వేసవిలో మసాలాలకు దూరంగా ఉంటున్నారా? అయితే వీటి గురించి తెలుసుకోండి!

రోజు రోజు భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు.

Update: 2025-03-27 08:12 GMT
వేసవిలో మసాలాలకు దూరంగా ఉంటున్నారా? అయితే వీటి గురించి తెలుసుకోండి!
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: రోజు రోజు భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇక ఎండల తీవ్రత వల్ల శరీరం సాధారణం కంటే ఎక్కువగా వేడెక్కుతుంది. దీంతో డీహైడ్రేషన్‌, నీరసం, అలసట, వడదెబ్బ వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సమ్మర్‌లో ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా అవసరం. సాధారణంగా వేసవిలో మసాలా ఆహారాలు తినకపోవటమే మంచిది. అయితే, మన భారతీయ వంటింట్లోని మసాలా దినుసుల్లో ఉండే ఔషధ గుణాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో కొన్ని దినుసులకు వేసవి వేడి తాపం నుంచి కూడా ఆరోగ్యాన్ని కాపాడే లక్షణాలున్నాయి. అవేంటో ఈ సందర్భంగా తెలుసుకుందాం.

జీలకర్ర: ఇది శరీరంలోని ఉష్ణోగ్రతను తగ్గించి, శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. అలాగే, వాపు సమస్యలను తగ్గిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియకు చాలా మేలు చేస్తుంది. ఉబ్బరం, పొత్తికడుపు తిమ్మిరి వంటి సాధారణ వేసవి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

మెంతులు: మెంతి గింజలలో అనేక ఔషధ గుణాలున్నాయి. వీటికి ఆమ్లత్వం, వికారం, మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగించే శక్తి ఉంది. అందువల్ల ఇది జీర్ణక్రియకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే, మెంతులు శరీరాన్ని చల్లబరుస్తాయి. వేసవిలో రాత్రిపూట ఒక గ్లాసు నీళ్లలో ఒక చెంచా మెంతి గింజలు కలుపుకుని ఉదయాన్నే నిద్రలేచి ఈ నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ఇది మూత్ర నాళాల ఇన్ఫెక్షన్‌ను నివారించడంలో సాయపడుతుంది.

ధనియాలు: ధనియాలలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఎండాకాలంలో ఎక్కువగా వాడటం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపడానికి ఇది చాలా మేలు చేస్తుంది. అలాగే, శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. వేసవిలో ధనియాల నీరు తాగడం వల్ల శరీరానికి తగినంత నీరు లభించి, డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది.

యాలకులు: శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో యాలకులు కూడా చాలా మేలు చేస్తాయి. ఇంట్లో తయారుచేసిన శీతల పానీయాలలో యాలకులు కలుపుకుని తాగటం వల్ల ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

గసగసాలు: ఇవి వేసవిలో తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే.. గసగసాలు శరీరం నుంచి అధిక వేడిని తొలగిస్తుంది. వీటిల్లో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. దీన్ని స్మూతీస్, సలాడ్లు, డెజర్ట్‌లలో ఉపయోగించవచ్చు.

గమనిక: ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు ఆరోగ్య నిపుణులు, ఇంటర్నెట్ సమాచారం మేరకు తీసుకోబడినది. పరిగణలోనికి తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

Tags:    

Similar News