మేడారం జాతరలో కోళ్లను ఎందుకు ఎగరవేస్తారు.. దీని వెనుక అసలు కథ ఏమిటో తెలుసా?
తెలంగాణ కుంభమేళా మొదలైంది. వన బిడ్డలను దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున మేడారం తరలి వెళ్తున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో సమ్మక్క సారలమ్మ జాతర ( మే21న)ప్రారంభమైంది
దిశ,ఫీచర్స్ : తెలంగాణ కుంభమేళా మొదలైంది. వన బిడ్డలను దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున మేడారం తరలి వెళ్తున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో సమ్మక్క సారలమ్మ జాతర ( మే21న)ప్రారంభమైంది. ఈ జాతరకు మన రాష్ట్రం నుంచే కాకుండా దేశ వ్యాప్తంగా భారీ సంఖ్యలో భక్తులు తరలి వెళ్తున్నారు. ఇక నాలుగు రోజుల పాటు ఈ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. శివసత్తులు, గిరిజనుల ఆట,పాటలతో సమ్మక్క, సారలమ్మలను గద్దెలకు చేర్చి, ఎత్తు బంగారంతో అమ్మవార్లను కొలుచుకుంటారు.
ఇక మేడారం జాతరలో కోళ్లను ఎగరవేయడం మనం చూస్తుంటాం. సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద కోళ్లను గాల్లోకి ఎగరేస్తుంటారు. అయితే అసలు అమ్మవార్ల ముందు కోళ్లు ఎగరవేయడం ఏంటి, ఎందుకు ఇలా ఎగరవేస్తారో చాలా మందికి తెలియదు. కాగా, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
భక్తులు అమ్మవార్లకు వివిధ రకాల మొక్కులు మొక్కుతారు. తమ కుటుంబం బాగుండాలని, ఎత్తు బంగారం, కోళ్లు, మేకలు, గొర్రెలు ఇలాంటివి మొక్కుతారు. ఈ క్రమంలో మేడారం వద్దకు వచ్చి ఆ మొక్కులు తీర్చుకుంటారు.
అయితే చిలకల గుట్ట నుంచి గద్దె మీదకు వచ్చే వరకు అమ్మవారు ఉగ్రరూపంతో ఉంటారంట, వారిని శాంత పరిచేందుకు తమ మొక్కులను అమ్మవారికి ఎదురు చూపెడుతూ, అమ్మవారిని శాంతపరిచే ప్రయత్నంగా కోళ్లను గాల్లోకి ఎగరేస్తూ, ఎదురు చూపెడుతారంట. ఇది ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది అంటున్నారు పూజారులు.