ఆయుష్ బదోని రనౌట్‌పై వివాదం.. అవుటా? నాటౌటా?
ఐపీఎల్-17లో ముంబై ఇండియన్స్ హ్యాట్రిక్ పరాజయాన్ని పొందింది. మంగళవారం లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయింది.
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో ముంబై ఇండియన్స్ హ్యాట్రిక్ పరాజయాన్ని పొందింది. మంగళవారం లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ సీజన్‌లో మొత్తంగా 7వ ఓటమితో ఆ జట్టు దాదాపుగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నట్టే. అద్భుతం జరిగితే తప్ప ఆ జట్టు ముందడుగు వేసే అవకాశం లేదు. మరోవైపు, లక్నో ఈ విజయంతో టాప్-4లోకి ప్రవేశించి నాకౌట్ ఆశలను మెరుగుపర్చుకుంది. అయితే, ఆ మ్యాచ్‌లో ఓ రనౌట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. 145 పరుగుల లక్ష్యాన్ని లక్నో చివరి ఓవర్‌లో ఛేదించింది. అయితే, ఛేదనలో 19వ ఓవర్‌లో లక్నో బ్యాటర్ ఆయుష్ బదోని రనౌట్‌పై ఇప్పుడు చర్చ జరుగుతుంది. పాండ్యా వేసిన ఆ ఓవర్‌లో తొలి బంతికి బదోని రెండో పరుగు తీసే ప్రయత్నంలో రనౌటయ్యాడు. నమన్ ధిర్ విసిరిన బంతిని అందుకున్న వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ వేగంగా స్టంప్స్‌ను కొట్టేశాడు. అప్పటికీ బదోని క్రీజులోకి వచ్చినా బ్యాటు మాత్రం గాల్లోనే ఉండటం కెమెరాలో కనిపించింది. దీంతో థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు. దీనిపై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. థర్డ్ అంపైర్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడని ట్వీట్ చేశాడు.
అయితే, దీనిపై లక్నో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బదోని రనౌట్ అవ్వలేదని, అంపైర్లు ముంబై ఇండియన్స్‌కు అనుకూలంగా వ్యవహరించారని మండిపడుతున్నారు. ‘అంపైర్ ఇండియన్స్’ అనే ట్యాగ్ వైరల్ చేస్తున్నారు. మరోవైపు, ముంబై ఫ్యాన్స్ సైతం వారికి కౌంటర్ ఇస్తున్నారు. బ్యాటు గాల్లో ఉంది కాబట్టి రూల్ ప్రకారం అది అవుటేనని వాదిస్తున్నారు.