చనిపోయిన తర్వాత మీ సోషల్ మీడియా అకౌంట్ ఏమవుతుంది?
ఎలన్ మస్క్ ఇన్‌యాక్టివ్ ట్విట్టర్ ఎకౌంట్స్‌ను ప్రక్షాళన చేస్తామని ప్రకటించిన తర్వాత.. చనిపోయిన వ్యక్తుల ఖాతాలను ఎలా కొనసాగించాలన్న సందేహం ప్రపంచవ్యాప్తంగా తలెత్తింది
దిశ, ఫీచర్స్: ఎలన్ మస్క్ ఇన్‌యాక్టివ్ ట్విట్టర్ ఎకౌంట్స్‌ను ప్రక్షాళన చేస్తామని ప్రకటించిన తర్వాత.. చనిపోయిన వ్యక్తుల ఖాతాలను ఎలా కొనసాగించాలన్న సందేహం ప్రపంచవ్యాప్తంగా తలెత్తింది. చాలామంది యూజర్స్ మరణించిన తర్వాత వారి ట్వీట్‌లను సేవ్ చేయడానికి, ఫ్రెండ్స్‌తో, ఆత్మీయులతో అతని తరఫున కుటుంబ సభ్యులు జ్ఞాపకాలను పంచుకోవడానికి మెమోరియలైజేషన్ ఫీచర్ ఏర్పాటు చేయాలనే అభ్యర్థనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ‘మేం చాలా సంవత్సరాలుగా ఎటువంటి యాక్టివిటీస్ లేని ఎకౌంట్స్‌ను ప్రక్షాళన చేస్తున్నాం. కాబట్టి అనుచరుల సంఖ్య తగ్గడాన్ని కూడా మీరు గమనించవచ్చు’ అని ట్విట్టర్ ప్లాట్‌ఫారమ్ యజమాని ఎలన్ మస్క్ సోమవారం ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ పలువురిలో ఆగ్రహానికి కారణమైంది. ఈ నేపథ్యంలో హై ప్రొఫైల్ కంప్యూటర్ ప్రోగ్రామర్, మస్క్ అనుచరులలో ఒకడైన జాన్ కార్మాక్ కూడా ఇలా తొలగింపు సమస్యను అలెగ్జాండ్రియా లైబ్రరీ తగలబడినప్పుడు కోల్పోయిన నష్టాన్ని గుర్తుచేస్తూ జ్ఞాపకాలను పదిల పర్చుకోవడం అవసరమేనని పేర్కొన్నాడు. అన్నింటినీ సేవ్ చేయండని కోరాడు. దీంతో ట్విట్టర్ సానుకూలంగా స్పందించింది. ఒక శాశ్వత పరిష్కారం కనుగొనే వరకు ఎటువంటి ఖాతాలను తొలగించబోమని పబ్లిక్‌కు సపోర్ట్‌గా ట్వీట్ చేసింది. మరుసటి రోజు ఎలన్ మస్క్ కూడా ఇన్‌యాక్టివ్ ఖాతాలు ఆర్కైవ్ చేయబడతాయి(archived) అని స్పష్టం చేశారు.
ఫేస్‌బుక్, ఇన్‌స్టా ఏం చేస్తోంది?
మరణించిన యూజర్ల ఖాతాలను ఏం చేయాలనే సమస్య ఇప్పటికే మెటా ప్లాట్‌ఫారమ్‌లు Facebook, Instagram ద్వారా పరిష్కరించబడింది. యూజర్ మరణిస్తే అతని కుటుంబ సభ్యుడు లేదా బంధువు సదరు వ్యక్తి ఎకౌంట్‌ను తొలగించాలా? లేదా స్మారకార్థంగా కొనసాగించాలా? అనేది ఫేస్‌బుక్‌ను అభ్యర్థించవచ్చు. కొనసాగించాలని కోరిప్పుడు మరణించిన యూజర్‌కు సంబంధించిన సంస్మరణ లేదా మెమోరియల్ కార్డ్, డెత్ సర్టిఫికెట్ వంటి ఆధారాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ విజ్ఞప్తి చేసే వ్యక్తి కూడా మరణించిన వ్యక్తితో అనుబంధానికి సంబంధించిన రుజువు కూడా అందించాలి. స్మారక ఖాతాలు(memorialised accounts) అనేవి మరణించిన తర్వాత జ్ఞాపకాలను సేకరించడానికి, పంచుకోవడానికి, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఒక చక్కటి వేదికగా ఉంటుందని facebook చెబుతోంది. అయితే ఈ ఫీచర్స్ ప్రైవసీ సెట్టింగ్ ఆధారంగా మాత్రమే డిపెండ్ అయి ఉంటాయి.
టైమ్‌లైన్‌లో మెమరీస్ షేర్ చేసుకోవచ్చు
వ్యక్తి చనిపోయేకంటే ముందు షేర్ చేసిన ఫొటోలు, పోస్ట్‌లు, వివిధ అంశాలను అనుమతి పొందిన వ్యక్తి, చనిపోయిన వ్యక్తి టైమ్ లైన్‌లో షేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా మెటా ఇతర ప్రధాన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ కూడా ఒక ఖాతాను తొలగించడానికి లేదా ప్రియమైన వ్యక్తి మరణించిన తర్వాత స్మారకంగా ఉంచడానికి విధానాలను కలిగి ఉంది. మరణించిన వ్యక్తుల ఖాతాలను స్మారకార్థం ఉంచడానికి ఇన్‌స్టాగ్రామ్‌కు నివేదించవచ్చు. దీనికి సంస్మరణ(obituary) లేదా న్యూస్ ఆర్టికల్ వంటి డెత్ ప్రూఫ్ అవసరం. మీరు లింక్డ్ ఇన్‌లో కూడా మరణించిన వ్యక్తి స్మారకార్థంగా (memorialised) అతని ఖాతాను కొనసాగించవచ్చు. అయితే ఖాతా మెయింటెన్ చేయాలనుకున్న వ్యక్తి తన అనుబంధంతోపాటు, మరణ ధృవీకరణ డాక్యుమెంటేషన్ అందించాలి. ఖాతాను తీసివేయాలని కూడా కోరవచ్చు.
ట్విట్టర్ కూడా చనిపోయిన వ్యక్తి తరపున పని చేయడానికి అధికారం ఉన్న వ్యక్తులు, తాము అవసరమైనప్పుడు ఖాతాను తొలగించాలని అభ్యర్థించడానికి ట్విట్టర్ (twitter) అనుమతిస్తుంది. అయితే సదరు వ్యక్తి ధృవీకరించబడిన కుటుంబ సభ్యుడై ఉండాలి. మరణించిన వ్యక్తికి సంబంధించిన వాలిడ్ ఐడీ, డెత్ సర్టిఫికెట్ అందించాలి.
Also Read...