జోగులాంబ మాత సాక్షిగా.. వైద్య సేవలు అందడం లేదు
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: జోగులాంబ మాత సాక్షిగా.. మాకు సరైన వైద్యసేవలు అందడం లేదు.. వైద్య సేవలు మెరుగు పరుస్తామని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని జోగులాంబ గద్వాల జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.. రాష్ట్ర ప్రభుత్వం వైద్య సదుపాయాలను మెరుగుపరచడం వల్ల సమీపంలో ఉన్న కర్నూలు జిల్లా కి వెళ్లి వైద్య సేవలు పొందితే అక్కడ ఆరోగ్యశ్రీ అమలు కాదు.. పాలమూరు లేదా పట్నం వెళ్లి వైద్య సేవలు […]
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: జోగులాంబ మాత సాక్షిగా.. మాకు సరైన వైద్యసేవలు అందడం లేదు.. వైద్య సేవలు మెరుగు పరుస్తామని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని జోగులాంబ గద్వాల జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.. రాష్ట్ర ప్రభుత్వం వైద్య సదుపాయాలను మెరుగుపరచడం వల్ల సమీపంలో ఉన్న కర్నూలు జిల్లా కి వెళ్లి వైద్య సేవలు పొందితే అక్కడ ఆరోగ్యశ్రీ అమలు కాదు.. పాలమూరు లేదా పట్నం వెళ్లి వైద్య సేవలు చేయించుకుందామని అక్కడికి చేరే లోపు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి… మా ప్రాంతంలో వైద్య సదుపాయాలను మెరుగుపరిచి, తగిన సిబ్బందిని నియమించి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రస్తుత పరిస్థితులు
జోగులాంబ గద్వాల జిల్లాలో మొత్తం 8 లక్షలకు పైగా జనాభా ఉండవచ్చని అంచనా.. ఈ ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించేందుకు జిల్లా కేంద్రంలో ప్రధాన ఆసుపత్రితో పాటు మరో 14 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఈ ఆసుపత్రిలో సరైన సదుపాయాలు, వసతులు లేకపోవడం, సిబ్బంది కొరత ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక్కడి ఆసుపత్రులు ప్రాథమిక చికిత్సలకు తప్ప ప్రధాన వైద్య సేవలకు ఉపయోగపడడం లేదన్న విమర్శలు ఉన్నాయి. సగటున గతంలో ప్రతి రోజూ 1000 మందికి పైగా ఈ ఆసుపత్రులకు వచ్చే వారు. కరోనా వచ్చిన నేపథ్యంలో ఈ సంఖ్య మూడింతల కు పైగా పెరిగింది. జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో తప్ప మిగిలిన ఆసుపత్రులలో వైద్య సేవలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.
అమలు కాని సీఎం హామీలు
జోగులాంబ గద్వాల జిల్లాలో వైద్య సేవలు మెరుగుపరిచేందుకు రక్షణ చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 2016లో కృష్ణా పుష్కరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ప్రకటించారు, ఎన్నికల సమయంలోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించారు, జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా ఆస్పత్రిని 150 పడకల నుండి 300 పడకల ఆసుపత్రిగా మారుస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆస్పత్రిలో స్థాయిని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2018లో ఉత్తర్వులు జారీ చేసింది. అల్లంపూర్ ఆసుపత్రికి 23 కోట్ల 38 లక్షలు, గద్వాల జిల్లా ఆస్పత్రికి 43 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఉత్తర్వులు విడుదలై మూడు సంవత్సరాలు దాటుతున్నా ఆసుపత్రుల నిర్మాణ కార్యక్రమాలు అడుగు ముందుకు పడలేకపోతోంది.
డబ్బులు ఉంటేనే కర్నూలు
సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ జిల్లా ప్రజలు ఎక్కువ మొత్తంలో కర్నూలు జిల్లా కేంద్రానికి వెళ్లి వైద్య సేవలు పొందేవారు. రాష్ట్ర విభజన అనంతరం ఈ ప్రాంత ప్రజలు అక్కడికి వెళ్ళిన వైద్య సేవలు పొందలేని పరిస్థితులు ఉన్నాయి. ఆర్థికంగా ఉన్న వాళ్ళు మాత్రం ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి వైద్య సేవలు పొందుతున్నారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు అక్కడ ఆరోగ్యశ్రీ వర్తించే పరిస్థితులు లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. కొంతమంది వైద్యం కోసం 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహబూబ్‌నగర్, 225 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్ కు వైద్యం కోసం వెళ్లాలంటే మధ్యలోనే ప్రాణాలు కోల్పోవాల్సినా పరిస్థితులు నెలకొంటున్నాయి. గుండె పోటు తదితర అత్యవసర సేవలు పొందవలసి వస్తే ఇక్కడి ప్రజలు ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇటీవల కరోనాతో తీవ్ర అనారోగ్యానికి గురై హైదరాబాద్ కు తరలించే లోపే పలువురు ప్రాణాలు కోల్పోయారు.
అలంపూర్ కు అంబులెన్స్ కూడా దిక్కు లేదు
అలంపూర్ నియోజకవర్గ కేంద్రం అటు గద్వాల జిల్లా కేంద్రానికి 75 కిలోమీటర్లు, హైదరాబాద్. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రాలకు మరింత దూరంలో ఉండటం వల్ల అత్యవసర సేవలు అవసరమైతే వారిని హుటాహుటిన ఆస్పత్రులకు తీసుకెళ్లేందుకు కనీసం అంబులెన్స్ సౌకర్యాలు కూడా లేవు. ఏదైనా ప్రమాదం జరిగితే సమాచారం అందిన తర్వాత రెండు మూడు గంటలు దాటితే గాని అంబులెన్స్‌లు వచ్చే పరిస్థితులు లేవు. ఈ కారణంగా ఈ ప్రాంత ప్రజలు మరిన్ని ఇబ్బందులకు గురవుతున్నారు.
ఆస్పత్రిలో స్థాయి పెంచాలి
అలంపూర్, గద్వాల ఆస్పత్రిలో స్థాయిని వెంటనే పెంచాలి.. మెరుగైన వైద్య సేవలు అందించాలని ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అవసరమైన స్థాయిలో ఆసుపత్రులలో సదుపాయాలు కల్పించి సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించాలని, ఈ ప్రాంత ప్రజల ప్రాణాలను కాపాడాలని పలువురు కోరుతున్నారు.