గ్రూప్ -4 సక్సెస్ ప్లాన్

గ్రూప్ -4 సిలబస్‌లో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి.

Update: 2022-12-26 15:27 GMT

పరీక్షా విధానం:

గ్రూప్ -4 సిలబస్‌లో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి.

పేపర్ -1: జనరల్ స్టడీస్ నుంచి 150 ప్రశ్నలకు గానూ 150 మార్కులుంటాయి.

పేపర్ -2: సెక్రటేరియల్ ఎబిలిటీస్ - 150 ప్రశ్నలకు గానూ 150 మార్కులు ఉంటాయి.

పేపర్ 1లో మొత్తం 11 అంశాలు ఉంటాయి. పేపర్ 2లో మొత్తం 5 టాపిక్స్ ఉంటాయి.

పేపర్ -1లో గమనించాల్సిన అంశాలు:

సాధారణంగా అన్ని పోటీ పరీక్షల్లో ఉండే జనరల్ ఇంగ్లీష్ ఈ పేపర్ లో లేదు.

సిలబస్ లిమిటెడ్ గా ఉన్నదనిపించినా.. అన్ని టాపిక్‌లకు సమానమైన ప్రాధాన్యత ఇవ్వాలి.

మొత్తంగా 11 అంశాలలో ఒక్కొక్క అంశం నుండి సరాసరి 15 ప్రశ్నలను మనం ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు.

కొన్నింటికి మాత్రం నాలుగైదు మార్కులు ఎక్కువ రావచ్చు లేదా తక్కువగా రావచ్చు.

పై పైన ప్రిపేరయితే సరిపోదు:

కొన్ని సబ్జెక్టులు మాత్రమే ప్రిపేరయితే మాత్రం కుదరదు. పై పైన ప్రిపేరయితే కూడా సరిపోదు. ఈ విషయం గ్రూప్ - 1 ప్రిలిమినరీ ప్రశ్నాపత్రాన్ని గమనిస్తే మనకు స్పష్టమవుతుంది.

పేపర్ -2లో గమనించాల్సిన అంశాలు:

పేపర్ -2 మొత్తం 5 అంశాలు ఉంటాయి. అయితే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. అంతేగాని ఏదైనా రెండు అంశాల మీద మొత్తం పేపర్ ఉంటుందనేది పూర్తిగా అర్థరహితం.

గతంలో జరిగిన గ్రూప్ - 4 పరీక్షకు, ఇప్పుడు జరగబోయే గ్రూప్ -4 పరీక్షకు చాలా తేడా ఉంటుందనే విషయాన్ని మర్చిపోవద్దు.

ఈ పేపర్ పూర్తిగా ప్రాక్టీస్, స్పీడ్ పైనే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మ్యాథ్స్ బ్యాక్ గ్రౌండ్ వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే సాధారణంగా మ్యాథ్స్ బ్యాక్ గ్రౌండ్ వారు జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ లో వీక్ గా ఉంటారు. అనే విషయం మరచిపోవద్దు.

పేపర్ -2 సిలబస్ లోని టాపిక్స్‌కు ఎంత వరకు ప్రాధాన్యత ఇవ్వాలనేది సిలబస్‌ను అర్థం చేసుకంటే తెలుస్తుంది.

పేపర్ 2: సెక్రటేరియల్ ఎబిలిటీస్:

సిలబస్ 1. మెంటల్ ఎబిలిటీ(వెర్బల్, నాన్ వెర్బల్)

లాజికల్ రీజనింగ్

కాంప్రెహెన్షన్

వ్యాక్యాలను సరియైన క్రమంలో అమర్చడం

న్యూమరికల్, అర్థమెటిక్ ఎబిలిటీలు.

మెంటల్ ఎబిలిటీ (వెర్బల్, నాన్ వెర్బల్):

మెంటల్ ఎబిలిటీలో రెండు ప్రధాన అంశాలు ఉన్నాయి. ఒకటి వెర్బల్ అయితే మరొకటి నాన్ వెర్బల్. ఈ అంశం నుంచి దాదాపు 40 మార్కుల వరకు రావడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే మ్యాథ్స్, నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకు ఏమీ తేడా ఉండదు.

అసలు సమస్య మ్యాథ్స్, నాన్ మ్యాథ్స్ కాదు. లాంగ్వేజ్ సమస్య. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు, తెలుగు అభ్యర్థులకు తేడా ఏమిటంటే...

ఇంగ్లీష్ మీడియం అభ్యర్థికి ప్రశ్న చదివే క్రమంలోనే సమాధానం దాదాపు తెలుస్తుంది.

తెలుగు మీడియం అభ్యర్థి దానిని పూర్తిగా అర్థం చేసుకుంటే గాని సమాధానం రాయలేరు.

