Jaipur: వెయ్యేళ్లనాటి కోట.. చెక్కుచెదరని బురుజులు
ప్రకృతిలోకి ప్రయాణం భలే మజాగా ఉంటుంది. అడవులు, కొండలు, కోనలు, నదులు, జలపాతాలు, హిమాలయాలు, సముద్రాలు అన్నీ చుట్టేశాను.
ప్రకృతిలోకి ప్రయాణం భలే మజాగా ఉంటుంది. అడవులు, కొండలు, కోనలు, నదులు, జలపాతాలు, హిమాలయాలు, సముద్రాలు అన్నీ చుట్టేశాను. మా పర్యాటక జీవనంలో ఎడారి ఒక్కటే మిగిలింది ఈ ప్రయాణాన్ని ఎడారి కేంద్రంగా రూపొందించుకున్నాం. అందుకే రాజస్థాన్ బయలుదేరాం. హైదరాబాద్ నుంచి ఐదుగురు మహిళలం ఐదు రోజుల టూర్ ప్లాన్ చేసుకొని రాజస్థాన్ వెళ్లాం. పాత జైపూర్ నగరమంతా గులాబీరంగు భవనాలతో కనువిందు చేసింది. దీన్ని పింక్ సిటీ అని అంటారు ఇది హెరిటేజ్ నగరం. జైపూర్ కోటగోడ 12 కి.మీ. పొడవుతో దేశంలోనే రెండో స్థానంలో ఉన్నది. = గిరిజా పైడిమర్రి, ట్రావెలర్
దేశంలోనే రెండో పెద్ద కోటగోడ
జైపూర్ రాజస్థాన్ రాష్ట్రానికి రాజధాని. పెద్ద నగరం. హెరిటేజ్ నగరం. రాజ్ పుత్ పాలకుడు రెండవ సవాయి జైసింగ్ అమెర్ ఆ నగరాన్ని స్థాపించాడు. అతడు 1699 నుంచి 1743 వరకు పరిపాలించాడు. అతని పేరు మీద ఆ నగరానికి జైపూర్ అనే పేరు వచ్చిందట. యునెస్కో 2019 లో ఆ నగరాన్ని వారసత్వ సంపదగా గుర్తించింది. ముందుగా మేము అమెర్ కోటకు బయలుదేరాము. దానిని అంబర్ కోట అని కూడా పిలుస్తారు. అల్లంత దూరంగా కోట, దాని చుట్టూ ప్రహరీగోడ కనిపించాయి. జైపూర్‌లో అమెర్ మహలుకు వెళ్లాము. ప్రవేశరుసుము ఒకరికి రూ.152లు. అమెర్ మహల్ రాజ్ పుత్, మొఘల్ వాస్తు నిర్మాణ శైలిలో ఉంది. దాని నిర్మాణం ఒకేసారి జరుగలేదట. నాలుగు స్థాయిలలో జరిగిందని గైడ్ చెప్పాడు. దివాన్ - ఏ - ఖాస్, షీష్ మహల్, సుఖ్ నివాస్ మొదలైన విభాగాలున్నాయి. గోడలపైన, పైకప్పులో బంగారం, నీలం, పచ్చల సహజ రంగులతో చేసిన చిత్రకళ ఆనాటి రాజుల వైభవానికి తార్కాణం. విండ్ మహల్ లోపలికి మరమ్మత్తుల కారణంగా తాత్కాలికంగా అనుమతి లేదు.
ఆ రోజుల్లోనే ఏసీ చల్లదనం
ఆ రోజుల్లోనే నీటి క్యాసెట్ మీదుగా వీచే గాలుల ద్వారా చల్లని వాతావరణం (ఎయిర్ కండీషనర్) ఏర్పడే విధంగా నిర్మించడం నాటి సాంకేతికతకు నిదర్శనం. రాజా మాన్ సింగ్ కు 12మంది భార్యలు. అందరికి విడి విడిగా గదులున్నాయి. పట్టపురాణి గది అద్దాలతో ప్రత్యేకంగా ఉన్నది. లోపలి నుంచి 2.5 కి.మీల సొరంగ మార్గం గుండా జైఘర్ కోటకు చేరుకోవచ్చు.
