జల జగడం.. చేతులెత్తేసిన కృష్ణా బోర్డు
దిశ, తెలంగాణ బ్యూరో : జల వివాదాలు సాగుతున్న సమయంలో కృష్ణా బోర్డు చేతులెత్తేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారంలో కృష్ణా బోర్డు పూర్తిగా విఫలమవుతోంది. జూన్ నుంచి ఆరంభమైన కొత్త నీటి సంవత్సరంలో ఇంకా నీటి కేటాయింపులే చేయడం లేదు. ఓ వైపు నీటి వాటాపై రెండు రాష్ట్రాలు స్వరం పెంచాయి. సీఎం కేసీఆర్ ఏకంగా 50 శాతం కోటాపై పట్టుపడుతున్నారు. కానీ, నీటి వినియోగంపై బోర్డు మాత్రం మౌనంగానే ఉంటోంది. ఒక […]
దిశ, తెలంగాణ బ్యూరో : జల వివాదాలు సాగుతున్న సమయంలో కృష్ణా బోర్డు చేతులెత్తేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారంలో కృష్ణా బోర్డు పూర్తిగా విఫలమవుతోంది. జూన్ నుంచి ఆరంభమైన కొత్త నీటి సంవత్సరంలో ఇంకా నీటి కేటాయింపులే చేయడం లేదు. ఓ వైపు నీటి వాటాపై రెండు రాష్ట్రాలు స్వరం పెంచాయి. సీఎం కేసీఆర్ ఏకంగా 50 శాతం కోటాపై పట్టుపడుతున్నారు. కానీ, నీటి వినియోగంపై బోర్డు మాత్రం మౌనంగానే ఉంటోంది. ఒక రాష్ట్రం రాసిన లేఖలను మరొక రాష్ట్రానికి పంపడం, రెండు రాష్ట్రాలు స్పందించకుంటే కేంద్రానికి లేఖలు రాయడం తప్ప, పరిష్కారాలు చూపకపోవడంతో జల జగడాలు తీవ్రమవుతూనే ఉన్నాయి. ఈ నెల 9న త్రిసభ్య కమిటీ భేటీ ఉంటుందని ప్రకటించినా.. రెండు రాష్ట్రాలు రామని చెప్పడంతో వాయిదా వేశారు.
అన్నీ పెండింగ్‌లోనే..!
హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వాడుకుంటున్న నీటిలో 20 శాతాన్నే వినియోగ కోటా కింద పరిగణించాలని తెలంగాణ 2016లో కృష్ణా బోర్డును కోరింది. కృష్ణా బేసిన్ నుంచి హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్న నీటిలో దాదాపు 80 శాతం వివిధ రూపాల్లో మూసీ ద్వారా కృష్ణాలో కలుస్తోందని పేర్కొంది. అయితే, దీన్ని ఏపీ ప్రభుత్వం వ్యతిరేకించింది. దీనిపై నివేదిక ఇవ్వాలని సీడబ్ల్యూసీని కృష్ణా బోర్డు కోరింది. అయితే, దీనిపై ఎలాంటి నిర్ణయం రాలేదు.
ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో క్యారీ ఓవర్ జలాలను ఎప్పుడైనా వినియోగించుకునే స్వేచ్ఛ తమకు ఉందని తెలంగాణ పట్టుపడుతోంది. 2019–20 నీటి సంవత్సరంలో కేటాయించిన నీటిలో 50.851 టీఎంసీలను వాడుకోలేకపోయామని, వాటిని 2020–21లో వినియోగించుకుంటామని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది. దీన్ని ఏపీ ప్రభుత్వం వ్యతిరేకించింది. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–1 తీర్పులో క్లాజ్–8 ప్రకారం.. ఏ నీటి సంవత్సరం లెక్కలు ఆ ఏడాదితోనే పూర్తవుతాయని, వాడుకోకుండా మిగిలిపోయిన జలాలపై రెండు రాష్ట్రాలకు హక్కు ఉంటుందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. దీనిపై కేంద్రం ఇదే వైఖరిని స్పష్టం చేసినా తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై కూడా బోర్డు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు.
నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద ప్రవాహ నష్టాలు 40 శాతం మేర ఉన్నాయని, ప్రవాహ నష్టాలను దృష్టిలో పెట్టుకొని కేటాయింపులు చేయాలని తెలంగాణ కోరింది. అయితే, ఈ ప్రవాహ నష్టాలు 27 శాతానికి మించవని ఏపీ వాదిస్తోంది. ప్రవాహ నష్టాలను తేల్చేందుకు జాయింట్ కమిటీని ఏర్పాటు చేస్తామని, ఆరు నెలల్లో ఈ సమస్యను పరిష్కరిస్తామని బోర్డు చెప్పి రెండేళ్లవుతున్నా ఇంకా తేల్చలేదు. కృష్ణా బేసిన్‌లో చిన్న నీటి వనరుల కింద తెలంగాణకు 90 టీఎంసీల మేర కేటాయింపులున్నా, కేవలం 30 నుంచి 40 టీఎంసీల మేర మాత్రమే వినియోగం ఉంటోందని చెబుతోంది.
అయితే, ఏపీ మాత్రం మిషన్ కాకతీయ కార్యక్రమం అనంతరం తెలంగాణ పూర్తి స్థాయిలో నీటి వినియోగం చేస్తోందని, ఆ నీటి పరిమాణాన్ని సైతం తెలంగాణ నీటి వినియోగం కోటాలో కలపాలని అంటోంది. దీనిపై బోర్డు గతంలోనే జాయింట్ కమిటీని నియమించినా నాలుగేళ్లుగా ఈ లెక్కలు తేలలేదు. బేసిన్‌లోని ప్రాజెక్టులన్నీ నిండి.. నీరు సముద్రంలో కలుస్తున్నప్పుడు వరద జలాలను ఎవరు వాడుకున్నా వాటిని కోటా కింద పరిగణించకూడదని ఏపీ కోరుతోంది.
2019–20లో కృష్ణా నదికి భారీ వరద వచ్చి నీరంతా సముద్రంలో కలుస్తున్న సమయంలో ఏపీ 44 టీఎంసీలను మళ్లించింది. ఈ నీటిని రాష్ట్రాల కోటా కింద లెక్కించకూడదని బోర్డును ఏపీ ప్రభుత్వం కోరింది. దీన్ని తెలంగాణ వ్యతిరేకించింది. దీనిపై ఇంతవరకు ఎటూ తేలలేదు. నాగార్జునసాగర్ కుడి కాలువ కింద అనవసరంగా విడుదల చేసిన 13.47 టీఎంసీలను తమ వాటా వినియోగంలో చూపరాదని ఆంధ్రప్రదేశ్ అంటోంది. ఈ విషయం ఏపీ గతంలో కూడా ప్రస్తావించినా, ఈ వివాదంపై ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు.
ఈ ఏడాది కేటాయింపులు ఉండవా..?
ప్రతీ ఏటా వాటర్ ఇయర్‌లో రెండు రాష్ట్రాల వాటాపై కృష్ణా బోర్డు సమావేశం నిర్వహించి వాటాలను ఖరారు చేస్తోంది. కానీ, ఈ ఏడాది జూన్నుంచి కొత్త వాటర్ఇయర్ మొదలైంది. అయితే, ఇంత వరకూ కేటాయింపులు మాత్రం చేయడం లేదు.