మహిళలలో కనిపించే సాధారణ పోషక లోపాలు.. ఇలా చెక్ పెట్టేయండి!!

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది పోషకాహారం తీసుకోవడంపై దృష్టి సారించడం లేదు.

Update: 2024-11-30 11:51 GMT

దిశ, ఫీచర్స్: ఈ ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది పోషకాహారం తీసుకోవడంపై దృష్టి సారించడం లేదు. దీని వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి పోషకాలు అనేవి చాలా అవసరం. వాటిలో ఏదైనా లోపం ఏర్పడితే అనేక రకాల ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుందని నిపుణులుచెబుతున్నారు. అయితే, సాధారణంగా మహిళలు ఎదుర్కొనే పోషకాహార లోపాలు ఏమిటి? వీటిని ఎలా అధిగమించాలి అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకోండి.

కాల్షియం లోపము: ఎముకలు, దంతాలు దృఢంగా ఉండడానికి కాల్షియం అనేది చాలా ముఖ్యం. సాధారణంగా గర్భధారణ, నెలసరి సమయంలో హార్మోన్ల మార్పులు కారణంగా కాల్షియం లోపం వచ్చే అవకాశం ఉంటుంది. గోర్లు, కండరాల తిమ్మిరి, హృదయ స్పందనలో మార్పులు వంటివి కాల్షియం లోపం లక్షణాలు. ఈ లోపాన్ని తగ్గించుకోవాలంటే చీజ్, పెరుగు, పాల ఉత్పత్తులను తీసుకోవాలి. వీటితో పాటుగా తృణధాన్యాలు, ఆకు కూరలు, బాదం వంటివి శరీరానికి కాల్షియంను అందిస్తాయి.

ఐరన్: చాలామంది మహిళలకు ఐరన్ లోపం ఏర్పడుతుంది. ఐరన్ అనేది రక్తంలోని హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్‌ను అందించడంలో ఉపయోగపడుతుంది. మహిళలలో ఐరన్ లోపం ఉంటే మైకము, అలసట, శ్వాస లోపం, తరుచుగా ఇన్‌ఫెక్షన్ వంటి సమస్యలు వస్తాయి. శరీరంలో ఐరన్‌ను పెంచుకోవాలంటే పౌల్ట్రీ, సీఫుడ్, తృణధాన్యాలు వంటివి తీసుకోవాలి. విటమిన్-సి అనేది శరీరంలో ఐరన్‌ను పెంచడంలో సహాయపడుతుంది.

ఫోలేట్ లోపం: ఫోలేట్ అనేది ఎర్రరక్త కణాల ఉత్పత్తికి, డీఎన్‌ఏ సంశ్లేషణకు అవసరమైన విటమిన్- బి. మహిళల్లో ఫోలేట్ లోపం వల్ల అలసట, బలహీనత, చిరాకు, రక్తహీనత వంటి సమస్యలు వస్తాయి. ఈ లోపాన్ని తగ్గించుకోవడానికి ఆకు కూరలు, చిక్కుళ్లు, సిట్రస్ పండ్లను ఆహారంలో భాగంగా తినడం మంచిది.

మెగ్నీషియం: మెగ్నీషియం అనేది నరాలు, కండరాల పనితీరు, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యతకు మెగ్నీషియం ఉండే ఆహారంను తీసుకోవాలి. మెగ్నీషియం లోపించిందంటే కండరాల తిమ్మిరి, మైగ్రేన్, ఆందోళన వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్యలకు తగ్గించుకోవడానికి ఆకు కూరలు, గింజలు, తృణధాన్యాలు వంటివి ఆహారంలో భాగంగా తీసుకోవాలి. ఈ లోపం ఎక్కువగా ఉన్నట్లైతే వైద్యులను సంప్రదించడం మంచిది.

విటమిన్ డి: శరీరంలోని ఎముకలను బలంగా ఉంచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి విటమిన్- డి అనేది ముఖ్యమైనది. ఇది సూర్యరశ్మి నుండి అందుతుంది. మహిళల్లో విటమిన్ డి లోపం కారణంగా కండరాల బలహీనత, అలసట లేదా తరచుగా అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఈ లోపాన్ని తగ్గించుకోవాలంటే రోజుకు కనీసం10 నిమిషాల పాటు సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. విటమిన్ డి అధికంగా ఉండే సాల్మన్, గుడ్లు, పాల ఉత్పత్తులను తీసుకోవాలి.

Read More...

Green Vegetables: పోషకాలు పోకుండా ఇలా వండేయండి..!




Tags:    

Similar News