చిరు జల్లులకే రహదారులకు చిల్లులు.. ప్యాచ్‌లతో సరిపెడుతున్న బల్దియా!
దిశ, కరీంనగర్ సిటీ : నగరంలోని దారులపై ఉన్న గుంతలకు అధికారులు గంతలు కడుతున్నారు. ఒక్కోటి అడుగు నుంచి 3 అడుగుల లోతు వరకు ఉన్నా.. పైపైన మెరుగులు మాత్రమే దిద్ది చేతులు దులుపుకుంటున్నారు. శుక్రవారం రాత్రి కురిసిన చిరు జల్లులకు మళ్లీ గుంతలు తేలాయి. దీంతో శనివారం నుంచి గణేష్ నిమజ్జనం ప్రారంభం కానుండగా రోడ్లపై ఏర్పడ్డ గొయ్యిలు, గుంతలు వినాయక ప్రతిమలను రా రమ్మంటూ ఆహ్వానిస్తున్నాయి. ఫలితంగా ఊరేగింపులో ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం లేకపోలేదు.దీంతో […]
దిశ, కరీంనగర్ సిటీ : నగరంలోని దారులపై ఉన్న గుంతలకు అధికారులు గంతలు కడుతున్నారు. ఒక్కోటి అడుగు నుంచి 3 అడుగుల లోతు వరకు ఉన్నా.. పైపైన మెరుగులు మాత్రమే దిద్ది చేతులు దులుపుకుంటున్నారు. శుక్రవారం రాత్రి కురిసిన చిరు జల్లులకు మళ్లీ గుంతలు తేలాయి. దీంతో శనివారం నుంచి గణేష్ నిమజ్జనం ప్రారంభం కానుండగా రోడ్లపై ఏర్పడ్డ గొయ్యిలు, గుంతలు వినాయక ప్రతిమలను రా రమ్మంటూ ఆహ్వానిస్తున్నాయి. ఫలితంగా ఊరేగింపులో ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం లేకపోలేదు.దీంతో మండపాల నిర్వాహకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఏటా గణపతి నవరాత్రి ఉత్సవాలు నగరంలో ఘనంగా జరుగుతాయి. నిమజ్జనం కూడా అదే స్థాయిలో కొనసాగుతుంది. అర అడుగు ఎత్తు నుంచి 16 అడుగుల ఎత్తువరకు మండపాల్లో విగ్రహాలు కొలువుదీరిన విషయం తెలిసిందే.
నవరాత్రులు పూర్తయిన అనంతరం గణనాధులు నిమజ్జనం కోసం చెరువులు, ఘాట్లకు చేరుకుంటాయి. అందుకోసం బల్దియా యంత్రాంగం ఏర్పాట్లను చేస్తున్నది. ప్రధానంగా నగర రోడ్లపై ఏర్పడే గుంతలు పూర్తి చేయడంతో పాటు నిమజ్జనం సందర్భంగా చేపట్టే ఊరేగింపులో విగ్రహాలకు అడ్డు వచ్చే చెట్లు, విద్యుత్ వైర్లు తొలగిస్తూ ఎలాంటి ఆటంకాలు కలగకుండా సంబంధిత విభాగాల అధికారులతో కలిసి చర్యలు చేపడుతున్నది. గత కొన్నేళ్లుగా మండపాల నిర్వాహకులకు సహకరిస్తూ చవితి వేడుకలు సజావుగా జరగడంలో బల్దియా యంత్రాంగం, పాలకవర్గం తమ వంతు ముఖ్యపాత్రను పోషిస్తున్నాయి. ఉత్సవాలు ప్రారంభమైన రెండు, మూడు రోజుల నుంచే నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లు చేపట్టడంలో బల్దియా సన్నాహాలు చేస్తుంది.
ఇందులో భాగంగానే రోడ్లపై ఏర్పడ్డ గుంతల్లో మొరం నింపడం, నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో డస్ట్ పోయించటం చేస్తుంది. ఇందుకోసం ప్రతీ డివిజన్‌కు కొంత మొత్తం కేటాయించి, టెండర్లు నిర్వహిస్తూ ఉంటుంది. వీటిని దక్కించుకున్న కాంట్రాక్టర్లు నగరంలోని అన్ని రహదారులపై ఉండే గుంతలు పూడ్చి, విగ్రహాల తరలింపు కోసం అడ్డుగా ఉన్న చెట్లను తొలగిస్తుంటారు. కారణాలు ఏవైనా టెండర్ల నిర్వహణలో ఈసారి నెలకొన్న జాప్యంతో నిమజ్జన గడువు ముంచుకొచ్చింది. ఆలస్యంగా మేల్కొన్న యంత్రాంగం టెండర్లు పిలిచిన గంటల వ్యవధిలోనే ప్యాచ్ వర్కులు చేయాలని గుత్తేదారులను ఆదేశించింది. దీనిని అలుసుగా తీసుకున్న గుత్తేదారులు పైపైన పూతలతో మమ అనిపిస్తున్నారు.
దీంతో చిన్నపాటి వర్షానికే ప్యాచ్ వర్క్ పోయి మళ్లీ గుంతలు పెద్దగా నోళ్లు తెరిచాయి. మరికొన్ని చోట్ల ఇప్పటికీ గుంతలు పూడ్చనేలేదు. జరుగుతున్న పనులపై అధికారుల కనీస పర్యవేక్షణ లేకపోగా గుత్తేదారులు ఇష్టారాజ్యంగా పనులు చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి నాసిరకం పనుల వలన బల్దియా అధికారులపై నగరవాసులు ఫైర్ అవుతున్నారు. రూ.60 లక్షలు బూడిదలో పోసిన పన్నీరులా మారాయని స్థానికులు మండిపడుతున్నారు. నగర పాలక సంస్థ పాలక వర్గం, అధికారులు అనుసరిస్తున్న తీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని భావించిన అధికార పార్టీకి చెందిన 51వ డివిజన్ కార్పొరేటర్, మాజీ మేయర్ సర్దార్ రవీందర్సింగ్, మరో కార్పొరేటర్ కమల్జిత్ కౌర్ తమ తమ డివిజన్లతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో దాతల నుంచి విరాళాలు, తాము మరికొంత వెచ్చించి గుంతలు పూడ్చటం నగరంలో చర్చనీయాంశంగా మారింది.