కొత్తిమీర త్వరగా పాడైపోతుందా..? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
సహజంగా కొత్తిమీరను వంటల్లో ఎక్కువగా వినియోగిస్తుంటారు.
దిశ, ఫీచర్స్: సహజంగా కొత్తిమీరను వంటల్లో ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఎలాంటి వంట చేసినా.. కొత్తిమీరను అందులో వేస్తే, దాని రుచితో పాటు, సువాసన అదిరిపోతుంది. అందుకే చాలామంది దీనిని తప్పనిసరిగా వినియోగిస్తుంటారు. కానీ, కొత్తిమీరను ఎక్కువగా తెచ్చిపెంటుకుంటే త్వరగా వాడిపోతుంది. బయట పెట్టినా ఫ్రిజ్‌లో పెట్టినా సరే త్వరగా పాడైపోతుంది. అయితే, ఈ టిప్స్ పాటించారంటే కొత్తిమీర ఎక్కువకాలం ఫ్రెష్‌గా ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
* కొత్తిమీరను ఫ్రిజ్‌లో పెడితే 2 లేదా మూడు రోజుల కంటే ఎక్కువ కాలం ఉంటుంది. అయితే, దీనిని నేరుగా ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ముందుగా దీనిని శుభ్రంగా కడిగి, తేమ లేకుండా తుడుచుకోవాలి. ఆ తరువాత దీని ఆకులను కట్ చేసి, గాలి వెళ్లని ఒక డబ్బాలో స్ట్రోర్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఎక్కువకాలం పాడైపోకుండా ఉంటుంది.
* కొత్తిమీరను ఎప్పుడూ కూడా అలాగే తెచ్చి ఫ్రిజ్‌లో ఉంచకూడదు. దానిని శుభ్రంగా కడిగి, తేమ లేకుండా ఉండే కిచెన్ టవల్‌తో దీనిని తుడవాలి. ఇందులో కొంచెం కూడా తేమ లేకుండా జాగ్రత్తపడాలి. ఇలా చేయడం వల్ల కొత్తిమీరపై ఉండే మట్టి, వ్యర్థాలు తొలగిపోతాయి.
*ఫ్రిజ్‌లో స్ట్రోర్ చేసేందుకు మరో పద్ధతి కూడా ఉంది. కొత్తిమీర పొడిగా ఉన్నప్పుడు ఓ పేపర్ టవల్‌లో చుట్టి ఫ్రిజ్‌లో పెట్టండి. దీని వల్ల ఇందులో అదనంగా ఉన్న తేమను ఆ పేపర్ టవల్ పీల్చేసుకుంటుంది. కొత్తిమీర తాజాగా ఉంటుంది.
* ఒకవేళ ఇంట్లో ఫ్రిజ్ లేకుంటే.. కొంత కాలంపాటు తాజాగా ఉంచేందుకు మరో పద్ధతి ఉంది. మొదటి కొత్తిమీర ఆకులను శుభ్రంగా కడిగి, తుడవాలి. అందులో ఏవైనా పాడైన ఆకులు ఉంటే వాటిని తొలగించాలి. ఆ తరువాత ఒక కంటైనర్ డబ్బా తీసుకొని, అందులో కాస్త నీరు నింపాలి. ఆకులను ప్లాస్టిక్ బ్యాగ్‌తో కప్పి, రబ్బరు బ్యాండ్ వేయాలి. నీరు నింపిన డబ్బాలో కొత్తిమీర వేర్ల అంచులను కొంచెం కట్ చేసి, నీటిలో మునిగేలా ఉంచాలి. ఇలా చేయడం వల్ల కొత్తిమీర త్వరగా పాడవకుండా తాజాగా ఉంటుంది.
* కొత్తిమీరను కడిగి, తుడిచిన తరువాత ఫ్రిజ్‌లో నేరుగా పెట్టకుండా ఒక జిప్‌లాక్ బ్యాగ్‌ను ఉపయోగించండి. ఇందులో కొత్తిమీరను స్ట్రోర్ చేయడం వల్ల 5 లేదా ఆరు రోజుల పాటు తాజాగా ఉంటుంది.