కోల్‌కతాతో ఫైట్.. అహ్మదాబాద్‌లో హైదరాబాద్ జోరు కొనసాగేనా?

ఐపీఎల్-17 లీగ్ స్టేజ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జోరు అంతా ఇంతా కాదు.

Update: 2024-05-20 19:21 GMT

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17 లీగ్ స్టేజ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జోరు అంతా ఇంతా కాదు. విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆ జట్టు సంచలనాలు సృష్టించింది. అసలు ఆడుతున్నది హైదరాబాదేనా? అన్న డౌట్ కూడా చాలా మందిలో వచ్చింది. అంతలా ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లు చెలరేగారు. ఫలితంగా.. హైదరాబాద్ ప్లే ఆఫ్స్‌కు చేరుకోవడంతోపాటు టాప్-2లో నిలిచింది. మరో విజయం సాధిస్తే ఫైనల్లో అడుగుపెడుతుంది. మంగళవారం క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో టేబుల్ టాపర్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఎదుర్కోనుంది. ఈ మ్యాచ్‌కు అహ్మదాబాద్ వేదిక. అయితే, ఈ మ్యాచ్‌లో ఓడినా టైటిల్ పోరుకు అర్హత సాధించడానికి హైదరాబాద్‌కు మరో చాన్స్ ఉంటుంది. క్వాలిఫయర్-2‌లో గెలిస్తే ఫైనల్‌కు చేరుకోవచ్చు. మరి, క్వాలిఫయర్-1లోనే హైదరాబాద్ ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి.

ఈ సీజన్‌లో పాట్ కమిన్స్ సారథ్యంలో హైదరాబాద్ జట్టు అదరగొట్టింది. 14 మ్యాచ్‌ల్లో ఎనిమిది విజయాలు నమోదు చేసింది. గత సీజన్లలో బౌలింగ్‌తో నెట్టుకొచ్చిన జట్టు.. ఈ సారి బ్యాటింగ్ పవర్‌ను చూపెట్టింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్ త్రయం ఆట గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ముఖ్యంగా ఓపెనింగ్ హెడ్, అభిషేక్ విధ్వంసం వేరే లెవల్. ఈ ముగ్గురిలో ఏ ఇద్దరు క్రీజులో నిలిచినా కోల్‌కతా బౌలర్లకు చుక్కలు కనిపించడం ఖాయమే. తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి, రాహుల్ త్రిపాఠి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్‌లతో హైదరాబాద్ బ్యాటింగ్ దళం మునుపెప్పుడూ చూడని రీతిలో బలంగా ఉంది. ఈ సీజన్‌లో ఏడు మ్యాచ్‌ల్లో 200లకు పైగా స్కోరు చేసిందంటే హైదరాబాద్ బ్యాటింగ్ సామర్థ్యాన్ని అర్థం చేసుకోవచ్చు. రెండుసార్లు అత్యధిక స్కోర్ రికార్డులను లిఖించింది. బౌలింగ్‌ పరంగా కూడా ఎస్‌ఆర్‌హెచ్ మెరుగ్గానే ఉన్నా.. కొన్ని లోపాలను సరిదిద్దుకోవాల్సి ఉంది. జట్టు ముఖ్యంగా నటరాజన్(17 వికెట్లు), కెప్టెన్ కమిన్స్(15 వికెట్లు)‌లపైనే ఆధారపడింది. నేటి మ్యాచ్‌లో వారికి భువనేశ్వర్(11 వికెట్లు) కూడా తోడై జట్టుకు ఢోకా ఉండదు. అయితే, కోల్‌‌కతాను అధిగమించడం అంత సులభం కాదు. ఓపెనింగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ నిర్దేశించిన 205 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ ఛేదించిన విషయం తెలిసిందే. కాబట్టి, ఆ జట్టును ఓడించాలంటే హైదరాబాద్ ఆల్‌రౌండ్ షో చేయాల్సిందే.

ప్రత్యర్థి బలంగా..

లీగ్ స్టేజ్‌లో టేబుల్ టాపర్‌గా నిలిచిన కోల్‌కతా సామర్థ్యంపై అనుమానాలు లేవు. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ఆ జట్టు బలంగా ఉంది. అయితే, ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ లేకపోవడం ఆ జట్టుకు భారీ దెబ్బ. గత మ్యాచ్‌ల్లో సునీల్ నరైన్‌, సాల్ట్ నెలకొల్పిన శుభారంభాలే ఆ జట్టుకు ఎక్కువగా విజయాలు తెచ్చిపెట్టాయి. సాల్ట్ దూరమైన నరైన్, రఘువంశీ, రస్సెల్, రింకు సింగ్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్‌, నితీశ్ రాణాలతో ఆ జట్టు బ్యాటింగ్ బలానికి కొదువలేదు. మరోవైపు, వరుణ్ చక్రవర్తి, రస్సెల్, సునీల్ నరైన్, స్టార్క్‌లతో బౌలింగ్ దళం కూడా బాగానే ఉంది.

కేకేఆర్‌దే పైచేయి

ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఇరు జట్లు 26సార్లు ఎదురుపడ్డాయి. అందులో 17 విజయాలతో కోల్‌కతాదే ఆధిపత్యం. హైదరాబాద్ 9 మ్యాచ్‌ల్లో నెగ్గింది. ఈ సీజన్‌లో హైదరాబాద్ తన ఓపెనింగ్ మ్యాచ్‌లోనే కోల్‌కతాతో తలపడగా.. అందులో పరాజయం పాలైన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా ఇరు జట్లు పోటీపడటం ఇదే తొలిసారి.

పిచ్ రిపోర్టు

నరేంద్ర మోడీ స్టేడియం బ్యాటర్లకు, బౌలర్లకు సమానంగా అనుకూలించనున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. టాస్ గెలిచిన జట్టు చేజింగ్‌కు మొగ్గుచూపొచ్చు. ఈ సీజన్‌లో ఇక్కడ జరిగిన ఆరు మ్యాచ్‌ల్లో నాలుగింట సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టే నెగ్గింది. తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 175గా ఉన్నది.

Tags:    

Similar News