లాజికల్ రీజనింగ్:

ఈ అంశం నుండి దాదాపు 25 నుండి 30 మార్కులను మనం ఎక్స్ పెక్ట్ చేయవచ్చు. అయితే ఇది పూర్తిగా స్కోర్ చేసే ఆస్కారం ఉన్న టాపిక్. దీని పేరులోనే అర్థం ఉంది.

లాజికల్ రీజనింగ్ వివిధ రకాల మోడల్స్ ఉంటాయి. వాటిని బాగా ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా మోడల్ ప్రశ్నల మీద ఆధారపడకుండా, ప్రీవియస్ ప్రశ్న పత్రాలను సంపూర్ణంగా విశ్లేషించాలి.

కాంప్రెహెన్షన్:

కాంప్రెహెన్షన్ పైన దాదాపు 20 నుండి 30 మార్కుల వరకు వచ్చే అవకాశం ఉంది.

ఈ అంశం మీద పూర్తి పట్టు సాధించాలంటే ఇంగ్లీషు భాష మీద కూడా పట్టు ఉండాల్సిందే. అయితే ఇంగ్లీషు భాషపై పట్టు రావాలంటే రాష్ట్ర స్థాయిలో ఉండే 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు ఉన్న ఇంగ్లీష్ పుస్తకాలలోని కాంప్రెహెన్షన్ లను పూర్తిగా చదువుకొని అర్థం చేసుకోవాలి.

వ్యాక్యాలను సరైన క్రమంలో అమర్చడం:

సాధారణంగా అత్యధిక స్కోర్ చేసే టాపిక్ ఇది.

ఇక్కడ గమనించవలసిన మరొక విషయం ఏమిటంటే ఈ విభాగం సమయాన్ని బాగా కిల్ చేస్తుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఈ అంశం మీద కూడా దాదాపు 15 నుండి 20 మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఇంగ్లీషు భాషపై పట్టు ఉన్న వారికి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది.

న్యూమరికల్, అర్థమెటిక్ ఎబిలిటీస్:

న్యూమరికల్, అర్థమెటిక్ నుండి దాదాపు 20 నుండి 30 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.

ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ముఖ్యంగా వివిధ పోటీ పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నలను బాగా సాధన చేయాలి.

ఒకే టాపిక్ పై రెండు లేదా అంతకన్నా ఎక్కువ ప్రశ్నలు రావడానికి ఆస్కారం ఉంది.

సాధారణంగా అయితే న్యూమరికల్, అర్థమెటిక్ ఎబిలిటీస్ లు మొత్తం దాదాపు 15 నుండి 20 టాపిక్‌లు ఉంటాయి. ప్రతి ఒక టాపిక్ నుండి ఒక మార్కు వస్తోంది. కొన్ని సార్లు ఒకే టాపిక్ నుండి రెండు ప్రశ్నలు కూడా రావచ్చు.

పేపర్ - 1 జనరల్ స్టడీస్:

జనరల్ స్టడీస్ లో మొత్తం 11 అంశాలు ఉంటాయి. సాధారణంగా ఈ సిలబస్‌ను రెండుగా విభజించుకోవచ్చు. ఒకటి తెలంగాణకు చెందిన అంశాలు అయితే రెండోది భారతదేశానికి చెందిన అంశాలు.

తెలంగాణ అంశాలు:

సాధారణంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారు రెండు రకాలుగా ఉంటారు. ఒక రకం జాతీయ స్థాయిలో జరిగే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతారు. రెండో రకం రాష్ట్ర స్థాయిలో జరిగే పరీక్షలకు ప్రిపేరవుతారు.

రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే వారు రాష్ట్రానికి చెందిన అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టడం మంచిది.

ఎందుకంటే ఈ పరీక్షలో తెలంగాణ అంశాలపై ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.

తెలంగాణ అంశాలు ఇవే:

తెలంగాణ కరెంట్ అఫైర్స్

తెలంగాణ ఎకానమీ

తెలంగాణ జాగ్రఫీ

తెలంగాణ రాష్ట్ర పాలసీలు

తెలంగాణ చరిత్ర

తెలంగాణ ఉద్యమం

తెలంగాణ సమాజం

సంస్కృతి, సంపద

కళలు, సాహిత్యం.

తెలంగాణ అంశాలు తక్కువ ఏమీ లేవు, చాలా విస్త‌ృతంగానే సిలబస్ ఉంది.

కాకపోతే జాగ్రత్తగా చూసి చదవాలి. అయితే తెలంగాణ ఉద్యమ చరిత్రకు చాలా తక్కువ ప్రాధాన్యత ఉంటుంది.

దాదాపు 5 నుండి 10 ప్రశ్నలు మాత్రమే రావచ్చు. అంతేకాని గ్రూప్ -2, గ్రూప్ -1 మెయిన్ పరీక్షలాగా అధిక ప్రాధాన్యత ఉండదు.

