IPL 2023: ఉప్పల్‌లో రఫ్పాడించిన రాజస్థాన్.. అల్లాడిన హైదరాబాద్ బౌలర్స్!
ఐపీఎల్ 2023లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో రాజస్థాన్ భారీ స్కోర్ చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో రాజస్థాన్ భారీ స్కోర్ చేసింది. అతిథ్య సన్ రైజర్స్ బౌలర్లకు చుక్కలు చూపించిన రాజస్థాన్ బ్యాటర్స్.. ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద పారించారు. రాజస్థాన్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో రాజస్థాన్ 203 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేశారు. రాజస్థాన్‌కు ఓపెనర్లు జోస్ బట్లర్, యశస్వీ జైస్వాల్ మెరుపు ఆరంభానిచ్చారు. పవర్ ప్లేలో ఆ ఇద్దరు ఆకాశమే హద్దుగా చెలరేగి సన్ రైజర్స్ బౌలర్లను ఊతకోచ కోశారు. బట్లర్, జైస్వాల్ దెబ్బకి సన్ రైజర్స్ బౌలర్లు పవర్ ప్లే 6 ఓవర్లలోనే 85 పరుగులు సమర్పించుకున్నారు.
బట్లర్ 22 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులతో 54 పరుగులు చేయగా.. జైస్వాల్ 37 బంతుల్లో 9 ఫోర్లు బాది 54 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. బట్లర్, జైస్వాల్‌ల మెరుపు బ్యాటింగ్‌తో ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద పారింది. ఇక బట్లర్ ఔట్ అయిన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ సన్ రైజర్స్ బౌలర్లకు పగలే చుక్కలు చూపించాడు.
కేవలం 28 బంతుల్లోనే 4 సిక్సర్లు, 2 ఫోర్లు బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివర్లో హెట్మెయర్ 16 బంతుల్లో 22 పరుగులు చేయడంతో ఆర్ఆర్ 203 పరుగుల భారీ స్కోర్ చేసింది. రాజస్థాన్ బ్యాటర్ల ధాటికి సన్ రైజర్స్ బౌలర్లు పూర్తిగా తేలిపోయి భారీగా పరుగులు సమర్పించుకున్నారు. హైదరాబాద్ బౌలర్లలో ఫరూఖీ, నటరాజన్ చెరో రెండు వికెట్లు తీయగా.. ఉమ్రాన్ మాలిక్ ఓ వికెట్ తీశాడు. అనంతరం సన్ రైజర్స్ హైదరాబాద్ 204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగింది.