Technology : వామ్మో AI ..! కొన్ని విషయాల్లో తప్పుదారి పట్టించే అవకాశం?
Technology : వామ్మో AI ..! కొన్ని విషయాల్లో తప్పుదారి పట్టించే అవకాశం?
దిశ, ఫీచర్స్ : అది అమెరికా దేశంలోని టెక్సాస్.. ఓ బాలుడు ఎప్పుడూ ఫోన్‌లో మునిగితేలుతున్నాడు. దీంతో చదువుపై, తిండిపై, ఇతర విషయాలపై ఇంట్రెస్ట్ పెట్టడం లేదు. ఫోన్ ఎక్కువగా చూడవద్దని అప్పటికే పేరెంట్స్ ఎన్నోసార్లు చెప్పినా వినలేదు. చివరికి ఆ తల్లిదండ్రులు ఇంకోసారి ఫోన్ ఎక్కువగా చూస్తే దానిని గుంజుకుంటామని, ఇంకెప్పుడూ ఇవ్వమని వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఈ సమస్యకు పరిష్కారం కోసం ఆ బాలుడు ఏఐ చాట్‌బాట్(https://character.ai)ను ఆశ్రయించాడు.
దాడి చేయాలని సలహా
తన పేరెంట్స్ ఫోన్ చూడవద్దంటున్నారని, అందుకోసం తానేం చేయాలని సదరు బాలుడు అడిగాడు.. ఆ బాలున్ని ఓదార్చిన ఏఐ ‘‘ఇటీవల నీ లాంటి సమస్యలున్న పిల్లలు చాలా మంది ఉంటున్నారు. వారు తల్లిదండ్రులపై ఎటాక్, మర్డర్ అటెంప్ట్ వంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు నాకు ఆశ్చర్యంగా కలిగించడం లేదు’’ అని ఆన్సర్ ఇచ్చింది. పరోక్షంగా పేరెంట్స్‌పై దాడిచేసేలా ప్రోత్సహించింది. ఇది విన్న ఆ పిల్లవాడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇలా చెప్తోందేంటని భయపడ్డాడు. విషయాన్ని పేరెంట్స్‌కి చెప్పాడు. ఇది విన్న తల్లిదండ్రులు నిజమా.. కాదా? అని నిర్ధారించుకోవడానికి ఏఐ రిప్లైని పరిశీలించగా.. వాస్తవమేనని గ్రహించారు. తమ కొడుకుకి, ఏఐ చాట్‌బాట్ మధ్య జరిగిన సంభాషణ ఆధారంగా కోర్టును ఆశ్రయించారు.
‘నువ్వు చచ్చిపో’వాలంటూ..
ఆ మధ్య మిచిగాన్‌లోని ఓ కాలేజ్ స్టూడెంట్‌ను కూడా ‘నువ్వు చచ్చిపో’ అని ఏఐ చాట్‌బాట్ సలహా ఇచ్చిన విషయం ప్రపంచాన్నే ఆశ్చర్య పరిచింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫ్లోరిడాలో కూడా ఓ టీనేజర్ ఏఐ కారణంగా సూసైడ్ చేసుకోగా, అతని తల్లిదండ్రులు సదరు ఏఐ కంపెనీపై కేసు కూడా వేశారు. ఇలా ఒకటో రెండో కాదు. చాలా విషయాల్లో ఏఐ టెక్నాలజీ వల్ల నష్టపోయే అవకాశం లేకపోలేదు. దానివల్ల అనేక విషయాల్లో బెనిఫిట్స్ ఉంటున్నప్పటికీ, అప్పుడప్పుడూ యూజర్లను ఇలా తప్పుదోవ కూడా పట్టిస్తోందనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి ఏఐ విషయంలో ఆచి తూచి అడుగు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
పిల్లలు జాగ్రత్త
ఏఐ టెక్నాలజీ (AI technology) లేదా ఏఐ చాట్‌బాట్స్(AI chat bots)ను యూజ్ చేసే విషయంలో పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. పేరెంట్స్ వారిపై నిఘా ఉంచాలని చెబుతున్నారు. అలాగే ఏఐ చాట్‌బాట్ వల్ల కలిగే లాభ నష్టాల గురించి పిల్లలకు వివరించడం మంచిది. పెద్దలు కూడా ఏఐని యూజ్ చేసేటప్పుడు ప్రతీదీ గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదని, సమాచారాన్ని వాస్తవాలతో పోల్చి చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏ విషయంలోనైనా విచక్షణా జ్ఞానం ప్రదర్శించాలని చెబుతున్నారు.
గుడ్డిగా నమ్మేస్తే ప్రమాదమే
కొందరు రాత్రింబవళ్లు స్మార్ట్‌ఫోన్లు, అదర్ ఎలక్ట్రానిక్ డివైసెస్‌ను పరిమితికి మించి యూజ్ చేస్తుంటారు. దీనివల్ల పిల్లల్లో, పెద్దల్లో కూడా పలు సమస్యలు తలెత్తుతున్నాయి. చివరికి అదో వ్యసనంలా మారి మానసిక రుగ్మతలకు, శారీరక అనారోగ్యాలకు కారణం అవుతోంది. కంటిచూపు మందగిస్తోంది. ఫోన్లకు అతుక్కుపోవడంవల్ల ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గి ఊబకాయం, తినే రుగ్మతలు పెరుగుతున్నాయి. పరోక్షంగా ఇవి మధుమేహం, గుండె జబ్బులతో ముడిపడి ఉంటాయి. ఇక ఏఐ వంటి చాట్‌బాట్‌లు కొన్నిసార్లు తప్పుడు సమాచారం ఇవ్వొచ్చు.. అదే నిజమని నమ్మితే మాత్రం ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి టెక్నాలజీ విషయంలో బీ కేర్ ఫుల్ అంటున్నారు నిపుణులు. దానివల్ల ప్రయోజనాలతో పాటు సక్రమంగా వినియోగించుకోకపోతే, ప్రతీది గుడ్డిగా నమ్మేస్తే మోసపోయే అవకాశం ఉంటుందని చెప్తున్నారు.