నేషనల్ వైడ్ అంశాలు:

భారతదేశానికి చెందిన అంశాలలో వివిధ సబ్జెక్టులు ఉంటాయి. అయితే వీటిని విస్తృతంగా చదవాల్సిన అవసరం లేదు.

కానీ ఏ అంశం మీద ఎందుకు ఫోకస్ చేయాలి అనే విషయం మాత్రం అర్థం కావాలి.

ముఖ్యంగా గత రెండు ఏళ్ల కాలంలో జరిగిన ముఖ్యమైన సమకాలీన అంశాలను కోర్ సబ్జెక్టులో అనుసంధానం చేసి చదవాలి.

భారతదేశానికి చెందిన అంశాలు:

నేషనల్ కరెంట్ అఫైర్స్

భారతదేశ ఎకానమీ

భారతదేశ జాగ్రపీ

భారత రాజ్యాంగం

రాజకీయ వ్యవస్థ

ప్రభుత్వం

ఆధునిక భారతదేశ చరిత్ర.

భారతదేశ చరిత్రకు సంబంధించి మొత్తం మూడు విభాగాలు ఉంటాయి.

అవి ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర.

సిలబస్ ప్రకారం మాత్రం ప్రాచీన, మధ్యయుగ భారతదేశ చరిత్రలు లేవు. ఆధునిక భారతదేశ చరిత్ర మాత్రమే ఉంది.

ఆధునిక భారతదేశ చరిత్రలో కూడా ముఖ్యంగా భారత జాతీయ ఉద్యమం మీద బాగా ఫోకస్ చేయాలి. భారత జాతీయ ఉద్యమం అంటే 1885 నుంచి 1947 వరకు.

అంతర్జాతీయ అంశాలు ముడిపడి ఉన్న సబ్జెక్టులు:

ఇక్కడ అంతర్జాతీయ అంశాలు కూడా ముడిపడి ఉన్న సబ్జెక్టులు అంటే సబ్జెక్ట్ చదివేటప్పుడు దాని బౌండరీలు భారతదేశానికి మాత్రమే చెందినవి కాకుండా, కామన్‌గా విస్తృతంగా ఉన్న సబ్జెక్టు అని అర్థం.

ఈ అంశం కిందికి వచ్చే సబ్జెక్టులు: అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్, అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు, పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ.

పర్యావరణ సమస్యలలో ముఖ్యంగా అంతర్జాతీయంగా చేసుకున్న చట్టాలు వాటికి భారతదేశంలో ఉన్న సంబంధాలు. అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందాలు, ఉల్లంఘనలు, సాధించవలసిన లక్ష్యాలు ముఖ్యంగా సుస్థిర అభివృద్ధి మొదలైన వాటి మీద బాగా ఫోకస్ పెట్టాలి.

విపత్తు నిర్వహణ:

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాక ముందు విపత్తు నిర్వహణ సబ్జెక్టులపై అధిక ప్రశ్నలు అడిగేవారు. అంటే 10 నుంచి 15 మార్కుల వరకు వచ్చేవి.

కానీ ప్రస్తుతం ట్రెండ్ ఆ విధంగా లేదు. ఇప్పుడు అత్యధికంగా 5 మార్కులకు మాత్రమే ఈ సబ్జెక్ట్ పరిమితమైంది.

పర్యావరణ సమస్యలు:

పర్యావరణ సమస్యలు సబ్జెక్టు మాత్రం ప్రస్తుతం బాగా వెయిటేజీ ఉన్న సబ్జెక్టు. అయితే ప్రశ్నలు కూడా ఈ సబ్జెక్టుపైన కఠినంగానే వస్తున్నాయి.

సాధారణంగా 7 నుంచి 15 మార్కుల వరకు రావడానికి అవకాశం ఉన్నప్పటికీ.. చదివేటప్పుడు సమయం కూడా బాగానే కేటాయించవలసి ఉంటుంది.

పేపర్ -1 జనరల్ స్టడీస్ .. అధిక మార్కులు సాధించాలంటే బాగా ప్రాక్టీస్ చేయాలి. రివిజన్ ఎక్కువ చేయాలి. రెగ్యులర్ గా సబ్జెక్టును చదవాలి. పాత ప్రశ్న పత్రాలను కూడా చదివి, విశ్లేషణ చేయాలి. అప్పుడు మంచి స్కోర్ వచ్చి ఉద్యోగం సాధించవచ్చు.

పృథ్వీ కుమార్ చౌహాన్, పృథ్వీస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్.


ఇవి కూడా చదవండి :

ఇండియన్ పాలిటీ: రాష్ట్రపతి అధికారాలు 


Similar News