ఈ పరిస్థితివల్ల భార్యా భర్తల వైవాహిక జీవితం రిస్కులో పడుతోంది. అనుమానాలు, గొడవలతో విడిపోయే పరిస్థితులు తలెత్తున్నాయి. ఇలా జరగకూడదంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఫ్యామిలీ కౌన్సెలింగ్ నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం.

సమస్యలు చిన్నవే కానీ..

‘అపార్థం చేసుకోవడం ప్రారంభిస్తే చిన్న చిన్న సమస్యలే పెద్దగా అనిపిస్తాయి. అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా ఇట్టే సాలో అయిపోతాయి’ అంటున్నారు నిపుణులు. భార్యా భర్తలకు లేదా సహజీవనం చేసే స్త్రీ, పురుషులెవరికైనా ఇది వర్తిస్తుంది. క్షణికావేశంలో బంధాలను దూరం చేసుకునే బదులు కాస్త ఆలోచించి అడుగు వేయడం బెటర్ అని సూచిస్తున్నారు. ఉరుకులు.. పరుగుల జీవితం కారణంగా ముఖ్యంగా మెట్రో సిటీస్‌లో ఉంటున్న జంటల్లో చాలామందికి ఎక్కువ సమయం ఒకచోట గడిపే అవకాశాలు అరుదుగా ఉంటున్నాయి. ఫలితంగా కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడుతోంది. ఒకరినొకరు అర్థం చేసుకునే బదులు అపార్థం చేసుకునే పరిస్థితులు అధికం అవుతున్నాయి. వాటిని నివారించడంలోనే అసలైన పరిష్కారం ఉందని నిపుణులు చెప్తున్నారు.

ముందే ప్లాన్ చేసుకోండి

పార్టనర్స్ హ్యాపీగా ఉండాలంటే తమకు ఉన్న సమయంలోనే ఆనందంగా గడిపే ప్లాన్ చేసుకోవాలని, ఫిజికల్ రిలేషన్‌కి ప్రయారిటీ ఇవ్వాలని, అలాగే హాలిడేస్, వీకెండ్స్‌‌లో నచ్చిన విధంగా మరింత ఉత్సాహంగా గడిపేందుకు ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. దీంతోపాటు కొన్నిసార్లు భాగస్వామికి సర్ ప్రైజ్ కలిగించే విషయాలు కూడా బంధాన్ని బలపరుస్తాయి. మనస్పర్థలను, మనసుల మధ్య దూరాన్ని తగ్గిస్తాయి. సడెన్ సర్ ప్రైజ్ కారణంగా పార్టనర్ తన గురించి ఆలోచిస్తున్నారనే భావన ఎదుటి వ్యక్తికి కలుగుతుంది. ఏమాత్రం సమయం దొరికినా సినిమాలకు వెళ్లడం, వెకేషన్ ప్లాన్ చేయడం, మీరే ఏదైనా స్పెషల్ ఫుడ్ ప్రీపేర్ చేయడం వంటివి అపార్థాలకు అవకాశం లేకుండా చేస్తాయి.

కమ్యూనికేషన్ మస్ట్

పార్టనర్స్ మధ్య రొమాంటిక్ రిలేషన్‌షిప్ సంబంధాలు బలంగా ఉండాలంటే కమ్యూనికేషన్ కూడా చాలా ముఖ్యం. ఇది శృంగార పరమైన జీవితాన్ని ఆనందమయం చేస్తుంది. ఎమోషనల్ టచ్ అండ్ ఫీల్ కలిగిస్తుంది. ఒకరిపట్ల ఒకరు సానుకూలంగా ఆలోచించేలా చేస్తుంది. అనుమానాలకు తావులేకుండా పోతుంది. కాబట్టి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా, మీకు తగిన సమయం దొరికినప్పుడు మనసు విప్పి మాట్లాడుకోవాలని, అనుమనాలు నివృత్తి చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఎదుటి వ్యక్తి చెప్పింది శ్రద్ధగా వినడం, తప్పుగా అనిపిస్తే అర్థం అయ్యేలా వివరించడం, మీలో పొరపాట్లు ఉంటే అంగీకరించి సరిదిద్దుకోవడం, అవసరమైతే సారీ చెప్పడం వంటివి చేయాలి. దీంతోపాటు పరస్పర అవగాహన, పర్సనల్ ఫీలింగ్స్ షేర్ చేసుకోవడం, శారీరక స్పర్శ వంటివి భార్యాభర్తల మధ్య మానసిక, లైంగిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయి.


Similar News