Happy Friendship Day.. చెక్కు చెదరని నమ్మకానికి ప్రతీక స్నేహం

జీవితమనేది ఒక నదిలాంటిది. ప్రతిరోజూ అనేక మలుపులు తిరుగుతూ ఉంటుంది. సముద్రాన్ని చేరాలనే లక్ష్యంతో పరుగెడుతున్న ఆ నదీ ప్రవాహంలాగే.. లైఫ్‌లో సాధించాల్సిన గోల్స్ వైపు మీరు పరుగెత్తాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అనేక ఆటంకాలు

Update: 2023-08-06 04:44 GMT

దిశ, ఫీచర్స్ : జీవితమనేది ఒక నదిలాంటిది. ప్రతిరోజూ అనేక మలుపులు తిరుగుతూ ఉంటుంది. సముద్రాన్ని చేరాలనే లక్ష్యంతో పరుగెడుతున్న ఆ నదీ ప్రవాహంలాగే.. లైఫ్‌లో సాధించాల్సిన గోల్స్ వైపు మీరు పరుగెత్తాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అనేక ఆటంకాలు ఏర్పడుతుంటాయి. నిరాశా నిస్పృహలు వేధిస్తుంటాయి. సమస్యల సుడిగుండాలు చుట్టుముడుతుంటాయి. అయినా సరే వాటిని ఎదుర్కోవడంలో మీకు సహాయపడే వ్యక్తులు కొందరు ఉంటారు. అలాంటి అరుదైన ఆణిముత్యాలే మీ ప్రాణ స్నేహితులు. ప్రపంచమంతా ఒక్కటై మిమ్మల్ని వెంటాడుతున్నా.. ఏమాత్రం లెక్క చేయక మీ వెంట నడిచే నమ్మకమే ఫ్రెండ్స్. అందుకే అంటారు ఫ్రెండంటే ఒక ధైర్యమని. ఫ్రెండంటే ఆత్మ స్థైర్యమని. చరిత్ర పుటల్లోనూ ప్రాధాన్యత సంతరించుకున్న అలాంటి సందర్భాన్ని గుర్తు చేసుకునే మరో వేడుకే నేటి ఫ్రెండ్‌షిప్ డే.

ఎంత చెప్పినా ఒడవని కథ

ఎప్పుడూ సరదాగా ఉండే మీరు ఒక్కసారిగా బాధలో కూరుకుపోయారు. ఏవో ప్రతికూల ఆలోచనలు వెంటాడుతున్నాయి. ఆ క్షణం ఏమీ తోచట్లేదు. అప్పుడు టక్కున మదిలో ఒక ఆలోచన మెదులుతుంది. అంతే.. ‘నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా మాట్లాడి చూద్దాం. ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది’ అనే ఆత్మ విశ్వాసంతో ఊపిరి పీల్చుకుంటారు. ఇదీ ఫ్రెండ్‌షిప్‌లోని గొప్పతనం. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా సరే.. కుల, మత, పేద, ధనిక భేద భావాలు లేకుండా మిమ్మల్ని గుండెలకు హత్తుకునే వ్యక్తులు ఎవరైనా ఉంటారంటే వాళ్లే స్నేహితులు. నిజానికి ఎంత చెప్పినా ఒడవని కథ స్నేహం. ఎంత ఆస్వాదించినా తరగని నిధి ఫ్రెండ్‌షిప్. బట్టలు కుట్టే సూది చిన్నది. కూరగాయలు తరిగే కత్తి పెద్దది. అలాగని రెండింటిలో ఏది గొప్పదంటే ఏం చెప్తాం?. భిన్న రూపాలు కలిగి ఉండవచ్చు. కానీ దేని ప్రాధాన్యత దానికుంటుంది. సూది చేయాల్సిన పని కత్తి చేయదు, కత్తి చేయాల్సిన పని సూది చేయదు. అందుకే రెండూ గొప్పవే. ప్రతీ ఒక్కదాని విలువ మహోన్నతమైనదే. ఫ్రెండ్‌షిప్‌లోనూ అంతే వారి రూపాలు, వారి వెనుకున్న ఆర్థిక కోణాలు, హోదాలు ఇక్కడ పనిచేయవు. ఫ్రెండంటే ఫ్రెండ్ అంతే.

అందుబాటులో లేకపోయినా..