ఏనుగు సవారీ.. జలకలశం
జైపూర్ లో ఏనుగు సవారీ ప్రత్యేకం. ఒక్కరికి రూ.1800 చెల్లించి ఏనుగు సవారీని ఎంజాయ్ చేశాము. ప్రశాంతమైన వాతావరణంలో పచ్చని చెట్ల మధ్య ఏనుగు మీద కూర్చొని వెళుతుంటే ఆ గజగమనానికి అనుగుణంగా మనసు కూడా అడుగులు వేసింది. జల్ మహల్ చూసుకుంటూ సిటీప్యాలెస్‌కు పోయాము. జల్ మహల్ లోపలికి ప్రవేశాన్ని నిషేధించారు. బయటనుంచే చూసి తృప్తి పడ్డాం. 340 కిలోల వెండితో 5.2 అడుగుల ఎత్తుతో ఉన్న జలకలశం అక్కడ ప్రత్యేక ఆకర్షణ. మ్యూజియం కూడా ఉన్నది. తీజ్, దసరా, సంక్రాంతి లాంటి సంప్రదాయ పండుగల ఉత్సవాలు అక్కడ జరుగుతాయి.
953 కిటికీల హవా మహల్
జైపూర్ స్థాపనకుడైన మహారాజా సవాయి జైసింగ్ మనవడు సవాయ్ ప్రతాప్ సింగ్ 1799 లో నిర్మించిన హవామహల్ ఐదంతస్తుల భవనం. 953 కిటికీలు ఉన్నాయి. వాటిని జీరో ఖాస్ అంటారు. ఎత్తు 50 అడుగులు. దానిని the Palace of wind అని పిలుస్తారు. రాణి వాసపు స్త్రీలు బయటవారికి కనిపించ కుండా అక్కడ జరిగే విశేషాలు ఉత్సవాలు చూడడానికి వీలుగా హవా మహల్ నిర్మాణం జరిగింది. ఒక్కరికి ₹52 ప్రవేశరుసుము.
గోల్డెన్ సిటీ జైసల్మేర్
జైసల్మేర్ చారిత్రక పట్టణం. గోల్డెన్ సిటీ అని అంటారు. రావల్ జైసల్ అనే రాజు నిర్మించడం వల్ల జైసల్మేర్ అనే పేరు వచ్చింది. జైసల్మేర్ కోటలో 4000 మంది ప్రజలతో, ఇళ్ళు, దేవాలయాలు, దుకాణాలు, రెస్టారెంట్లతో పట్టణం లాగా ఉన్నది. ప్రదేశ రుసుము ఒక్కరికి ₹152 లు. కోట నిర్మాణం 1155 ADలో జరిగింది. Golden fort, సోనార్ ఖిల్లా అంటారు. 30 అడుగుల ఎత్తుతో 97 బురుజులతో కోట చుట్టూ ప్రహరీగోడ ఉన్నది. 93 బురుజులు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. 1500 అడుగుల పొడవు 750 అడుగుల వెడల్పుతో కోటలోపలి భాగం విశాలంగా ఉంది. ఎత్తు 250 అడుగులు. అఖై, గణేశ్, సూరజ్ పోల్, హావ అనే ప్రధాన ద్వారాలున్నాయి.
ఇస్లామిక్, రాజ్ పుత్ వాస్తుశైలి
ప్రధాన వ్యాపారాలకు అనువుగా సిల్కు రోడ్డు కూడలిలో ఉండడం వల్ల కాబోలు లోపలికి వెళ్లగానే నాకు ఉజ్బెకిస్తాన్ నగరంలోని బుఖరా నగరం గుర్తుకొచ్చింది. నిర్మాణం ఇస్లామిక్ ,రాజ్ పుత్ వాస్తు శైలి సమ్మేళనం. రాజు, రాణి మందిరాలు విడి విడిగా ఉన్నాయి. కోట పైన ఒక ఫిరంగి ఉంది. పైకి వెళ్ళడం కొంచం కష్టంతో కూడుకున్న పనే...
