అహ్మదాబాద్: ఐపీఎల్-16 ముగింపు దశకు చేరుకుంది. ఈ నెల 28న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో లీగ్ క్లోజింగ్ సెర్మెనీ కోసం బీసీసీఐ భారీ ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్, శ్రీలంక క్రికెట్ బోర్డుల అధ్యక్షులను ఫైనల్ మ్యాచ్‌కు ఆహ్వానించినట్టు బోర్డు సెక్రెటరీ జైషా వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ సారి ముగింపు వేడుకలను బోర్డు డిఫరెంట్ ప్లాన్ చేసింది. గతంలో ఫైనల్ మ్యాచ్‌కు ముందు సెలబ్రిటీలు పర్ఫామెన్స్ ఇచ్చేవారు.
ఈ సారి అలాకాకుండా.. మ్యాచ్ ప్రారంభానికి ముందు, మొదటి ఇన్నింగ్స్ తర్వాత రెండుసార్లు ప్రదర్శనలు ఉండేలా బీసీసీఐ ప్లాన్ చేసింది. మిడ్ మ్యాచ్ సెలబ్రేషన్స్ అని పిలుచుకునే ఈ తరహా సెలబ్రేషన్స్ నేషనల్ ఫుట్‌బాల్ లీగ్‌లో సక్సెస్ అయ్యాయి. ప్రేక్షకులను ఎంగేజ్ చేయడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని బీసీసీఐ భావిస్తున్నది. ముగింపు వేడుకలో ప్రముఖ ర్యాప్ సింగర్స్ వివియన్ డివైన్, నుక్లెయ, కింగ్ తమ పర్ఫామెన్స్ ఇవ్వనున్నారు. కెనడాకు చెందిన ప్లే బ్యాక్ సింగర్ జొనితా గాంధీ కూడా పాల్గొననుంది. అలాగే, బాలీవుడ్ స్టార్స్‌ను కూడా క్లోజింగ్ సెర్మెనీకి తీసుకొచ్చే అవకాశం ఉంది.