బైక్‌పై వెళ్లేటప్పుడు వీధికుక్కలు వెంబడిస్తున్నాయా.? భయపడకుండా ఈ ట్రిక్స్ పాటిస్తే చాలు..
ఇటీవలి కాలంలో ఎక్కడ చూసినా వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉంది. దీంతో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
దిశ, ఫీచర్స్: ఇటీవలి కాలంలో ఎక్కడ చూసినా వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉంది. దీంతో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ వీధి కుక్కల బెడద వల్ల పిల్లలు సాయంత్రం వేళ పార్కుల్లో సైతం ఆడుకోవాలంటేనే భయపడుతున్నారు. మరి వీధి కుక్కల దాడి నుంచి ఎలా తప్పించుకోవాలి.. అవి దాడి చేసినప్పుడు ఏమి చేయాలి.. అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా పిల్లలు ఒంటరిగా రోడ్డుపైకి వస్తే చాలు వీధి కుక్కలు దాడి చేస్తున్నాయి. కాబట్టి పిల్లలను ఒంటరిగా ఎక్కడికీ వెళ్లనివ్వకుండా పిల్లలతో ఎవరొకరు ఉండాలని నిర్ధారించుకోండి. ఇక పెద్దలు అయితే.. రోడ్డుపై వెళ్లేటప్పుడు తమతో పాటు ఒక కర్రను చేతిలో పెట్టుకోవడం మంచిది. ఆ కర్రను చూసి వీధి కుక్కలు బెదురుకొని మన దగ్గరికి రాకుండా ఉంటాయి. ఇక మీరు రోడ్డుపై నడుస్తున్నప్పుడు కుక్క మీ వద్దకు వస్తే, దాన్ని చూసి భయపడకండి. అలాగే వాటిని చూసి పరిగెత్తకండి. మీరు భయపడకుండా ఉండాలి. ఒకవేళ మీద.. మీదకు రావడానికి ప్రయత్నిస్తే.. కర్రనో, రాయినో విసరండి.
మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి:
కుక్క కాటు నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు ఒక మంచి టెక్నిక్.. మీ చేతిలో ఉన్న వస్తువు లేదా క్లాత్‌ను కుక్క కళ్లపై విసిరేయడం. అంటే మీరు మీ చొక్కా లేదా స్కార్ఫ్, దుప్పటా ఇలా ఏదైనా వాటిపైకి విసిరేస్తే తద్వారా వెంటనే అక్కడి నుంచి తప్పించుకోగలరు. మీరు ఎవరినైనా వీధి కుక్కలా నుంచి రక్షించేందుకు ప్రయత్నిస్తే.. చేతిలో ఏదైనా ఉండేలా చూసుకోండి. కొన్ని కుక్కలు వాటిపై నీళ్లు చల్లితే పారిపోతాయి. ఇదే కాదు కుక్క ముక్కు లేదా కళ్లను గుడ్డతో కప్పడానికి ప్రయత్నించండి, ఎందుకంటే అవి దాని వీక్ పాయింట్. ఇలా చేయడం ద్వారా మీరు వాటి దృష్టిని మరల్చవచ్చు.
కుక్కలు మీ వాహనాన్ని వెంబడిస్తుంటే ఇలా చేయండి:
సాధారణంగా మీరు బైక్‌పై వెళ్లేటప్పుడు అప్పుడప్పుడూ కుక్కలు మీ వాహనాన్ని వెంబడిస్తాయి. అలాంటి సమయంలో మీరు భయపడకుండా వాహనాన్ని స్లోగా పోనివ్వండి. స్పీడ్‌గా పోతే వాటికీ అనుమానమొచ్చి ఇంకా మీద మీదకు స్పీడ్‌గా వస్తాయి. కాబట్టి వాహనం స్పీడ్ తగ్గిస్తే కుక్కలు ప్రమాదం లేదని భావించి వెనక్కి తగ్గుతాయి. అంతేకాదు మనం వేసుకున్న దుస్తుల రంగులు నచ్చకపోయినా, కళ్లజోళ్లు పెట్టుకున్నా, మనం వింతగా కనిపించినా కుక్కలు వెంటాడే ప్రమాదం ఉంటుంది. అందుకే మనం స్లోగా వెళ్తే అవి కూడా స్లో అవుతాయి అనే విషయం మర్చిపోకండి.