శృంగారం విషయంలో పురుషుల ఇష్టానికే ప్రాధాన్యతా?
దిశ, ఫీచర్స్ : వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలని ప్రపంచవ్యాప్తంగా దీర్ఘకాలిక ఉద్యమాలు జరుగుతున్నాయి. కానీ చాలా దేశాల్లో ఇది నామమాత్రపు చట్టంగానే మిగిలిపోగా.. అందులో భారత్ కూడా ఉంది. 31 శాతానికి పైగా వివాహితలు అంటే కనీసం ముగ్గురిలో ఒకరు తమ భర్తల కారణంగా శారీరక, మానసిక హింసలకు గురవుతున్నట్లు సర్వేలు తెలుపుతున్నాయి. ఈ మేరకు పెళ్లి చేసుకున్న తర్వాత భార్య శరీరంపై పూర్తి హక్కు భర్తకు ఇచ్చేసినట్లేనా? భాగస్వామితో జీవితం కొనసాగించి పిల్లల్ని కనాలా […]
దిశ, ఫీచర్స్ : వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలని ప్రపంచవ్యాప్తంగా దీర్ఘకాలిక ఉద్యమాలు జరుగుతున్నాయి. కానీ చాలా దేశాల్లో ఇది నామమాత్రపు చట్టంగానే మిగిలిపోగా.. అందులో భారత్ కూడా ఉంది. 31 శాతానికి పైగా వివాహితలు అంటే కనీసం ముగ్గురిలో ఒకరు తమ భర్తల కారణంగా శారీరక, మానసిక హింసలకు గురవుతున్నట్లు సర్వేలు తెలుపుతున్నాయి. ఈ మేరకు పెళ్లి చేసుకున్న తర్వాత భార్య శరీరంపై పూర్తి హక్కు భర్తకు ఇచ్చేసినట్లేనా? భాగస్వామితో జీవితం కొనసాగించి పిల్లల్ని కనాలా వద్దా! నిర్ణయించుకునే హక్కు మహిళకు ఉంటుందా లేదా? సెక్స్ భంగిమల కోసం భార్యను బలవంతం చేయొచ్చా? అనే విషయాలపై చట్టం ఏం చెబుతోంది?
లైంగిక స్వేచ్ఛ.. మహిళ హక్కు
మహిళలు ప్రతీ విషయంలోనూ అణచివేతకు గురవుతుంటారు. పలు సినిమాల్లో చూపించినట్లు ఇంట్లో పనులన్నీ చేసి అలసిపోయిన భార్య.. కాస్త రిలాక్స్ అవుదామని నడుం వాల్చినప్పుడే భర్త సెక్స్ గురించి ఒత్తిడి చేస్తాడు. పొద్దున లేచినప్పటి నుంచి విశ్రాంతిలేదని ఆమె అడ్డుచెబితే.. చేయి చేసుకునే మగాళ్లూ లేకపోలేదు. కానీ మహిళలకు సైతం లైంగిక స్వేచ్ఛ ఉందని నొక్కిచెబుతున్నాయి చట్టాలు. ఒక స్త్రీ పెళ్లి చేసుకుంటే, తన శరీరాన్ని పూర్తిగా భర్తకు అప్పగించినట్లు కాదని.. కట్టుకున్న భర్త అయినా సరే ఆమె పర్మిషన్ ఉంటేనే శృంగారంలో పాల్గొనాలని చెప్తున్నాయి. సెక్స్ మధ్యలో తనకు ఇబ్బంది కలిగి అడ్డు చెప్తే వెంటనే తప్పుకోవాలని, తన నిర్ణయాన్ని గౌరవించాలని సూచిస్తున్నాయి. అంతేకాదు ఇష్టపూర్వకంగా ఎదుటి వ్యక్తితో సెక్స్‌లో పాల్గొని, అనుకోకుండా ప్రెగ్నెంట్ అయితే ఫోర్సబుల్‌గా అబార్షన్ చేయించరాదని గతంలో ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు మహిళపై అత్యాచారం చేసి గర్భస్రావానికి ఒత్తిడి చేసిన వ్యక్తికి బెయిల్ కూడా నిరాకరించింది.
ప్రెగ్నెంట్.. ఫైనల్ డెసిషన్ మహిళదే!
