ఆర్కిటిక్‌లో 48,500 ఏండ్ల నాటి ‘జోంబీ’ వైరస్.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీకి దారితీస్తుందా?
కోవిడ్ మహమ్మారి సృష్టించిన ప్రాణాంతక ముప్పును, ఎబోలా వైరస్ వల్ల కలిగిన నష్టాన్ని ప్రపంచం ఇంకా మర్చేపోలేదు. కానీ తాజాగా ఆర్కిటిక్ ఖండంలోని దేశాల ప్రజలకు మరో ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
దిశ, ఫీచర్స్ : కోవిడ్ మహమ్మారి సృష్టించిన ప్రాణాంతక ముప్పును, ఎబోలా వైరస్ వల్ల కలిగిన నష్టాన్ని ప్రపంచం ఇంకా మర్చేపోలేదు. కానీ తాజాగా ఆర్కిటిక్ ఖండంలోని దేశాల ప్రజలకు మరో ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇది గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీకి దారితీసే అవకాశం ఉందని అనుమనాలు వ్యక్తం చేస్తున్నారు. అధ్యయనంలో భాగంగా Aix-Marseille యూనివర్సిటీకి చెందిన జన్యు శాస్త్రవేత్త జీన్-మిచెల్ క్లావరీ ఆధ్వర్యంలోని పరిశోధకుల బృందం ఇటీవల ఆర్కిటిక్‌లోని ఘనీభవించిన మంచులో, ఇతరచోట్ల మంచు పలకల కింద 48,500 ఏండ్లుగా సజీవంగా ఉన్న ప్రాణాంతక ‘జోంబీ’ వైరస్‌ను గుర్తించింది.
ఈ దేశాలకు మరింత ముప్పు
గార్డియన్ రిపోర్ట్ ప్రకారం కూడా .. ఆర్కిటిక్‌లో కరుగుతున్న మంచు కొండల ద్వారా ‘జోంబీ వైరస్’లు బయటకు రిలీజ్ అయ్యే చాన్స్ ఉంది. దీంతోపాటు గ్లోబల్ వార్మింగ్, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, కరుగుతున్న మంచు కారణంగా ఆర్కిటిక్ పరిధిలోకి వచ్చే కెనడా, గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, నార్వే, స్వీడన్, ఫిన్‌లాండ్, రష్యా, యునైటెడ్ స్టేట్స్‌లోని 8 దేశాలకు జోంబీ వైరస్ ముప్పు పొంచి ఉందని జన్యు శాస్త్రవేత్త జీన్ మిచెల్ పేర్కొన్నారు. గత సంవత్సరం సైబీరియన్ శాశ్వత మంచు (Siberian permafrost )లో తిరిగి పుంజుకుంటున్న జోంబీ వైరస్ శాంపిల్స్‌ను సేకరించిన పరిశోధకులు అవివేల సంవత్సరాలుగా ఘనీభవించిన మంచులో, భూమిలో స్తంభించిపోయి ఉన్నట్లు చెప్తున్నారు. 2014లో కూడా ఇక్కడ ఏక కణ కజీవులకు సోకే ప్రమాదకరమైన వైరస్‌లు ఉన్నట్లు కనుగొన్నారు.
ఏకకణ జీవులపై వైరస్ దాడి
ప్రత్యక్ష జోంబీ వైరస్‌ల వల్ల ఏకకణ జీవులకు మరింత ప్రమాదం పొంచి ఉంటుందని రోటర్‌డ్యామ్‌లోని ఎరాస్మస్ మెడికల్ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్త మారియన్ కూప్‌మన్స్ అంటున్నారు. ‘పర్మాఫ్రాస్ట్‌లో(శాశ్వత మంచు) ఏ వైరస్‌లు ఉన్నాయో నాకైతే తెలియదు. దానిని జోంబీ వైరస్‌గా కొందరు సైంటిస్టులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రమాదం అయితే పొంచి ఉందని నేను భావిస్తున్నాను. అది పోలియో వైరస్ యొక్క పురాతన రూపం కావచ్చు. ప్రపంచం అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది’’ అని పేర్కొన్నాడు. తనకు తెలిసినంత వరకు మంచు నుంచి వేరు చేయబడిన కొన్ని వైరస్‌లు గతంలో అమీబాకు మాత్రమే సోకాయని, మానవులకు ఎటువంటి ప్రమాదం కలిగించలేదని చెప్పాడు. అలాగని ప్రస్తుతం జోంబీ వైరస్ ఘనీభవించిన మంచులో ఉండటాన్ని తక్కువ అంచనా వేయడం లేదని కూడా స్పష్టం చేశాడు.