జర్నలిస్టు ప్రియారమణికి ఢిల్లీ కోర్టు బాసట
న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్ దాఖలు చేసిన నేరపూరిత పరువునష్టం దావా కేసు నుంచి జర్నలిస్టు ప్రియా రమణికి బుధవారం ఢిల్లీ కోర్టు విముక్తి కల్పించింది. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మహిళలకు సామాజిక కళంకం అంటగట్టడం గమనించామని వ్యాఖ్యానించింది. మీటూ ఉద్యమంలో భాగంగా ఎంజే అక్బర్‌పై ప్రియా రమణి లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఆ సమయంలో ఆయన విదేశాంగశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. తనపై ప్రియా రమణి ఆరోపణలను ఖండించిన ఎంజే […]
న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్ దాఖలు చేసిన నేరపూరిత పరువునష్టం దావా కేసు నుంచి జర్నలిస్టు ప్రియా రమణికి బుధవారం ఢిల్లీ కోర్టు విముక్తి కల్పించింది. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మహిళలకు సామాజిక కళంకం అంటగట్టడం గమనించామని వ్యాఖ్యానించింది. మీటూ ఉద్యమంలో భాగంగా ఎంజే అక్బర్‌పై ప్రియా రమణి లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఆ సమయంలో ఆయన విదేశాంగశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. తనపై ప్రియా రమణి ఆరోపణలను ఖండించిన ఎంజే అక్బర్ ఆమెపై నేరపూరిత పరువునష్టం దావా వేశారు. ఆ తర్వాత పలువురు మహిళలు కూడా లైంగిక ఆరోపణలు గుప్పించడంతో 2018, అక్టోబర్‌లో కేంద్ర మంత్రి పదవికి ఎంజే అక్బర్ రాజీనామా చేశారు. నేరపూరిత పరువునష్టం దావాపై బుధవారం తుది విచారణ చేపట్టిన అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ పాండే బాధితురాలు తన సాక్ష్యం ద్వారా నిజాన్ని బయటపెట్టిందని పేర్కొంటూ ప్రియా రమణికి కేసు నుంచి విముక్తి కల్పించారు.
పని ప్రదేశాల్లో వ్యవస్థీకృతమైన లైంగిక వేధింపులు ఉన్నాయని పేర్కొన్నారు. ‘లైంగిక వేధింపులకు పాల్పడే వ్యక్తి సమాజంలో అత్యున్నత స్థానం కలిగిన ఉండవచ్చు. అంతమాత్రాన అతుడు గౌరవం కాపాడుకునే హక్కుకు రక్షణ పొందలేదు’ అని కోర్టు అభిప్రాయపడింది. దశాబ్దాల తర్వాత కూడా తనపై లైంగిక వేధింపులు జరిగిన విషయాన్ని బయట పెట్టడానికి మహిళలకు సర్వహక్కులు ఉన్నాయని పేర్కొంది. ఢిల్లీ కోర్టు తీర్పుపై ప్రియా రమణి హర్షం వ్యక్తం చేశారు. ఈ పోరాటం మహిళల అందరిది. నా ఒక్కరిది కాదు. నాకంటే ముందు మాట్లాడిన, నా తర్వాత మాట్లాడిన అందరు మహిళల తరఫున నేను ప్రాతినిధ్యం వహించాను అని ఆమె పేర్కొన్నారు. నా విజయం మరికొందరు మహిళలు మాట్లాడటానికి అవకాశం కల్పిస్తుందని, బాధితులను కోర్టుకు ఈడ్చే ముందు వేధింపులకు పాల్పడే పురుషులను ఒకటికి రెండు సార్లు ఆలోచించుకునేలా చేస్తుందని ప్రియా రమణి అభిప్రాయపడ్డారు.