రిమోట్ వర్క్‌తో పెరుగుతున్న స్ట్రెస్.. స్ట్రోక్, హార్ట్ ఎటాక్ వచ్చే చాన్స్ !
ఇటీవల కొందరు రిమోట్ వర్క్‌ను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. దీనివల్ల క్రానిక్ స్ట్రెస్‌ను ఎదుర్కొంటున్నట్లు రీసెంట్ నివేదికలు పేర్కొంటున్నాయి.
దిశ, ఫీచర్స్ : ఇటీవల కొందరు రిమోట్ వర్క్‌ను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. దీనివల్ల క్రానిక్ స్ట్రెస్‌ను ఎదుర్కొంటున్నట్లు రీసెంట్ నివేదికలు పేర్కొంటున్నాయి. అసలు రిమోట్ వర్క్ అంటే ఏమిటి? అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఒక ఉద్యోగి వర్క్ ఫ్రమ్ హోం లేదా ఉద్యోగం చేసే సంస్థకు వెలుపల సొంత కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని వర్క్ చేస్తుంటారు. అయితే ఇలా చేస్తున్నవారిలో చాలా మంది తాము పనిచేసే సంస్థకు తెలియకుండా అదనపు సంపాదనకోసం మరో సంస్థలో పార్ట్ టైం లేదా షిఫ్ట్‌వైజ్ వర్కు కూడా చేస్తుంటారు. దీనినే రిమోట్ వర్కుగా నిపుణులు పేర్కొంటున్నారు. వీక్లీ 50 నుంచి 60 గంటలు ఎక్స్‌ట్రా వర్క్ చేయడంవల్ల పలువురు క్రానిక్ స్ట్రెస్‌తో పాటు వివిధ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.
రిమోట్ వర్క్‌వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. దీంతో వర్క్ క్వాలిటీని, ఏకాగ్రత కోల్పోతుంటారు. పైగా బాధితుల్లో గుండె జబ్బులు వచ్చే రిస్క్ పెరుగుతుంది. ఇటీవల రిమోట్ వర్క్ ట్రెండ్ పెరిగినప్పటికీ.. సమస్యలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయని వన్‌పోల్ సంస్థ నిర్వహించిన సర్వేలోనూ వెల్లడైంది. ముఖ్యంగా బ్రెయిన్, హార్ట్ రిలేటెడ్ సమస్యలకు రిమోట్ వర్క్ ఒక కారణంగా ఉంటోంది. చేస్తున్న ఉద్యోగంతోపాటు పార్ట్ టైంగా మరో సంస్థలో కూడా పనిచేస్తారు కాబట్టి మార్నింగ్ లేచింది మొదలు అర్ధరాత్రి దాటే వరకు కష్టపడుతుంటారు. ఫలితంగా మానసిక, ఆరోగ్య సమస్యలు దాడి చేస్తాయి.
సామర్థ్యానికి మించిన సాహసం..
పనిచేయడంలోనూ శరీరానికి కొన్ని లిమిట్స్ అవసరం అవుతాయి. కానీ ఇదేది పట్టించుకోకుండా కొందరు శక్తికి, సామర్థ్యానికి మించి రిమోట్ వర్క్ వైపు మొగ్గు చూపుతున్నారు. రాత్రంతా మేల్కొని ఎక్కువగంటలు పని చేస్తున్నారు. దీనివల్ల ఒత్తిడి పెరగడం, క్రియేటివిటీ తగ్గడం జరుగుతోంది. స్ట్రెస్‌వల్ల క్రమంగా తీవ్రమైన తలనొప్పి, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్, మైగ్రేయిన్ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. పైగా రిమోట్ వర్క్‌వల్ల వ్యక్తుల శరీరం ఒత్తిడికి గురైనప్పుడు కార్టిసాల్, అడ్రినలిన్ హార్మోన్స్ అధికంగా రిలీజ్ అవుతాయి. దీనివల్ల హై బ్లడ్ ప్రెజర్, డిప్రెషన్, మెంటల్ డిజార్డర్స్, కార్డియో వాస్క్యులర్ ఇష్యూస్ పెరుగుతాయి.
సొల్యూషన్ ఏమిటి?
కొందరు అదనపు వర్కుకు చెక్ పెట్టకుండా సొల్యూషన్ ఏంటనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి రిమోట్ వర్క్ అనేది ఒక వ్యక్తిలో సామర్థ్యానికి మించిన శక్తిని, శ్రమను ఖర్చు చేయాల్సిన పరిస్థితి. కాబట్టి ఆ విధమైన జీవన శైలికి స్వస్తి పలకడమే బెస్ట్ సొల్యూషన్‌గా నిపుణులు పేర్కొంటున్నారు. ఇక తప్పదనుకున్న వారు మాత్రం సెల్ఫ్ కేర్ తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఎంత ఎక్స్‌ట్రా వర్క్ చేస్తే అంత రిలాక్సేషన్ అవసరం. దీనివల్ల రీ బిల్డ్ అవుతారు. స్ట్రెస్ రిలీఫ్ వర్కవుట్స్, వర్కులో ఉన్నప్పుడు మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఒత్తిడిలేని కుటుంబ వాతావరణం, జీవన శైలి, తగినంతగా నిద్రపోవడం, యోగా, ఇతర వ్యాయామాలు వంటివి రిమోట్ వర్క్ ఎంప్లాయీస్‌కు ఉపశమనం కలిగిస్తాయి.