‘హ్యాండ్’ ఇచ్చిన పీసీ చాకో.. కేరళలో కాంగ్రెస్‌కు భారీ షాక్
దిశ, వెబ్ డెస్క్: అసెంబ్లీ ఎన్నికల వేళ కేరళలో కాంగ్రెస్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ లీడర్, ఏఐసీసీ మాజీ నాయకుడు పీసీ చాకో కాంగ్రెస్‌ను వీడారు. ఈమేరకు ఆయన బుధవారం తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షురాలు (మధ్యంతర) సోనియా గాంధీకి పంపారు. ఇదే విషయమై చాకో స్పందిస్తూ.. ‘కేరళలో నేను పార్టీ ఎదుగుదల కోసం చాలా కష్టపడ్డాను. కానీ ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ బృందంతో కలిసి పనిచేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీలో నాయకత్వ […]
దిశ, వెబ్ డెస్క్: అసెంబ్లీ ఎన్నికల వేళ కేరళలో కాంగ్రెస్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ లీడర్, ఏఐసీసీ మాజీ నాయకుడు పీసీ చాకో కాంగ్రెస్‌ను వీడారు. ఈమేరకు ఆయన బుధవారం తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షురాలు (మధ్యంతర) సోనియా గాంధీకి పంపారు. ఇదే విషయమై చాకో స్పందిస్తూ.. ‘కేరళలో నేను పార్టీ ఎదుగుదల కోసం చాలా కష్టపడ్డాను. కానీ ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ బృందంతో కలిసి పనిచేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీలో నాయకత్వ లేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది’ అని ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఏడాదికాలంగా అధ్యక్షుడే లేడనీ, దాంతో పార్టీ పరిస్థితి కెప్టెన్ లేని షిప్‌గా మారిందని చాకో వాపోయారు. అనంతరం ఆయన కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఊమెన్ చాందీ, రమేశ్ చెన్నితాల మీద కూడా విమర్శలు చేశారు. అభ్యర్థులను ఖరారు చేసే సమయంలో వారు ఏకపక్షంగా వ్యవహరించారనీ, తమతో కనీసం సంప్రదింపులు జరపలేదని మండిపడ్డారు. కేరళలో కాంగ్రెస్ దాదాపు కనుమరుగయ్యే పరిస్థతి ఏర్పడిందనీ, ఇక్కడి పరిస్థితులపై పలుమార్లు అధిష్టానానికి విన్నవించే ప్రయత్నం చేసినా తాను విఫలమయ్యానని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవన్నీ చూస్తూ కూడా పార్టీ అధిష్టానం మౌన ప్రేక్షకుడిలా ఉండటం తనను బాధించిందని చాకో తెలిపారు. కాంగ్రెస్‌లో విద్యార్థి నేతగా రాజకీయ జీవితం ప్రారంభించిన చాకో.. వివిధ స్థాయిల్లో పనిచేసి ఏఐసీసీ స్థాయికి ఎదిగారు. త్రిస్సూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎంపీగా ఎన్నికైన ఆయన.. రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల వేళ చాకో పార్టీని వీడటం కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.