కమలానికి 'ఖుష్బు'
దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ నటి ఖుష్బు సుందర్ కమలం పార్టీ కండువా కప్పుకుంది. ఢిల్లీలో ఆమె బీజేపీ పార్టీలోకి చేరింది. ఆరేళ్లపాటు కాంగ్రెస్‌లో కొనసాగిన ఆమె పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సోమవారం రాజీనామా లేఖ రాశారు. కాంగ్రెస్ కోసం పనిచేసిన తనలాంటి వాళ్లను పార్టీలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారు అణచివేస్తున్నారని, ప్రజలకు దూరంగా ఉండి, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నదో తెలియని వారు నియంతృత్వ పోకడలు పోతున్నారని ఆరోపిస్తూ తన రాజీనామా లేఖలో వాపోయారు. […]
దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ నటి ఖుష్బు సుందర్ కమలం పార్టీ కండువా కప్పుకుంది. ఢిల్లీలో ఆమె బీజేపీ పార్టీలోకి చేరింది. ఆరేళ్లపాటు కాంగ్రెస్‌లో కొనసాగిన ఆమె పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సోమవారం రాజీనామా లేఖ రాశారు. కాంగ్రెస్ కోసం పనిచేసిన తనలాంటి వాళ్లను పార్టీలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారు అణచివేస్తున్నారని, ప్రజలకు దూరంగా ఉండి, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నదో తెలియని వారు నియంతృత్వ పోకడలు పోతున్నారని ఆరోపిస్తూ తన రాజీనామా లేఖలో వాపోయారు. వచ్చే ఏడాదిలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆమె బీజేపీని ఆశ్రయించడం గమనార్హం.
గత సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంపై ఖుష్బు అసంతృప్తి చెందారు. 2021లో అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చిన తర్వాతే ఆ పార్టీలో చేరే నిర్ణయాన్ని ఖుష్బు తీసుకున్నట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఏఐసీసీ స్పోక్స్‌పర్సన్ పదవి నుంచి వెంటనే తొలగిస్తూ కాంగ్రెస్ ప్రకటించింది. 2010లో ఖుష్బు డీఎంకేలో చేరి రాజకీయాల్లోకి అరంగేట్రం చేసింది. ఖుష్బు ప్రగతిశీల ఆలోచనలు కలిగి ఉన్నారని, పెరియార్ ఆదర్శంతో రాజకీయాల్లోకి వచ్చారని దివంగత తమిళనాడు సీఎం కరుణానిధి అన్నారు. అనంతరం, 2014లో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంది. సుమారు 200 సినిమాల్లో నటించిన ఖుష్బు సుందర్ దక్షిణ భారతంలో వీరాభిమానులను సంపాదించుకున్నారు.