పసిడి కాంతితో మెరిసే జైసల్మేర్
కోట పైనుంచి జైసల్మేర్ నగరం బంగారపు కాంతితో అందంగా కనిపిస్తుంది. ప్రస్తుతం రాజ వంశీయులు కోట వెలుపల నివసిస్తున్నారు. కోట పై నుంచి వారి నివాస భవనాన్ని స్పష్టంగా చూడవచ్చు. కోటలోపల ఏడు జైన దేవాలయాలు, లక్ష్మీనాథ్ మందిరం ఉన్నాయి. వాటి శిల్పకళ చెప్పడానికి భాష చాలదు. ఇరుకైన వీధులలో కళాఖండాలతో, సంప్రదాయ దుస్తులతో రాజస్థాన్ సంస్కృతి కనిపిస్తుంది. కోటలో పత్వానీ హవేలీ ఏడు అంతస్తుల భవనం ప్రధాన వ్యాపార కేంద్రం. మ్యూజియం కూడా ఉన్నది. ప్రవేశరుసుము ఒక్కరికి ₹52. ఆ భవనాన్ని కళాత్మకంగా తీర్చి దిద్దిన పనిముట్లు అక్కడ ఉన్నాయి.
క్షత్రియ సమాధులు
సాయంత్రం చారిత్రాత్మకమైన గడీసాగర్‌లో పడవ షికారు ఒక మధురానుభూతి. రుసుము ఒక్కరికి ₹150. బడాబాగ్ చిన్న కొండ మీదున్న స్మారక ఛత్రీ సమాధుల కూడలి. బంగారపు రంగు ఇసుక రాయితో దేనికదే ప్రత్యేకంగా ఉన్నది. రాజు, రాణి, కుమారులు, ఇతర కుటుంబ సభ్యుల కొరకు నాలుగు వేర్వేరు పరిమాణంలో నిర్మించారు. ప్రతి సమాధిలో ఆయా వ్యక్తుల వివరాలున్నాయి.
పెద్ద పెద్ద తుమ్మ చెట్లు
థార్ ఎడారి 85% భారతదేశంలో 15% పాకిస్తాన్ లో ఉన్నది. అందులో 60% రాజస్థాన్లో, మిగిలింది గుజరాత్ , పంజాబ్ లో ఉన్నది. విస్తీర్ణం 77000 చదరపు మైళ్ళు. దానిని Great Indian Desert అని అంటారు. ఎడారిలో ఇసుక తిన్నెలతోపాటు ఎడారి మొక్కలు ముఖ్యంగా తుమ్మ చెట్లు చాలా కనిపించాయి. బలంగా వీచే గాలుల కారణంగా ఇసుక దిబ్బల నుండి ఇసుక వచ్చే ఇసుక వల్ల కంచెలు, పంట పొలాలు, రైలు మార్గాలు నిండి పోయాయి. దానిని అరికట్టడానికి ఎడారి లో పెరిగే చెట్లను విదేశాలనుంచి తీసుకు వచ్చి నాటారని స్థానికులు చెప్పారు. ముఖ్యంగా పెద్దపెద్ద తుమ్మ చెట్లు అధిక సంఖ్యలో కనిపించాయి. వాటి వల్ల వర్షాలు పడి, పూర్వం ఉన్న నీటి కరువు ప్రస్తుతం అంతగా లేదని చెప్పారు.
ఎడారి గ్రామంలో శాకాహారం
సామ్ (sam) అనే ఎడారి గ్రామంలో మధ్యాహ్న భోజనం చేశాము. జనాభా 3000. నాలుగు కాయగూరలతో ప్రత్యేకమైన స్వీటుతో రుచికరమైన శాఖాహార భోజనం. ఇంటి పెద్దపేరు తీబాదేవి. నలుగురు కొడుకులు. అక్కడే వేర్వేరు ఇళ్లు. ఆ గ్రామంలో ఒక ఉన్నత పాఠశాల, కళాశాల ఉన్నాయట. పాఠశాల చుట్టుపక్కల గ్రామాల పిల్లలు అక్కడ చదువుకుంటారు. తరగతిలో సుమారు 35 మంది విద్యార్థులుంటారు. రాజస్థానీ, ఇంగ్లీషు మీడియం లలో బోధన ఉన్నదట. పిల్లలు చాలా చురుకుగా ఉన్నారు. వ్యవసాయం, పశుపెంపకం ప్రధాన వృత్తులు. పుచ్చకాయ, చిక్కుడు, దోస లాంటివి పండుతాయి. వాళ్ళ ఇంటిదేవత కేట్పాల్ దాడు. ఏడాది లోపు పిల్లలను బడాబాగ్ లో ఉన్న కేట్పాల్ దేవాలయానికి తీసుక వెళ్లి ఆ దేవి బొమ్మ ఉన్న లాకెటును మెడలో వేస్తారట. దానితో ఆ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని నమ్ముతారు.
