జంతువుల్లోనూ ‘సోషల్ లెర్నింగ్’ స్కిల్స్.. ఎలా నేర్చుకుంటాయో తెలుసా?
ప్రకృతిలో ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ సోషల్ లెర్నింగ్ స్కిల్స్ మనుషులకే కాదు, అనేక రకాల జంతువులు, పక్షుల్లో కూడా ఉంటాయని బోస్టన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు చెప్తున్నారు
దిశ, ఫీచర్స్ : ప్రకృతిలో ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ సోషల్ లెర్నింగ్ స్కిల్స్ మనుషులకే కాదు, అనేక రకాల జంతువులు, పక్షుల్లో కూడా ఉంటాయని బోస్టన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు చెప్తున్నారు. చిన్నప్పటి నుంచి సహజంగానే కొన్ని విషయాలను మనుషులు ఇతరుల ద్వారా ఎలా నేర్చుకుంటారో వివిధ జంతువులు, కీటకాలు, పక్షులు అలాగే నేర్చుకుంటాయి. తమ జాతికి చెందిన, ఇతర జాతులకు చెందిన జంతు సమూహాలను, అలాగే మనుషులను పరిశీలిస్తూ మనుగడ సాగించగలిగే నైపుణ్యాలను కూడా అలవర్చుకుంటాయి.
వాస్తవానికి చాలా జంతువులు గుంపులుగా జీవిస్తాయి. ఈ పరిస్థితి వాటిలో పరస్పరం నేర్చుకోవడం, ఆహారం సేకరించడం, పంచుకోవడం, వాసనలను పసిగట్టడం వంటి విషయాలపట్ల అవగాహనకు దోహద పడుతుందట. ముఖ్యంగా తమ సహచరులను ఎలా కనుగొనాలి? ఆహార సేకరణలో భాగంగా ఎక్కడికి వెళ్లాలి? వేటాడే జంతువుల నుంచి తమను తాము ఎలా రక్షించుకోవాలి? అనే సమాచారాన్ని ఎలుకలు, ఉడుతలు, తాబేళ్లు, చీమలు, ఏనుగులు, జింకలు, పలు ఇతర జంతు జాతులు గ్రహిస్తాయి. ఉదాహరణకు ఉడుతలు ఇతర ఉడుతల బ్రీతింగ్ స్మెల్‌ను పసిగట్టడం ద్వారా అవి ఏ రకమైన ఆహారాన్ని తింటున్నాయో తెలుసుకుంటాయట. అందుకే నేర్చుకునే దశలో ఉన్న ఉడుతలు, ఎలుకలు కూడా ఇటువంటి వాసనలను పసిగట్టి ఆహారం, పండ్లు, దుంపల సేకరణకోసం ప్రయత్నిస్తాయని జీవశాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంతేకాదు మన దేశంలో మైనా పక్షులు లెర్నింగ్ స్టేజీలో ఉన్నప్పుడు ఇతర పక్షులను గమనిస్తూ ఆహార సేకరణ, ఆపద సమయంలో తప్పించుకోవడం వంటి స్కిల్స్ నేర్చుకుంటాయి.