లైఫ్ అన్నాక ఎన్ని పనులుంటాయి! ఎప్పుడూ కలుసుకోవడం, టచ్‌లో ఉండటం అందరికీ సాధ్యం అయ్యే పనికాదు. అలాంటప్పుడు బంధాలు బలహీన పడుతుంటాయి అంటారు నిపుణులు. కానీ ఫ్రెండ్‌షిప్‌లో మాత్రం అది వర్తించదు. రోజూ అందుబాటులో ఉండకపోచ్చు. వేర్వేరు చోట్ల, వేర్వేరు దేశాల్లో సెటిల్ కావచ్చు. కలుసుకోక ఏండ్లు గడిచి ఉండవచ్చు. అయినా సరే.. మీ గురించి తప్పుగా అర్థం చేసుకోని వ్యక్తి ఫ్రెండ్ మాత్రమే. ఎంత గ్యాప్ తర్వాత పకలకరించినా సరే నిష్కల్మషంగా స్పందిస్తుంటారు దోస్తులు. సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు అన్నది ఎంత నిజమో, నిజమైన ఫ్రెండ్‌షిప్ ఎప్పటికీ మారదు అన్నది కూడా అంతే నిజం. అందుకే జీవితంలో మీరు అలసిపోయినట్లు అనిపించిన క్షణంలోనో, సమస్యలతో పోరాడుతూ జీవితంపై విరక్తి కలుగుతున్న సందర్భంలోనో జస్ట్ ఒక్కసారి మీ ప్రాణ స్నేహితులను కలువండి. అవసరమైతే ఫోన్ చేయండి. అప్పుడు మీ ఆలోచనలు మారుతాయి. ప్రతికూల భావాలు కనుమరుగవుతాయి. సానుకూల ఆలోచనలతో న్యూ జర్నీ మొదలు పెడతారు. మీ ముఖంపై ఆనందం వెల్లివిరుస్తుంది. అదే కదా స్నేహం చేసే మిరాకిల్.

టాక్సిక్ ఫ్రెండ్స్ ఉంటారా?

స్నేహం చాలా గొప్పది. ప్రతీ ఒక్కరి జీవితంలో ఫ్రెండ్స్ పోషించే పాత్ర చాలా కీలకమైంది. అనేక సందర్భాల్లోనే కాదు, కడదాకా తోడూ నీడై నిలిచేవారు ఎందరో ఉన్నారు. అలాగని అందరూ అలాగే ఉంటారా? ఉండకపోవచ్చు. ఎందుకంటే కొన్ని సంఘటనలు, కొందరి అనుభవాలు టాక్సిక్ ఫ్రెండ్‌షిప్ గురించి కూడా వెల్లడిస్తున్నాయి. ఎక్కడైనా అరుదుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే స్నేహితులు కూడా ఉండవచ్చు. మీతో కలిసి మెలిసి ఉంటూనే మీ ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నం చేయవచ్చు. దీని గురించి ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి వారు ఒకసారి పరిశీలించుకుంటే తమ జీవితంలో టాక్సిక్ ఫ్రెండ్స్ ఎవరో ఈజీగా తెలిసిపోతుంది. తరచూ మీలో పాజిటివ్ కోణాన్ని వదిలి, కేవలం లోపాలు మాత్రమే వెతకడం, తమ అవసరాలకు మిమ్మల్ని వాడుకుని, మీరు ఆపదలో ఉన్నప్పుడు మాత్రం తప్పించుకు తిరగడం, మీ గురించి తప్పుగా ప్రచారం చేయడం, ఏ అవకాశం దొరికినా ఇరుకున పెట్టాలని చూడటం, అన్‌హెల్తీ కాంపిటీషన్‌ను ప్రోత్సహించడం వంటివి విషపూరిత స్నేహాలకు నిదర్శనం అంటున్నారు నిపుణులు.

చరిత్రలో ఫ్రెండ్‌షిప్ డే

స్నేహమంటే ఏదో ఒక్కరోజుతో ముగిసిపోయే వేడుక కాదు, లైఫ్ లాంగ్ కొనసాగే జర్నీ. అయినా సరే మరోసారి గుర్తుచేసుకుని ఆనంద క్షణాలను ఆస్వాదించే అరుదైన సందర్భం ఒకటుంది. అదే ఇంటర్నేషనల్ ఫ్రెండ్ షిప్ డే. కొన్ని దేశాల్లో ఆగష్టు 30 జరుపుకుంటారు. కానీ మన దేశంలో ఆగష్టులో మొదటి ఆదివారం ఫ్రెండ్ షిప్ డేను సెల్రబేట్ చేసుకుంటాం. అమెరికాతోపాటు పలు యునైటెడ్ స్టేట్స్ కూడా ఇదే రోజు స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటాయి. ఇంతకీ ఇది ఎలా ఆవిర్భవించిందంటే..20వ శతాబ్దం ప్రారంభంలో హాల్‌మార్క్ కార్డ్‌ సృష్టికర్త జాయిస్ హాల్ స్నేహానికి గుర్తుగా ఒకరోజును సెలబ్రేట్ చేసుకోవాలని ప్రతిపాదించాడట. అప్పటి నుంచి వేడుకలు జరుపుకోవడం ప్రారంభమైంది. మరో కథనం ప్రకారం.. 1958లో పెరూలో తొలిసారిగా ఫ్రెండ్‌షిప్ డే భావనను ప్రతిపాదించారు. ఇక 2011లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ కూడా జూలై 30 ఇంటర్నేషనల్ ఫ్రెండ్‌షిప్ డేను అధికారికంగా ప్రకటించింది. ఈ సంవత్సరం (2023) ‘స్నేహం ద్వారా మానవ స్ఫూర్తిని పంచుకోండి’ అనే థీమ్‌తో ఫ్రెండ్‌షిప్ సెలబ్రేట్ చేసుకోవాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది.

Read More:  చేతులతోనే ఎన్నో అద్భుతాలు సృష్టించే నేతన్నకు.. చేనేత దినోత్సవం శుభాకాంక్షలు..


Similar News