UPSC మిస్సయిన వారికి ‘డిట్టో ఇన్సూరెన్స్’ జాబ్ ఆఫర్
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌కు లక్షల మంది ఏళ్ల తరబడి ఎగ్జామ్స్‌కు సన్నద్దమవుతుంటారు.
దిశ, డైనమిక్ బ్యూరో: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌కు లక్షల మంది సిద్దమతుంటారు. ఏళ్ల తరబడి ఎగ్జామ్స్‌కు అభ్యర్ధులు సన్నద్దమవుతుంటారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి ఉన్నత స్థాయి ఉద్యోగాల కోట్టాలని సివిల్ సర్వీసెస్ అభ్యర్థులు కలలు కంటుంటారు. కానీ పోస్టులు మాత్రం దాదాపు వెయ్యికి మించి ఉండవు. దీంతో ర్యాంకర్లు తప్ప పరీక్ష రాసిన ఎంతో మందికి నిరాశే మిగులుతుంది. అయితే అలాంటి వారి కోసం ప్రముఖ సంస్థ జాబ్ ఆఫర్ ఇచ్చింది. ఇటీవల upsc సివిల్ సర్వీసెస్ పరీక్షల రిజల్ట్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అందులో తృటిలో అవకాశం కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ‘డిట్టో ఇన్సూరెన్స్’ అనే సంస్థ ముందుకు వచ్చింది.
ఈ సందర్భంగా డిట్టో ఇన్సూరెన్స్ సహా వ్యవస్థాపకుడు భాను హరీష్ గుర్రం తాజాగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కొన్ని లక్షల మంది యూపీఎస్సీకి సిద్దమవుతుంటారని తెలిపారు. కానీ సుమారు 800 మంది మాత్రమే సెలెక్ట్ అవుతారని, దాదాపు 99 శాతం మంది విఫలమవుతారని పేర్కొన్నారు. మూడు, నాలుగు ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతున్న వారు తనకు తెలుసన్నారు. యూపీఎస్సీ ఒకటే కాదని, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్, బ్యాంక్ జాబ్స్ లాంటి ఇతర పోస్టులకు ఎంతో కృషితో ప్రిపేర్ అవుతారన్నారు. అందుకే యూపీఎస్సీ అభ్యర్థులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని, ఎలాంటి అనుభవం కూడా లేకున్న ఉద్యోగాలిస్తామని పేర్కొన్నారు.