Sensitive Scalp: తల దురదకు చెక్ పెట్టండిలా !
తల లేదా స్కాల్ప్ దురద.. ఇది వినడానికి చిన్న సమస్యగానే అనిపించినా అనుభవించే వారికి చాలా అసౌకర్యంగా ఉంటుంది..
దిశ, ఫీచర్స్: తల లేదా స్కాల్ప్ దురద.. ఇది వినడానికి చిన్న సమస్యగానే అనిపించినా అనుభవించే వారికి చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఇక బయట పార్టీలకో, ఫంక్షన్లకో వెళ్లినప్పుడూ గడికోసారి తలగోక్కుంటే కనిపిస్తే చూసేవారికి అస్సలు బావుండదు. అందుకే ఈ సమస్య కనిపించగానే నిపుణులను సంప్రదించి దానిని దూరం చేసుకోవడం బెటర్. ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా స్కాల్ప్ దురద, చుండ్రువంటి ఇబ్బందులను నివారించవచ్చని నిపుణులు చెప్తున్నారు.
తలకు పడని షాంపులు, ఇన్ఫెక్షన్లు, దీర్ఘకాలికంగా మందులు వాడాల్సిరావడం, వాతావరణ మార్పులు, చుండ్రు, పేలు పడటం వంటి కారణాలతో తల దురద సమస్య ఏర్పడవచ్చు. ఆయుర్వేదిక్ నిపుణులు సూచించే పలు సహజ ఉత్పత్తులను ఉపయోగించడంవల్ల తల దురద సమస్యకు చెక్ పెట్టవచ్చు.
ఆపిల్ సైడర్ వెనిగర్ :
యాపిల్ సైడర్ వెనిగర్‌లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇవి తల దురదను నివారించడంలో కీలకంగా పనిచేస్తాయి. చుండ్రును తొలగించడంలో, జుట్టు ఒత్తుగా పెరగడంలో కూడా తోడ్పడుతుంది. కాబట్టి తల దురద సమస్య ఉన్నవారు ఒక టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్‌ను, 4 టీస్పూన్ల నీటిలో కలిపి, ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. వీక్లీ టూ టైమ్స్ ఇలా చేయడంతో స్కాల్ప్ దురద ఇక రాదు.
పుదీనా లేదా పిప్పరమెంటు నూనె : పుదీనా నూనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్స్ ఉంటాయి. ఇవి దురద, వాపును నివారించడంలో సహాయపడతాయి. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, పొటాషియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, క్యాలరీలు, కాల్షియం, ఫాస్పరస్, విటమిన్ సి, ఐరన్, విటమిన్ ఎ కూడా వీటిలో ఉండటంవల్ల మేలు జరుగుతుంది. ఒక టేబుల్ స్పూన్ పెప్పర్ మింట్ ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె వేసి మిక్స్ చేయాలి. దీనిని తలపై అప్లయ్ చేసి ఒక గంట తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగితే చాలు. దురద తగ్గిపోతుంది.
అలోవెరా జెల్ : తల దురద సమస్యను చెక్ పెట్టడంలో కలబంద చాలా బెటర్ గా పనిచేస్తుంది. చర్మ సంరక్షణ ఉత్పత్తులలో కూడా దీనిని ఉపయోగిస్తుంటారు. ఈ అలోవెరా జెల్‌ను తలలో దురదవచ్చే చర్మంపై అప్లై చేస్తే దురద తగ్గుతుంది. తలమొత్తం అప్లై చేస్తే చుండ్రు సమస్య కూడా దూరం అవుతుంది. అంతే కాదు జుట్టు రాలడం, రంగు మారడం, పేలు పడటం, దురద వంటి సమస్యలన్నింటినీ దూరం చేయడంలో అలోవెరా మెరుగ్గా పనిచేస్తుంది. దీని జెల్‌ని తీసుకుని నేరుగా తలపై మసాజ్ చేసి 20 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగితే మంచి తల దురద సమస్య శాశ్వతంగా దూరం అవుతుంది.