కిషన్‌రెడ్డి జీ బద్లా!

జి.కిషన్‌రెడ్డి ఈ పేరు తెలుగువారికి సుపరిచితం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీనేతగా, ఆ పార్టీ అధ్యక్షుడిగా పని చేసిన ఆయనది విభిన్నశైలి. ప్రత్యర్థులు సైతం ఆయన నీతిమంతుడనేంత మంచిపేరు సంపాదించుకున్నారు. అంబర్‌పేట ఆయన సొంత నియోజకవర్గమని తెలుగువారందరికీ తెలుసు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే అంబర్‌పేటకు వచ్చి ఆయన చెప్పిన మాటలు ఓసారి గుర్తు చేసుకుంటే.. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకేననీ, తాను కేంద్ర మంత్రినైనా తనను తీర్చిదిద్దింది అంబర్‌పేట ప్రజలేనని, వారికి […]

Update: 2020-02-19 01:30 GMT

జి.కిషన్‌రెడ్డి ఈ పేరు తెలుగువారికి సుపరిచితం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీనేతగా, ఆ పార్టీ అధ్యక్షుడిగా పని చేసిన ఆయనది విభిన్నశైలి. ప్రత్యర్థులు సైతం ఆయన నీతిమంతుడనేంత మంచిపేరు సంపాదించుకున్నారు. అంబర్‌పేట ఆయన సొంత నియోజకవర్గమని తెలుగువారందరికీ తెలుసు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే అంబర్‌పేటకు వచ్చి ఆయన చెప్పిన మాటలు ఓసారి గుర్తు చేసుకుంటే.. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకేననీ, తాను కేంద్ర మంత్రినైనా తనను తీర్చిదిద్దింది అంబర్‌పేట ప్రజలేనని, వారికి ఎప్పుడూ అందుబాటులో ఉంటానని కిషన్‌రెడ్డి చెప్పారు. కనుచూపు మేరల్లో బీజేపీకి అధికారంలేని రోజుల నుంచి కార్యకర్తగా ఎమ్మెల్యేగా పార్టీని నడుపుకున్న ఆయన్ను కృషీవలుడనీ, బీజేపీలో ఉన్నా వివాదరహితుడని, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న మంచినేత అని ప్రత్యర్థులు సైతం మెచ్చుకుంటారు. అయితే, ఇదంతా ఒకప్పడనీ, ఇప్పుడు ఆయన వైఖరిలో పూర్తి మార్పొచ్చిందని, మతతత్వ ఎజెండాలోకి ఆయన వెళ్లారనీ, వివాదాలను కొని తెచ్చుకుంటున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కేంద్ర మంత్రి అయినప్పటి నుంచే..

2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్‌పేట నుంచి పోటీచేసి ఓడిపోయిన కిషన్‌రెడ్డి.. పడిలేచిన కెరటంలా.. సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. మోడీ మంత్రివర్గంలోకి ఆయన్ను కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యమున్న ఏకైక కేంద్రమంత్రిగా ఆయన వెళ్లడంపట్ల తెలుగు ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఆయన సహకరిస్తారనీ, కృషి చేస్తారని ఆశపడ్డారు. కానీ, కిషన్‌రెడ్డి మాటలు, తీరును బట్టి చూస్తే ఆయన వివాదాల్లోకి వెళ్లేందుకు యత్నిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

నిన్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ చర్లపల్లి టర్మినల్ అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యలను నెటిజన్లు ట్రోల్ చేస్తూనే ఉన్నారు. తెలంగాణ ప్రజలకు ఎర్రబస్సే తెలిసేదనీ, రైల్వే సౌకర్యం ఉండేది కాదని, అటువంటి పరిస్థితుల్లో మోడీ ప్రభుత్వం కొత్త రైల్లే లైనులను ప్రారంభించి సౌకర్యాలు కల్పించిందని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో రైల్వే చరిత్రపై పోస్ట్‌లు చేశారు. ఆయన ఎమ్మెల్యేగా పని చేసిన అంబర్‌పేటలో సుదీర్ఘ చరిత్ర కలిగిన కాచిగూడ రైల్వే స్టేషన్ ఉందనీ, ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో నాంపల్లి, సికింద్రాబాద్ ప్రఖ్యాత రైల్వే స్టేషన్లున్నాయని ట్వీట్లు చేస్తున్నారు. కిషన్ రెడ్డి పుట్టకముందే తెలంగాణలో రైళ్లున్నాయంటూ.. నెటిజన్లు ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నారు.

కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికంటే ముందు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో ఉగ్రమూలాలున్నాయని కిషన్‌రెడ్డి కామెంట్ చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలపట్ల అప్పట్లో దుమారం రేగింది. ఆ తర్వాత కాలంలోనూ ఆయన వివాదాలకే మొగ్గు చూపుతున్నారని చెబుతున్నారు. ఇటీవల జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో కారిడార్-2 ప్రారంభానికి రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫోన్ చేసి ఆహ్వానించారు. అయినా ఒక్కరోజు ముందు పిలిస్తే ఎలా? అంటూ హాజరు కాలేదు. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, నాయకులతో కలిసి మెట్రో కారిడార్‌లో కిషన్‌రెడ్డి ప్రయాణించారు. సమీక్షాసమావేశంలో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. నిధులు కేంద్రానివి ఆర్భాటం రాష్ట్రప్రభుత్వానిదా అంటూ ప్రశ్నిస్తూనే.. పాతబస్తీకి మెట్రో రాకుండా టీఆర్ఎస్, మజ్లిస్‌లు అడ్డకుంటున్నాయని ఆరోపించారు. నిజామాబాద్‌లోని భైంసాలో అల్లర్లు జరిగితే అక్కడ పర్యటించిన కిషన్‌రెడ్డి బాధితులను ఆదుకునే చర్యలు తీసుకుంటారని అనుకున్నారు. కానీ, ఆయన మాత్రం అల్లర్ల వెనుక మజ్లిస్ ఉందనీ, ఆ పార్టీకి టీఆర్ఎస్ అండగా ఉందని ఆరోపించారు. ఈ లెక్కన అప్పటి కిషన్‌రెడ్డి ఇప్పుడు లేడనీ ఆయన మారిపోయారని ‘‘కిషన్‌రెడ్డి బదల్ గయా’’ అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

బిగ్ డీల్స్ లేనట్టేనా?

Full View

Tags:    

Similar News