ధూమపానం మానివేయలేకపోతున్నారా?.. ఒక మొక్కతో అది సాధ్యమే !
ఇక నుంచి స్మోకింగ్ మానివేయాలని అనుకుంటున్నారా? అయినా మీ నుంచి అవడం లేదా? కానీ ఇక నుంచి అంత ఇబ్బందిపడాల్సిన అవసరం రాకపోవచ్చు.
దిశ, ఫీచర్స్ : ఇక నుంచి స్మోకింగ్ మానివేయాలని అనుకుంటున్నారా? అయినా మీ నుంచి అవడం లేదా? కానీ ఇక నుంచి అంత ఇబ్బందిపడాల్సిన అవసరం రాకపోవచ్చు. ఎందుకంటే సైటిసిన్ (Cytisine) అనే ఒక మొక్క ఆధారిత ఔషధం ధూమపానం మాన్పించడంలో మానవులకు సహాయపడుతుందని కొత్త అధ్యయనం పేర్కొన్నది. అంతేకాదు ఇది సాధారణ ధూమపాన విరమణ అవకాశాలను కొద్దిరోజుల వాడకంతోనే రెండు రెట్లు పెంచుతుందని, నికోటిన్ రీప్లేస్‌మెంట్ థెరపీకంటే ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని రీసెర్చర్, డాక్టర్ ఒమర్ డి శాంటి పేర్కొన్నారు. అయితే ఈ మొక్కను ఇప్పటికే.. 1960 నుంచి తూర్పు ఐరోపాలో ఉపయోగిస్తున్నారు. ఇక్కడ తక్కువ ధరలో ధూమపాన అలవాటు మాన్పించగల మొక్కగా ప్రాచుర్యంలో ఉంది.
మొట్టమొదటిసారిగా 1964లో ఈ సైటిసిన్ మొక్కను ఔషధంగా బల్గేరియాలో వినియోగించారు. తర్వాత తూర్పు ఐరోపా, ఆసియాలోని ఇతర దేశాలకు విస్తరించిందని పరిశోధకులు అంటున్నారు. కాగా ఇటీవల రీసెర్చర్స్ 6000 మంది వలంటీర్లు ఈ ప్లాంట్ బేస్డ్ డ్రగ్ వాడటాన్ని అధ్యయనం చేసిప్పుడు ప్లేసిబోతో పోలిస్తే, స్మోకింగ్ మాన్పించడంలో చాలా సక్సెస్‌ఫుల్‌గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ప్రజెంట్ ఈ మొక్క ఆధారిత ఔషధం తక్కువ మధ్య- ఆదాయ దేశాలతో సహా ప్రపంచంలోని చాలా దేశాలలో అందుబాటులో లేదని ‘జర్నల్ అడిక్షన్’ పేర్కొన్నది. భవిష్యత్తులో ఇది స్మోకింగ్ మాన్పించే ఎఫెక్టివ్ మెడిసిన్ రూపంలో దీనిని అందుబాటులోకి తెచ్చేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి.