కేటీఆర్ ఔట్.. సిద్ధిపేట బాధ్యతలు హరీష్‌రావుకు

దిశ, తెలంగాణ బ్యూరో: సిద్ధిపేటకు మంత్రి కేటీఆర్ దూరంగా ఉంటున్నారు. ఈ నెల 30న మున్సిపాలిటీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికతో పాటు ప్రచార బాధ్యతను మంత్రి హరీష్‌రావుకు అప్పగించారు. అందులో మాత్రం కేటీఆర్ ఎలాంటి జోక్యం చేసుకోకుండా దూరంగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో కార్పొరేషన్, మున్సిపాలిటీల ఎన్నికలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే మంత్రి కేటీఆర్ విస్తృతంగా పర్యటించారు. కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కానీ, సిద్దిపేట నియోజకవర్గానికి […]

Update: 2021-04-18 07:58 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: సిద్ధిపేటకు మంత్రి కేటీఆర్ దూరంగా ఉంటున్నారు. ఈ నెల 30న మున్సిపాలిటీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికతో పాటు ప్రచార బాధ్యతను మంత్రి హరీష్‌రావుకు అప్పగించారు. అందులో మాత్రం కేటీఆర్ ఎలాంటి జోక్యం చేసుకోకుండా దూరంగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో కార్పొరేషన్, మున్సిపాలిటీల ఎన్నికలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే మంత్రి కేటీఆర్ విస్తృతంగా పర్యటించారు. కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కానీ, సిద్దిపేట నియోజకవర్గానికి మాత్రం వెళ్లలేదు. అదే విధంగా నకిరేకల్ మున్సిపల్ ఎన్నికల బాధ్యతను మంత్రి జగదీష్ రెడ్డికి అప్పగించగా.. అభ్యర్థుల ఎంపికతో పాటు ప్రచార బాధ్యతను ఆయనే నిర్వహించనున్నారు.

కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ త్వరలోనే వెలువడనుందని భావించిన టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహక కార్యదర్శి, మంత్రి కేటీఆర్.. ఈ ఏడాది జనవరి నుంచి రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించారు. టీఆర్ఎస్ శ్రేణులను, ప్రజా ప్రతినిధులను సన్నద్ధం చేశారు. అభ్యర్థుల వివరాలతో పాటు సిట్టింగ్, ప్రజల్లో గుర్తింపు ఉండి బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపుతున్న వారి బయోడేటాను సేకరించారు. కోట్ల రూపాయలతో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. తమదైన శైలిలో పర్యటించి ప్రజలకు హామీలు ఇవ్వడంతో పాటు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈనెల 16న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా.. 30న ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలు జరిగే వరంగల్ గ్రేటర్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగనున్నాయి. అయితే మంత్రి కేటీఆర్ సిద్ధిపేట, నకిరేకల్ మినహా అన్నింటిలోనూ పర్యటించి టీఆర్ఎస్ శ్రేణులను ఎన్నికలకు సంసిద్ధం చేశారు.

సిద్ధిపేట హరీష్ రావుకు…

సిద్ధిపేట నియోజకవర్గం మంత్రి హరీష్ రావు సొంత నియోజకవర్గం. ఆ నియోజకవర్గ బాధ్యతలను మొత్తం టీఆర్ఎస్ అధిష్టానం ఆయనకే అప్పగించింది. సిద్ధిపేట మున్సిపాలిటీకి ఈనెల 30 ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికతో పాటు ప్రచార బాధ్యతను కూడా ఆయనకే అప్పగించింది. ఇదిలా ఉంటే మంత్రి కేటీఆర్ సిద్ధిపేటలో మంత్రి హరీష్‌తో కలిసి 2020 డిసెంబర్ 10న పర్యటించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, రైతు వేదికలు, రంగనాయకసాగర్‌పై గెస్ట్‌హౌజ్,ఐటీ హబ్ టవర్‌కు శంకుస్థాపన, కోమటిచెరువు సందర్శనతో పాటు సభలో పాల్గొన్నారు. అప్పటి నుంచి కేటీఆర్ సిద్ధిపేటకు వెళ్లలేదు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది… దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. ఇక ప్రచారం కూడా ప్రారంభం కానుంది. కేటీఆర్ రోడ్ షో కూడా చేపట్టనున్నారు.. కానీ సిద్ధిపేటలో మాత్రం లేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉంటే నకిరేకల్ మున్సిపాలిటీ బాధ్యతను నల్లగొండ ఉమ్మడి జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డికి అప్పగించారు. కేటీఆర్ నకిరేకల్ లో చివరిసారిగా 2020 జనవరి 22న పర్యటించారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నకిరేకల్ లో కేటీఆర్ రోడ్‌షో నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

నోటిఫికేషన్ రాకముందే …

నోటిఫికేషన్ రాకముందే మంత్రి కేటీఆర్ పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ నెల 2న ఖమ్మంలో పర్యటించారు. మంత్రి పువ్వాడ అజయ్ తో కలిసి రూ.25 కోట్లలో బస్టాండ్, రూ.36 కోట్లతో ఐటీ హబ్, రూ.30 కోట్లతో 11, 48 డివిజన్లలో సీసీ, బీటీ పనులకు శంకుస్థాపనలు చేశారు. ఫిబ్రవరి 29వ తేదీన పర్యటించి పనులు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వరంగల్‌లో ఈనెల 11న పర్యటించి రూ.1700 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. అదే విధంగా దీపకుంటలో రూ.31.81 కోట్లతో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లు ప్రారంభం, దేశాయిపేటలో రూ.10.60కోట్లతో జర్నలిస్టులకు నిర్మించనున్న డబుల్ బెడ్రూం ఇళ్లకు శంకుస్థాపన చేశారు. ఈనెల 14న రంగారెడ్డి జిల్లా కొత్తూరు, మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల, నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీల్లో పర్యటించారు. కొత్తూరులో వైజంక్షన్, బటర్ ఫ్లై వీధిలైట్లు ప్రారంభించారు. జడ్చర్లలో మినీ ట్యాంక్ బండ్, మిషన్ భగీరథవాటర్ ట్యాంకు, కావేరమ్మపేటలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారు. అచ్చంపేటలో రూ.కోట్లతో అంబేద్కర్ విజ్ఞానకేంద్రం, రూ.8కోట్లతో సమీకృత మార్కెట్ యార్డు, రూ.75లక్షలతో మార్కెట్ యార్డు ప్రహారీ, రూ.2కోట్లతో స్మృతివనం, రూ.10కోట్లతో పురపాలక అభివృద్ధి పనులను కేటీఆర్ ప్రారంభించారు.

కార్పొరేషన్, మున్సిపాలిటీల ఇన్‌చార్జులు

రాష్ట్రంలో ఎన్నికలు జరిగే రెండు కార్పొరేషన్లు, 4 మున్సిపాలిటీలకు టీఆర్ఎస్ ఇన్‌చార్జులను నియమించింది. ఖమ్మం కార్పొరేషన్‌కు ఇన్‌చార్జిగా మంత్రి పువ్వాడ అజయ్, వరంగల్‌లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు, కొత్తూరులో వి. శ్రీనివాస్ గౌడ్, అచ్చంపేటలో నిరంజన్‌ రెడ్డి, నకిరేకల్ లో మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, జడ్చర్లలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డిలు ఎన్నికయ్యారు. ఇన్‌చార్జులు అభ్యర్థుల ఎంపిక, నేతల మధ్య సమన్వయం, ఎన్నికల ప్రచార బాధ్యతలను నిర్వహిస్తారు. అభ్యర్థుల గెలిపించుకునే బాధ్యత కూడా అధిష్టానం వీరికి అప్పగించింది.

Tags:    

Similar News