ఎడారిలో ఒంటె ప్రయాణం
ఎడారిలో సూర్యాస్తమయ, సూర్యోదయాలను చూడడం మరపురాని అనుభూతులు. ఎడారిలో ఒంటె సవారీ తప్పకుండా చేయాలి. ఒక్క ఒంటె మీద ఒక్కరు కూర్చోవాలి. అది పైకి లేచి నిలబడేటప్పుడు ఇచ్చే జర్క్‌కు ఒళ్లు జలదరిస్తుంది. ఒంటెపై వెళుతున్నప్పుడు నిశ్శబ్దమైన ఎడారిలో వీచే గాలి సవ్వడి గంధర్వ గాన కచేరీ లాగా అనిపించింది. ఆ ప్రకృతి సంగీతంలో మైమరచి పోయాను. పున్నమి రాత్రి ఎడారిలో నడవాలని గాఢమైన కోరిక. రాత్రి డిన్నర్ ముగించి మాలో ముగ్గురం జీప్‌లో ఎడారి మధ్యలోకి మళ్ళీపోయాము. అక్కడి నుంచి మేము నడక మొదలు పెట్టాము. ఆ వెన్నెల కాంతికి ఇసుక తళతళలాడింది. భయంకరమైన చలి. ఆ రాత్రి చందమామ పాటలు పాడుకుంటూ ఎంత సేపు గడిపామో జీపు డ్రైవరు వచ్చేదాకా మాకు సమయమే తెలియలేదు. ఇలాంటి అనుభూతులు మాటల్లో చెప్పలేను. సినిమాల్లో చూసే ఎడారి అందాలను నిశీధిలో చూడటం మహదానుభవం అనే చెప్పాలి.
పిల్లలే ఒంటెల చోదకులు
రాత్రిపూట ఒంటెల కళ్లు విద్యుత్ బల్బుల లాగా మెరవడం భలే తమాషాగా ఉంది. అయితే ఆ ఆనంద లోకం లోనుంచి వాస్తవ ప్రపంచంలోకి వచ్చినప్పుడు మనసు బాధగా మూలిగింది. కారణం- వాటిని ఎడారిలోకి పిల్లలు తీసుకెళ్లడం విచారకరం. జీవనోపాధికి పిల్లలు కష్టపడడం మరింత బాధాకరం. సూర్యోదయం వేళ ఎడారిలో ఒక చోట బీర్బల్ జానపద సంగీత వాయిద్యం రౌండ్ థాను వాయిస్తూ కనిపించాడు. నేనూ సరదాగా దానిని వాయించాను. ఎడారి హిల్టన్ టెంట్ రిసార్టు వాళ్లచ్చిన ఆతిథ్యం మరువలేనిది.
టవర్ ఎక్కి చూస్తే పాకిస్తాన్
మిల్ట్రీ యాజమాన్యంలో ఉన్న తనోతీ మాత దేవాలయాన్ని, లాంగీవాలా ఇండోపాక్ బార్డర్ ను 200 మీటర్ల లోపల వరకూ వెళ్లి చూశాము. దానికొరకు ప్రత్యేక అనుమతి తీసుకున్నాము. గేటు బయట ఉన్న వాచ్ టవర్ ఎక్కి చూసినప్పుడు పాకిస్తాన్ లోని ఎత్తైన భవనాలు కనిపించాయి. 1971 నాటి లాంగీవాలా భారత్ పాకిస్తాన్ కు సంబంధించిన డాక్యుమెంటరీ సినిమాను చూసాము. ఒక్కరికి రూ.50. లాంగీవాలా వార్ మెమోరియల్ మ్యూజియంను చూసుకొని హైదరాబాదు చేరుకున్నాము.