అభిమానులా.. అధికారులా..?
గతంలో ఏ ముఖ్యమంత్రి సాధించని ఘనతను మన ముఖ్యమంత్రి సాధించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మొదలు ఐఏఎస్లు, ప్రభుత్వ విభాగాలు, ఇతర అధికారులను కూడా తన పుట్టిన రోజు వేడుకలను నిర్వహించేలా చేశారు. కేసీఆర్ బర్త్డే వేడుకలను నిర్వహించడంలో టీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను వెనక్కినెట్టి మరీ అధికారులు ముందంజలో ఉన్నారు. ఇందుకోసం రెగ్యులర్గా సోమవారం నిర్వహించే ప్రజావాణితో పాటు సాధారణ కార్యక్రమాలను రద్దు చేసి కార్యాలయాలను వదిలి రోడ్ల మీద పడ్డారు. సోమవారం కేసీఆర్ 66వ పుట్టిన […]
గతంలో ఏ ముఖ్యమంత్రి సాధించని ఘనతను మన ముఖ్యమంత్రి సాధించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మొదలు ఐఏఎస్లు, ప్రభుత్వ విభాగాలు, ఇతర అధికారులను కూడా తన పుట్టిన రోజు వేడుకలను నిర్వహించేలా చేశారు. కేసీఆర్ బర్త్డే వేడుకలను నిర్వహించడంలో టీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను వెనక్కినెట్టి మరీ అధికారులు ముందంజలో ఉన్నారు. ఇందుకోసం రెగ్యులర్గా సోమవారం నిర్వహించే ప్రజావాణితో పాటు సాధారణ కార్యక్రమాలను రద్దు చేసి కార్యాలయాలను వదిలి రోడ్ల మీద పడ్డారు. సోమవారం కేసీఆర్ 66వ పుట్టిన రోజు సందర్భంగా ఒక్క రోజే కోటి మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అధికారులా..? అభిమానులా..? అని అందరూ ముక్కున వేలు వేసుకునేలా చేశారు. సాధారణంగా ఈ పనిని టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చేపట్టాలి. గతంలో పనిచేసిన వైఎస్ఆర్, చంద్రబాబు నాయుడు సహా ఏ ముఖ్యమంత్రి పుట్టిన రోజు వేడుకల్లోనూ ప్రభుత్వ అధికారులు నేరుగా పాల్గొనలేదు. ప్రత్యేక అభిమానమున్న వారు ఒక్కరిద్దరు వ్యక్తిగతంగా కలిసి శుభాకాంక్షలు తెలిపేవారు. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా పార్టీ కార్యకర్తలెవరూ హోర్డింగ్‌లు పెట్టొద్దని, తలా ఒక మొక్కను నాటాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా కోరారు. దీన్ని అధికారులు తామే కార్యకర్తలమని భావించారో ఏమిటో మరి.. కేటీఆర్ ఒక్కటి చెబితే తమ పవర్, సిబ్బందిని ఉపయోగించి అంతకు మించి.. అన్నట్టు వందల్లో, వేలల్లో మొక్కలు నాటి అధికారులు అనుకుంటే ఎంతటి పనైనా సాధ్యమే అని సారు మీద తమకున్న ప్రేమ ఏంటో నిరూపించారు. సాధారణ పరిపాలనా పనులను సైతం ఆపేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీలు, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, హెచ్‌ఎమ్‌డబ్ల్యూఎస్&ఎస్‌బీ, జిల్లా కలెక్టరేట్లు, మండల పోలీసు స్టేషన్లు సహా అధికారులంతా మొక్కలు నాటడంలో బిజీగా గడిపారు. దీంతో అవసరాల కోసం కార్యాలయాలకొచ్చే సాధారణ ప్రజలు అధికారులు లేక, పనులు జరగకపోవడంతో వెనుదిరిగి వెళ్లాల్సి వచ్చింది. ప్రగతిభవన్లో కేసీఆర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులతో మించి రాష్ట్రంలోని ఐఏఎస్లు, ఐపీఎస్లు పోటీ పడ్డారు. మరో అడుగు ముందుకేసిన హైదరాబాద్ నగరపాలక సంస్థ 150వార్డుల్లో మొక్కలు నాటే కార్యక్రమంతో పాట గచ్చిబౌలి స్టేడియంలో మియావాకి పద్ధతిని ఉపయోగించి ఒకే రోజు పది వేల మొక్కలు నాటడం విశేషం..
కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఒక ఉద్యమంలా చేపట్టి మరే అత్యవసర పనులు లేనట్టు చేసిన ప్రభుత్వ అధికారుల్లో ఐఏఎస్, ఐపీఎస్ క్యాడర్ కూడా ఉండటం బాధాకరం. ప్రభుత్వానికి ఎలాంటి సంబంధంలేని ఓ కార్యక్రమంలో పోటీపడిన అధికారులు ప్రజలకు సేవలందించి తమ విధులను ఇదే స్థాయిలో కొనసాగిస్తే మన రాష్ట్రం సుపరిపాలన దిశగా అడుగులేస్తుంది. ప్రభుత్వం, అధికారులపైనా ప్రజలకు నమ్మకం కలిగించిన వారవుతారు.