Crows : ఆ విషయంలో కాకులే గ్రేట్.. ! ఎందుకంటే..

Crows : ఆ విషయంలో కాకులే గ్రేట్.. ! ఎందుకంటే..

Update: 2025-04-20 11:23 GMT
Crows : ఆ విషయంలో కాకులే గ్రేట్.. ! ఎందుకంటే..
  • whatsapp icon

దిశ, ఫీచర్స్ : ‘‘కాకులవలె నెల్లప్పుడు కలిసి బతుకుట లాభము.. కాట్ల కుక్కవలెనెప్పుడు కలహించుట నష్టము’’ అన్నారో కవి. జీవ వైవిధ్యంలో వాటికో ప్రత్యేకత ఉంది. కొన్ని సందర్భాల్లో సానుకూలంగానూ, మరికొన్ని సందర్భాల్లో ప్రతికూలంగానూ వ్యక్తం అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడూ సానుభూతికి కారణమైతే.. ఎప్పుడో ఒకసారి వ్యతిరేకతకు కూడా దారితీస్తుంది. ‘కోకిలమ్మ చేసుకున్న పుణ్యమేమి, కాకి చేసుకున్న కర్మమేమి’ అని కూడా అన్నారో కవి మహాశయుడు. ఎందుకంటే రెండూ నల్లగానే ఉన్నా అందరూ కోకిలను ఇష్టపడుతుంటారు. ఇక్కడ కాకికి ప్రతికూలత, కొద్దిపాటి సానుభూతి వ్యక్తం అవుతుండగా.. మొదట్లో పేర్కొన్న వాక్యాల్లో మాత్రం ప్రశంసనీయత దక్కింది. కాగా తాజా అధ్యయనం మరో కొత్త విషయాన్ని వెల్లడించింది. ఏంటంటే.. మనుషులతో పోలిస్తే కాకిలో తెలివి, పగ, దీర్ఘకాలి జ్ఞాపక శక్తి ఎక్కువట.

కాకులు, మానవులు, ప్రకృతి మధ్య మధ్య సంబంధాలపై వాషింగ్టన్ యూనివర్సిటీ నిపుణులు కొంత కాలంగా పరిశోధనలు నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా ఒక ఆసక్తి కరమైన విషయాన్ని వెల్లడించారు. మనుషులతో పోలిస్తే కాకులు అసాధారణమైన జ్ఞాపక శక్తిని కలిగి ఉంటాయని పేర్కొన్నారు. ముఖ్యంగా అది సానుకూలమైనా, ప్రతికూలమైనా ఒక విషయాన్ని లేదా దృశ్యాన్ని, ఒక అనుభవాన్ని ఎదుర్కొన్న కాకులు 17 ఏండ్ల పాటు ఏమాత్రం మర్చిపోకుండా వాటిని గుర్తుంచుకుంటాయని పరిశోధకులు తేల్చారు.

అధ్యయనంలో భాగంగా పరిశోధకులు ముఖాలకు ముసుగులు ధరించి ఒకసారి, ధరించకుండా ఒకసారి కాకకులను పట్టుకొని కాస్త ఇబ్బందికి గురిచేసి వదిలేశారు. కాగా ఈ సందర్భంగా ముసుగులు ధరించని వ్యక్తుల ముఖాలను గుర్తు పెట్టుకున్న కాకులు వారు కనిపించిన ప్రతిసారీ వెంటాడుతూ.. దూకుడు ప్రవర్తనను అవలంభించాయి. మిగతా కాకులకు సిగ్నల్స్ ఇస్తూ అన్నీ కలిసి దాడికి ప్రయత్నించాయి. విషయం ఏంటంటే కాకుల్లో గొప్ప ఐక్యత కూడా ఉంటుంది. అవి ఒంటరిగా ఎదుర్కొన్న బాధాకరమైన సమచారాన్ని ఇతర కాకులకు తమ అరుపులు, సంకేతాల ద్వారా తెలియజేస్తాయి. అది పసిగట్టిన ఇతర కాకులు వాటికి సహాయంగా వచ్చేస్తాయి. ఈ అధ్యయనంలో మనుషులతో పోలిస్తే కాకుల్లో దీర్ఘకాలిక జ్ఞాపక శక్తిని, మెదడు సామర్థ్యాన్ని, ఐక్యతను, గౌరవ ప్రదమైన పరస్పర చర్యలను హైలెట్ చేస్తుందని పరిశోధకులు పేర్కొంటున్నారు.

Tags:    

Similar News