సాధారణంగా అమ్మాయిలకు చాలా కలలుంటాయి. నిర్ణీత సమయంలోపు వాటిని ఫుల్ ఫిల్ చేసుకోవాలని అనుకుంటారు. ఇలాంటి సందర్భంలో తమ కలలకు పెళ్లి, ప్రెగ్నెంట్ వంటివి అడ్డొస్తే.. ఫైనల్ డెసిషన్ కచ్చితంగా వారిదే అవుతుందని చట్టాలు చెప్తున్నాయి. కట్టుకున్న భర్తకు కూడా తన గర్భం మీద హక్కులుండవని, పునరుత్పత్తి హక్కులన్నీ మహిళవేనని వివరిస్తున్నాయి. కానీ నిజంగా ఇది అమలవుతుందా? అంటే 50శాతం కూడా కష్టమేననే సమాధానమే వినబడుతుంది. ఇప్పటికి కూడా అబార్షన్ చేయించుకోవాలంటే హాస్పిటల్స్‌లో భర్త అనుమతి ఉందా? లేదా? అని అడుగుతున్నారు. అంతేకాదు వివాహమై, లైంగిక బంధానికి ఓకే చెప్తే ఆ పురుషుడి బిడ్డకు తల్లి అవుతానని చెప్పినట్లు కాదని సుప్రీం కోర్టు కూడా వ్యాఖ్యానించింది. కానీ భర్త అనుమతి లేకుండా గర్భస్రావం చేయించుకుందనే నెపంతోనూ కొందరు మగాళ్లు విడాకులు తీసుకుంటున్నారు. 2008లో ఈ తరహా కేసును విచారించిన సుప్రీం కోర్టు.. హిందూ వివాహ చట్టం కింద ఈ విషయాన్ని క్రూరత్వంగా పరిగణించి విడాకులు మంజూరు చేసింది.
అనుమతి లేకపోతే అత్యాచారమే.. కానీ?
‘పింక్’ మూవీలో అమితాబ్ బచ్చన్ చెప్పినట్లుగా.. బాయ్ ఫ్రెండ్ మాత్రమే కాదు కట్టుకున్న భర్త కూడా భార్య ఇష్టం లేకుండా సెక్స్ చేస్తే అది అత్యాచారంగానే పరిగణించబడుతుంది. కానీ చత్తీస్‌గఢ్ హైకోర్టు ఆగస్టు 2021లో భార్యకు ఇష్టం లేకపోయినా భర్త బలవంతంగా శృంగారం చేయొచ్చని తీర్పునిచ్చింది. అంతేకాదు వివిధ భంగిమల్లో సెక్స్ కావాలని ఒత్తిడి చేసినా సరే.. భర్తని నేరస్తుడిగా పరిగణించలేమని, ఎందుకంటే హిందూ వైవాహిక చట్టం దీన్ని అత్యాచారంగా గుర్తించలేదని తెలిపింది. మ్యారిటల్ రేప్ అనేది నేరమని, దీన్ని అత్యాచారంగా పరిగణించాలని ఉద్యమాలు జరుగుతున్నా.. చాలా దేశాల్లో ఇది కేవలం చట్టంగానే మిగిలిపోయింది. కానీ శృంగారం సమయంలో భార్యను నిర్బంధించడం, కొట్టడం, బెదిరించడం లాంటివి చేస్తే భారతీయ శిక్షా స్మృతి ప్రకారం ఇలాంటి నేరాలకు శిక్షలుంటాయి. కాగా దీనిపై సుప్రీం కోర్టు తుది తీర్పు వెలువరించాల్సి ఉంది. అంతేకాదు ఒకవేళ భార్య శరీరంపై గాయాలు లేకపోతే తనకు శృంగారం ఇష్టమనే స్టీరియోటైపికల్ థాట్ నుంచి న్యాయస్థానాలు బయటకు రావాలని అంటున్నారు నిపుణులు.
చట్టాలు ఆదుకోవాలి..
బాలిక దశ నుంచి అడుగడుగునా స్త్రీలకు అన్యాయం జరుగుతూనే ఉంది. భ్రూణ హత్యలు మొదలుకుని బ్యాడ్ టచ్, మైనర్‌లపై అత్యాచారం, మ్యారిటల్ రేప్.. ఇలా ప్రతీ విషయంలో బాధలు అనుభవిస్తూనే ఉన్నారు. ఎన్ని కఠిన చట్టాలు రూపొందించినా సరిగ్గా అమలు కాకపోవడంతో.. స్త్రీలపై దాడులు పెరిగిపోతున్నాయని చెప్తున్నారు నిపుణులు. ముఖ్యంగా లైంగిక హింస విషయంలో మరిన్ని చట్టాలు రావాలని.. అలాంటప్పుడే మార్పు సాధ్యమవుతుందని అంటున్నారు. మారిటల్ రేప్‌ను అత్యాచార చట్టం పరిధిలోకి తీసుకురావాలన్న జస్టిస్ వర్మ కమిషన్ సూచనలను పరిగణలోకి తీసుకోవాలని.. ఈ విషయంలో మహిళకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని సూచిస్తున్నారు.